Kantara: తెలుగు సినిమాకు ‘కాంతార’ హీరో గ్రీన్‌ సిగ్నల్‌

‘కాంతార’ మట్టిలోంచి పుట్టిన కథ అని, హీరో రిషబ్‌శెట్టి నటనకు తాను ముగ్దుడిని అయ్యానన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ‘కాంతార’ సక్సెస్‌ మీట్‌ విశేషాలివీ..

Published : 19 Oct 2022 23:10 IST

హైదరాబాద్‌: తమ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో హీరోగా నటించేందుకు కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) అంగీకరించారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) తెలిపారు. ‘కాంతార’ (Kantara) సక్సెస్‌ మీట్‌లో ఆయన ప్రకటించారు. రిషబ్‌ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ కన్నడలో ఘన విజయం అందుకోగా, తెలుగులోకి డబ్‌ చేసి అదే పేరుతో ఈ నెల 15న అల్లు అరవింద్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘కాంతార’ ఇక్కడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సందర్భంగా సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకే మేం ఇక్కడికి వచ్చాం. సినిమాకు భాష అడ్డుకాదనే విషయం ‘కాంతార’తో మరోసారి నిరూపితమైంది. ఎమోషన్‌కే ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. ఇది హాలీవుడ్‌ సినిమాలను చూసి తీసిన సినిమా కాదు. మట్టిలోంచి పుట్టిన కథ ఇది. తన ఊరికి సంబంధించిన విశేషాలను తెరపైకి తీసుకొచ్చినందుకు రిషబ్‌ను అభినందిస్తున్నా. సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. కన్నడలో ఈ సినిమా చూసొచ్చిన బన్నీవాసు నన్నూ చూడమన్నాడు. ‘ఎందుకిలా చెబుతున్నాడో’ అని సినిమాని చూశా. రిషబ్‌ నటనకు ముగ్దుడినయ్యా. తెలుగు ప్రేక్షకులకూ ఆ అనుభూతి పంచాలనే ఉద్దేశంతో డబ్‌ చేసి, విడుదల చేశాం. నేను మా ‘గీతా ఆర్ట్స్‌’ సంస్థలో ఓ సినిమా చేయాలని కోరితే రిషబ్‌ అంగీకరించారు’’ అని అల్లు అరవింద్‌ తెలిపారు. ‘‘తెలుగులో విడుదలైన 5 రోజులకే ఈ సినిమా రూ. 20 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది’’ అంటూ రిషబ్‌శెట్టి తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని