Adipurush: మల్టీప్లెక్స్‌లో 300 టికెట్లు బుక్ చేసిన కృతి.. ఎవరి కోసమో తెలుసా..!

‘ఆదిపురుష్‌’ (Adipurush) కోసం ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు టికెట్లు బుక్‌ చేసి వారి అభిమానాన్ని చూపారు. తాజాగా కృతి సనన్‌ దిల్లీలోని మల్టీఫ్లెక్స్‌లో ఓ షో మొత్తానికి టికెట్స్‌ బుక్‌ చేసినట్లు సమాచారం.

Updated : 22 Jun 2023 15:46 IST

హైదరాబాద్‌: ఇటీవల విడుదలైన ‘ఆదిపురుష్‌’లో కృతిసనన్‌ (Kriti Sanon) జానకీగా కనిపించిన సంగతి తెలిసిందే. సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చినా.. కృతి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందంటూ ప్రేక్షకులు ఆమెను ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం కృతి దిల్లీలోని ఓ మల్టీప్లెక్స్‌లో 300 టికెట్లను బుక్‌ చేసినట్లు సమాచారం. తాను చదువుకున్న దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ పిల్లల కోసం ఇవి బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. వాళ్లతో పాటు కృతి కూడా తన కుటుంబంతో కలిసి మరోసారి సినిమా చూడనుందట. ఈ మేరకు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక కృతికి తాను చదువుకున్న స్కూల్‌ అంటే ఎంతో అభిమానం. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని తెలుపుతూ ఉంటుంది. ఇటీవల స్కూల్‌ ప్రారంభించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా సోషల్‌ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌ పెట్టి అభినందించింది. అలాగే గతంలో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘భేడియా’ సినిమాను ఆ స్కూల్‌లోనే ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే.

భావోద్వేగాలను అర్థం చేసుకోండి..

‘ఆదిపురుష్‌’ టీజర్‌ విడుదల నుంచే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. విడుదలయ్యాక రకరకాల వివాదాలు ఈ సినిమాను చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో కృతి సనన్‌ తల్లి గీత సనన్‌ పెట్టిన పోస్ట్‌ నెటిజన్లను ఆకర్షిస్తుంది. రామాయణంలోని ఓ సన్నివేశాన్ని గురించి తెలిపిన ఆమె అందరి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని కోరింది. ‘‘మంచి మనస్తత్వంతో చూస్తే ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుంది. శబరి రాముడికి ఇచ్చిన పండ్లలో రాముడు ఆమె ప్రేమను, భక్తిని చూశాడు. అంతేకానీ ఆమె సగం తిన్నదని చూడలేదు. ఒక వ్యక్తిలోని తప్పులను చూడొద్దు. వారి భావోద్వేగాలను అర్థం చేసుకోండి’’ అని పోస్ట్‌ పెట్టింది. 

రామాయణం ఆధారంగా అత్యున్నత సాంకేతికతతో దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas) రాముడిగా నటించారు. సీతగా హీరోయిన్‌ కృతిసనన్‌ కనిపించారు. రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ తన నటనతో ఆకట్టుకుంటున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని