నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!

‘ఆటగదరా శివ’ ‘మిస్‌మ్యాచ్‌’ వంటి విలక్షణ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఉదయ్‌శంకర్‌ ‘క్షణక్షణం’ అంటూ త్వరలో థియేటర్లలోకి రాబోతున్నారు. హీరోగా మొదటి చిత్రం నుంచే వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను

Published : 25 Feb 2021 23:36 IST

హైదరాబాద్‌: ‘ఆటగదరా శివ’ ‘మిస్‌మ్యాచ్‌’ వంటి విలక్షణ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఉదయ్‌శంకర్‌ ‘క్షణక్షణం’ అంటూ త్వరలో థియేటర్లలోకి రాబోతున్నారు. హీరోగా మొదటి చిత్రం నుంచే వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకున్నారు. మరి ఆ క్రమంలోనే ప్రస్తుతం రాబోతున్న ‘క్షణక్షణం’ చిత్రం విశేషాలను ఉదయ్‌శంకర్‌ మనతో పంచుకున్నారు..

ఈసారి కమర్షియల్‌గానూ హిట్‌ కొడతాం..

నా గత చిత్రాలు ‘ఆటగదరా శివ’,‘మిస్‌మ్యాచ్‌’ చిత్రాలను ప్రేక్షకులు మంచి కథాబలమున్న సినిమాలుగా భావించినా.. కమర్షియల్‌ హిట్‌ సాధించలేకపోయాం. ఇప్పటికీ నా తొలి చిత్రం ‘ఆటగదరా శివ’ అమెజాన్‌ వ్యూస్‌ టాప్‌10లో ఉంటుంది. అందుకే ఈ సారి ఆ లోటుపాట్లన్నీ దిద్దుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ప్రముఖ నిర్మాత బన్నీవాసుగారు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. ఆయనకు క్లైమాక్స్‌ బాగా నచ్చింది. కొన్ని మార్పులు కూడా సూచించారు. కచ్చితంగా ఆడియన్స్‌ ఒక మంచి సినిమా చూసిన ఫీల్‌ పొందుతారు

కథ వినగానే ఒకే చెప్పేశా..
గతేడాది జూన్‌లో ఈ కథ విన్నాను. జులై నుంచి ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించాం. అప్పుడే లాక్‌డౌన్‌ ముగిసి షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చారు. కథ మొత్తం వైజాగ్‌ సముద్రతీరంలో నడుస్తుంది. కానీ కరోనా దృష్ట్యా ఇంటీరీయర్‌ సీన్స్‌ అన్ని హైదరాబాద్‌లో షూట్‌ చేశాం. ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని వైజాగ్‌లో షూట్‌ చేశాం. సినిమా కూడ రెండుగంటల్లోనే ముగుస్తుంది. బన్నీవాసుగారు సినిమాను ఎక్కువ ప్రమోట్‌ చేయమని చెప్పారు. లేకుంటే మంచి సినిమాను ప్రేక్షకులు మిస్‌ అవుతారని ఆయన అన్నారు. గీతా ఆర్ట్స్‌ ద్వారా ఈ  సినిమా థియేటర్లలో రిలీజ్‌ అవ్వడం మా అదృష్టం.

ఇందులో హీరో పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది..

ఈ చిత్రంలో నేను చాలా సహజంగా నటించా. ఎందుకంటే ఇందులోని ప్రధాన పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఒక సగటు మనిషిగా మనం ఒకటనుకుంటే అవి జరగ్గపోగా కొత్త చిక్కులు వచ్చి పడుతుంటాయి. మోసపోతూ ఉంటాం. అప్పుడు మనం పడే మానసికవేదన వర్ణనాతీతం. ఆ సమస్యల నుంచి ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో ఈ స్క్రిప్ట్‌ను మలిచాం.

‘క్షణక్షణం’ అనే టైటిల్‌ హైప్‌ కోసం పెట్టలేదు.
ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేవరకు టైటిల్‌ నిర్ణయించలేదు. కొన్ని అనుకున్నాం కానీ, డైరెక్టర్‌ కార్తీక్‌కు నచ్చలేదు. ఆయనే ‘క్షణక్షణం’టైటిల్‌ పెడదామన్నారు. ఈ టైటిల్‌తో ఆర్జీవీ-వెంకీ-శ్రీదేవి కాంబోలో వచ్చిన సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఆ బజ్‌ కోసం మేం టైటిల్‌ పెట్టలేదు. సినిమా చూశాక ‘క్షణక్షణం’మంచి టైటిల్‌ అని అందరూ భావిస్తారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఆడియన్స్‌ ఊహించని విధంగా ఉండి ఉత్కంఠకు గురిచేస్తుంది. కథలో మిళితమైన డార్క్‌ కామెడీ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. హీరోయిన్‌ జియా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

కోటీగారికి ఇది మొదటి చిత్రం..
సంగీత దర్శకుడు కోటి మా చిత్రంలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. నటుడిగా ఆయన మొదటి చిత్రం ఇది. ఆ లాయర్‌ పాత్రకు మొదట కీరవాణిగారిని అనుకున్నాం. కానీ, కోటీ కుమారుడు రోషన్‌ మా చిత్రానికి సంగీతం అందిస్తుండడంతో ఆయన్ను సంప్రదించాం. కోటీగారు కూడా ఏదోలా నటించేస్తే చాలు అనుకోకుండా పాత్రలో జీవించారు. తెరపై ఆయన నటనను చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టాల్సిందే. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం.

అనుకున్నది అనుకున్నట్టు తీశాం..
ఈ కథకు ప్రీ ప్రొడక్షన్‌లో స్క్రిప్ట్‌ ఎలా అనుకున్నామో అలాగే తెరకెక్కించాం. అంత కంటే బాగా వచ్చినా కూడా ఈ సినిమాకు ఇబ్బందే. అలాంటి స్టోరీ ఇది. రెండుగంటల్లో సినిమా ముగించాలని ముందునుంచే ప్లాన్‌ చేసుకున్నాం. మొత్తం 26 రోజుల్లో షూట్‌ పూర్తి చేశాం. ఈ చిత్రంలోని కీలకమైన కొన్ని సీన్లు వైజాగ్‌ ఫిషింగ్‌ హార్బర్‌లో చేయాలి. అక్కడి అధికారులు ఇచ్చిన అనుమతితో, 42 మంది సిబ్బందితో, కరోనా జాగ్రత్తలు పాటించి  చకచకా షూట్‌ ముగించాం. నిర్మాతల్లో ఒకరైన మౌళి, వర్మ  చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసుకున్నారు.

మా సినిమాలో ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్లు నటించారు..

ఈ చిత్రంలో కోటిగారితో పాటు రఘుకుంచె, ‘మిస్‌మ్యాచ్‌’కు మ్యూజిక్‌ అందించిన గిఫ్టన్‌ కూడా నటించడం విశేషం. వాస్తవానికి గిఫ్టన్‌ నా స్నేహితుడు. ముహూర్తం షాట్‌కు నాకు ఆల్‌దిబెస్ట్‌ చెప్పడానికి వస్తే ఆయన గెటప్‌ చూసి ఈ చిత్రంలో నటింపజేయాలని డైరెక్టర్‌ కార్తీక్‌ అనుకున్నారు. అలా గిఫ్టన్‌ ఈ సినిమాలో భాగమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి నటిస్తున్నపుడు మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ రోషన్‌ నేపథ్య సంగీతం అందిస్తుంటే థ్రిల్‌కు ఫీలయ్యాం.

ఈ సినిమా ఆడితేనే నాకు మరో సినిమా..
నా కుటుంబ నేపథ్యానికి, ఈ సినీ రంగానికి ఏ మాత్రం సంబంధం లేదు.  నాలాంటోళ్లు జనానికి దగ్గరవ్వాలంటే కథాబలమున్న సినిమాలతోనే ముందుకెళ్లాలి. ఈ సినిమా ఫలితంపైనే నా సినీ భవిష్యత్తు ఆధారపడిఉంది. సినిమాలో కూడా ఒక సామాన్యుడి కష్టాలను కథగా చూపించాం. అదే మా సినిమాకు ప్రధాన బలం. చివరి 20 నిమిషాలు ప్రేక్షకుల మునివేళ్లపై కూర్చోవటం ఖాయం. ఈ చిత్రంలో కేవలం 7 పాత్రలే ఉంటాయి.

విలన్‌ పాత్రలు కూడా చేస్తా..
ప్రస్తుతం అయితే హీరో పాత్రల్లో నటించాలని ఉంది. పాత్ర నచ్చితే విలన్‌ పాత్రలు చేయడానికైనా సిద్ధం. నటుడు విజయ్‌సేతుపతి నాకు ఆదర్శం. అలాగే ‘సఖి’లాంటి ఒక లవ్‌స్టోరీలో నటించాలని ఉంది. చివరిగా నేను చెప్పేది ఒకటే యూనిట్ అంతా నిజాయతీగా పనిచేశాం. కచ్చితంగా అందరూ మా ‘క్షణక్షణం’చిత్రాన్ని థియేటర్‌కు వచ్చి వీక్షిస్తారని ఆశిస్తున్నా.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని