Major: ‘మేజర్‌’ శేష్‌ పాటతో వచ్చారు.. ధనుష్‌ ‘సార్‌’ షూట్‌ మొదలెట్టారు!

ప్రేక్షకుల్ని అలరించేందుకు 2022లో వైవిధ్యభరిత కథలు సిద్ధమవుతున్నాయి. సరికొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తున్నాయి. మేజర్‌ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవిత కథను అడివి శేష్‌ పరిచయం చేయనున్నారు.

Published : 07 Jan 2022 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేక్షకుల్ని అలరించేందుకు 2022లో వైవిధ్యభరిత కథలు సిద్ధమవుతున్నాయి. సరికొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తున్నాయి. మేజర్‌ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవిత కథను అడివి శేష్‌ పరిచయం చేయనున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ ‘సార్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్‌పై ఓ లుక్కేయండి.

లుక్‌ అదిరింది సార్‌..

ధనుష్‌ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘సార్‌’. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నేడు మొదలైంది. ఓ పోస్టర్‌ను పంచుకుంటూ చిత్ర బృందం ఈ విషయాన్ని తెలియజేసింది. ధనుష్‌.. టక్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ధనుష్‌ ముఖం కనిపించకుండా వెనుదిరిగి ఉన్న ఫొటోని షేర్‌ చేసి చిత్ర బృందం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో ధనుష్‌ జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ధనుష్‌ సరసన సంయుక్త మేనన్‌ నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయికుమార్‌, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: దినేష్‌ కృష్ణన్‌.

వినవే హృదయమా..

‘మేజర్‌’లోని ‘హృదయమా’ అనే గీతాన్ని ప్రముఖ నటుడు మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా శుక్రవారం విడుదల చేశారు. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. వీఎన్‌వీ రమేశ్‌కుమార్‌, కృష్ణకాంత్‌ రచించిన ఈ గీతానికి శ్రీచరణ్‌ పాకాల స్వరాలందించారు. శేష్‌, సయీ మంజ్రేకర్‌లపై చిత్రీకరించిన ప్రేమ గీతమిది. ఈ చిత్రానికి శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శేష్‌ టైటిల్‌ పాత్రలో కనిపించనున్నారు. శోభిత ధూళిపాళ మరో కథానాయిక. ఈ సినిమాని జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని