manchu vishnu: ‘మా’ బైలాస్‌ మారుస్తాం

‘మా’ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాం. సభ్యులు అందరికీ జవాబుదారీగా పనిచేస్తామని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థల ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 19 Oct 2021 12:49 IST

‘మా’ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాం. సభ్యులు అందరికీ జవాబుదారీగా పనిచేస్తామని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థల ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మా’ ఏర్పాటైనపుడు తయారు చేసుకున్న బైలాస్‌లో మార్పులు చేస్తామన్నారు. సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించిన తరువాత సర్వసభ్య సమావేశంలో పెట్టి సభ్యుల ఆమోదంతో బైలాస్‌ మారుస్తామన్నారు. ఇకపై ఎవరికిపడితే వారికి సంఘంలో సభ్యత్వం ఇచ్చేందుకు అవకాశం లేకుండా ఆంక్షలు కఠినతరం చేస్తామని పేర్కొన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఏదో జరిగిపోయిందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, సీసీటీవీ ఫుటేజీలను చూడటంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రకాష్‌రాజ్‌, నాగబాబు ఇచ్చిన రాజీనామాలను ఆమోదించక తొలి కార్యవర్గ సమావేశంలోనే తిరస్కరించినట్లు చెప్పారు.

మా అధ్యక్ష పదవి బాధ్యతతో కూడుకున్నది: మోహన్‌బాబు

మా అధ్యక్ష పదవి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. సోమవారం ఆయనతోపాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు, మంచు లక్ష్మి, విష్ణు ప్యానెల్‌ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ ‘మా’ను విష్ణు అద్భుతంగా తీర్చిదిద్దుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీవారిని దర్శించుకున్నవారిలో బాబుమోహన్‌, గౌతంరాజు, శివబాలాజీ, జయవాణి తదితరులు ఉన్నారు.


వారి రాజీనామాలు ఇంకా రాలేదు

న్యూస్‌టుడే, చంద్రగిరి గ్రామీణ, తిరుమల: ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌లో గెలిచిన వారంతా తమ పదవులకు రాజీనామా చేయడంపై స్పందించిన మంచు విష్ణు..ఆ రాజీనామాలు తమకు ఇంకా  రాలేదని, వచ్చిన తరువాత చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వారికే సంఘంలో సభ్యత్వం ఇస్తామని, వారే ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిబంధనను చట్టంలోకి తీసుకువస్తామన్న ప్రచారంపై స్పందించిన ఆయన ఇప్పటి వరకు తమకు అలాంటి ఆలోచన లేదన్నారు. ఆన్‌లైన్‌ సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్లు తెలిపారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని