Mission Impossible 7 Review: రివ్యూ: మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకొనింగ్‌ (పార్ట్‌-1)

Mission Impossible 7 Review: టామ్‌ క్రూజ్‌ కీలక పాత్రలో నటించిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకొనింగ్‌’ ఎలా ఉందంటే?

Updated : 13 Jul 2023 17:21 IST

Mission Impossible 7 Review: చిత్రం: మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకొనింగ్‌ (పార్ట్‌-1); నటీనటులు: టామ్ క్రూజ్, హైలీ యాట్‌వెల్, వింగ్ రైమ్జ్, సైమన్ పెగ్, రెబెక్కా, హెన్రీ చెర్నీ, వనేసా కొర్బీ, పోమ్, ఇసై మోరల్స్ తదితరులు; సంగీతం: లోర్న్ బెల్ఫ్; సినిమాటోగ్రఫీ: ఫ్రెజర్ టాగ్గర్ట్; ఎడిటింగ్‌: ఎడ్డీ హామిల్టన్‌; రచన: క్రిస్టోఫర్ మెక్ క్వారీ, ఎరిక్ జెండ్రెస్సెన్; నిర్మాతలు: టామ్ క్రూజ్, క్రిస్టోఫర్ మెక్ క్వారీ; దర్శకత్వం: క్రిస్టోఫర్ మెక్ క్వారీ

యాక్షన్‌ ప్రియులను విశేషంగా అలరించే  స్పై యాక్షన్‌ థ్రిల్లర్స్‌  ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ ’ సిరీస్‌. జేమ్స్‌ బాండ్‌ సినిమాలకు ఏమాత్రం తీసిన పోని విధంగా కథలు సాగుతుంటాయి. టామ్‌ క్రూజ్‌ (Tom Cruise) లేకుండా ఈ సినిమాలను అస్సలు ఊహించలేం. ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో 6 చిత్రాలు రాగా, ఆఖరి మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో ఒక భాగమే ‘డెడ్‌ రెకొనింగ్‌:పార్ట్‌1’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? (Mission Impossible 7 Review) ఈసారి ఈథన్ హంట్‌ ఎంచుకున్న మిషన్‌ ఏంటి?

కథేంటంటే: సముద్రంలో శత్రు దేశాల రాడార్‌లకు కూడా చిక్కకుండా తిరిగే సామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్‌లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ‘ది ఎంటిటీ’ సోర్స్ కోడ్ ఉంటుంది.  రెండు ‘కీ’లను కలిపి ఒకటిగా చేసి మాత్రమే దాన్ని అన్‌లాక్‌ చేసి, నియంత్రించగలరు, అనుకోని పరిస్థితుల్లో ఆ సబ్‌మెరైన్‌ పేలిపోయి మునిగిపోతుంది. అందులోని వారందరూ చనిపోతారు. కానీ, ఆ రెండు ‘కీ’లు సముద్రంలో నుంచి మాయం అవుతాయి. వాటిని దక్కించుకుని ‘ది ఎంటిటీ’ని నియంత్రించగలిగితే  ప్రపంచాన్ని శాసించే శక్తిని సొంతం చేసుకోవచ్చు. ఏ టెక్నాలజీనైనా సులభంగా హ్యాక్‌ చేయవచ్చు.  (Mission Impossible 7 Review) ఆ తాళాలను చేజిక్కించుకుని, ఈ ప్రపంచాన్ని శాసించాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. దీంతో ఆ తాళాలు దుష్టుల చేతిలో పడకుండా కాపాడే బాధ్యత మిషన్‌ ఇంపాజిబుల్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ ఈథన్‌ హంట్‌కు వస్తుంది. మరి ఆ తాళాల కోసం ఈథన్‌ హంట్‌ చేసిన సాహసం ఏంటి? ఈ క్రమంలో అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.  కంటికి కనిపించని శత్రువుతో ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: భారీ యాక్షన్‌ సీన్లు, ఒళ్లు గగురుపొడిచే ఛేజింగ్‌లు, మాస్క్‌లతో ముఖాలను మార్చి శత్రువులను బురిడీ కొట్టించడం ఇలాంటి థ్రిల్లింగ్‌ సీన్స్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌ చూసేవాళ్లకు కొత్తేమీ కాదు. గత చిత్రాలకు ఏమాత్రం తీసి పోని విధంగా కొత్త చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ -7’ను తీర్చిదిద్దాడు దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీ. కానీ, ఏదో చిన్న వెలితి. యాక్షన్‌ ప్రియులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నా, చెప్పుకోదగ్గ ట్విస్ట్‌లు లేవు. కథా, కథనాలు హైవే మీద కారు ప్రయాణంలా సాఫీగా  సాగిపోతూ ఉంటాయి. యాక్షన్‌ సీన్స్‌ వచ్చినప్పుడు మాత్రం ఆ వేగం మరింత ఉత్కంఠకు గురి చేస్తుంది. బహుశా పార్ట్‌-2 ఉందన్న ఉద్దేశంతో ఇందులో ఎక్కువ ట్విస్ట్‌ల జోలికిపోలేదేమో. ఆసక్తికర విషయం ఏంటంటే, మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణమైన కథను ఎంచుకున్నాడు దర్శకుడు . ప్రస్తుతం సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ది కీలకపాత్ర. చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. కానీ, అదే ఏఐ మానవులకు సమస్యగా పరిణమిస్తే, ప్రతి ఒక్కరి భవిష్యత్‌ను నిర్ణయించేది, శాసించేది కూడా ఏఐ అయితే, ఊహించడమే కష్టంగా ఉంది కదా! (Mission Impossible 7 Review in telugu)అలాంటి టెక్నాలజీని చెడ్డ వ్యక్తులు నియంత్రిస్తే ఆ పరిణామాలు మరింత ఘోరంగా ఉంటాయి.  ‘ది ఎంటిటీ’ వల్ల సబ్‌మెరైన్‌ ఎలా మునిగిపోయిందో చెబుతూ, దాని శక్తిని చూపించాడు దర్శకుడు.‘ది ఎంటిటీ’ని నియంత్రించే ‘కీ’ అన్వేషణ కోసం ఈథన్‌ హంట్‌ రంగంలోకి దిగడంతో కథలో వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి కథా, కథనాలు పరుగులు పెడతాయి. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌ టైమ్‌తో పోటీగా పరుగులు పెడుతుంది. ‘కీ’ అన్వేషణలో భాగంగా ఎయిర్‌పోర్ట్‌లో సాగే హైడ్‌ అండ్‌ సీక్‌ను తలపించే సన్నివేశాలను ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతాయి. అలాగే మరోవైపు బాంబును నిర్వీర్యం చేసే సీన్‌ కూడా చాలా ఉత్కంఠగా ఉంటుంది.

ఫేస్‌ రికగ్ననేషన్‌లాంటి అత్యున్నత టెక్నాలజీని కూడా ఎలా బురిడీ కొట్టించవచ్చో చాలా బాగా చూపించారు. ఆ తర్వాత ‘కీ’ పాటు కథ కూడా రోమ్‌కు చేరుకుంటుంది. అక్కడ సాగే ఛేజింగ్‌ సీన్స్‌ సినిమాకే హైలైట్‌. ఒకవైపు పోలీసులు, మరోవైపు శత్రువులు ఇలా ఈథన్‌ హంట్‌ అతడి టీమ్‌ వెంటపడటం, ఇద్దరు మాత్రమే కూర్చొనే కారులో ఈథన్‌ హంట్‌ తప్పించుకునే సీన్స్‌ నవ్వులు పంచుతూనే అలరిస్తాయి. ‘ది ఎంటిటీ’ ఎంచుకున్న వ్యక్తి, ఈథన్‌ జీవితాన్ని తల్లకిందులు చేసిన వ్యక్తి ఇద్దరూ ఒకటే కావడంతో పాత మిషన్‌ ఇంపాజిబుల్‌ కథలకు దర్శకుడు ముడిపెట్టాడు. (Mission Impossible 7 Review) ద్వితీయార్ధం కూడా ‘కీ’ కోసమే సాగే సీన్స్‌తో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్రైన్‌ ఫైట్‌ తీర్చిదిద్దిన విధానానికి స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ నూటికి నూరు మార్కులు వేయుచ్చు. ‘ది ఎంటిటీ’ ఎక్కడుందో ఈథన్‌ హంట్‌ తెలుసుకునే సీన్‌ భావోద్వేగ భరితంగా ఉంటుంది.  దాదాపు 30నిమిషాల పాటు సాగే క్లైమాక్స్‌లో టామ్‌ క్రూజ్‌ చేసిన బైక్‌ స్టంట్‌ నభూతో. ‘ది ఎంటీటీ’ కోసం ఈథన్‌ హంట్‌ సాగించే తర్వాతి ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. ఇప్పటివరకూ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చూడని వారికి కూడా సినిమా అర్థమవుతుంది. అయితే, కచ్చితంగా సినిమాను ఫస్ట్‌ సీన్‌ నుంచి చూడాలి. అప్పుడే అసలు ‘ది ఎంటిటీ’ అంటే ఏంటో తెలుస్తుంది. ఈ వీకెండ్‌లో ఒక యాక్షన్‌ మూవీ చూడాలనుకుంటే ‘మిషన్‌ ఇంపాజిబుల్‌-7’ మంచి ఆప్షన్‌. తెలుగు ఆడియోలోనూ కొన్ని థియేటర్స్‌లో ఆడుతోంది.

ఎవరెలా చేశారంటే: ఈథన్‌ హంట్‌ పాత్రలో టామ్‌ క్రూజ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం. ఎందుకంటే సిరీస్‌ కోసం ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన సాహసాలు సినీ చరిత్రలో నిలిచిపోతాయి. ఈ సినిమా కోసం 61 ఏళ్ల వయసులోనూ ఆయన చేసిన బైక్‌ స్టంట్‌చూస్తే, 1996లో మొదటి ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లో ఏ ఎనర్జీతో అయితే నటించారో అలాగే ఇందులోనూ చేశారు.(Mission Impossible 7 Review) గ్రేస్ పాత్రలో హైలే ఎట్‌వెల్ చక్కగా నటించింది. ఇక సైమన్ పెగ్, వింగ్‌ రెహమ్స్‌లు వినోదాన్ని పంచారు.  మిషన్‌ ఇంపాజిబుల్‌ రోగ్‌ నేషన్‌, ఫాల్‌ అవుట్‌ చిత్రాల్లో కనిపించిన రెబెక్కా ఫెర్గూసన్‌ పాత్రను ఇందులో ముగించారు.  ప్రతినాయకుడు గాబ్రియల్‌గా ఇసాయ్‌ మోరల్స్‌ పాత్రను కూడా కథానాయకుడిగా దీటుగా తీర్చిదిద్దారు. సెకండాఫ్‌లో ఈ పాత్రతో పాటు ‘ది ఎంటిటీ’ ఏం చేస్తుందో చూడాలి.

సాంకేతికంగా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. లోర్న్‌ బెల్ఫ్‌ సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్‌ చేసింది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ థీమ్‌ను కొత్తగా డిజైన్‌ చేశారు. కొన్ని చోట్ల ఏ శబ్దమూ లేకుండా వచ్చే సీన్స్‌ థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి భలే అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్‌ టాగ్రెట్‌ ది బెస్ట్‌ ఇచ్చారు. ఎడిటర్‌ ఎడ్డీ హామిల్టన్‌ మాత్రం తన కత్తెరకు ఇంకా పదును పెట్టాల్సింది. సినిమా రన్‌ టైమ్‌ రెండు గంటల 43 నిమిషాలు దాదాపు పది నిమిషాలు ట్రిమ్‌ చేయవచ్చు. దర్శకుడు క్రిస్టోఫర్‌ మెక్ క్వారీ ప్రస్తుత కాలానికి అనుగుణంగా మంచి పాయింట్‌ను ఎంచుకున్నారు. (Mission Impossible 7 Review) అందుకు తగినట్లే సన్నివేశాలను రాసుకున్నారు. అయితే, నిడివి పెరిగిపోయింది. ‘ది ఎంటీటీ’ ఈథన్‌ హంట్‌ స్నేహితుడిలా మాట్లాడుతూ అతడిని తప్పుదోవ పట్టిస్తుంది. అలాంటి ఆసక్తికర సన్నివేశాలను ఒకట్రెండు రాసుకుని ఉంటే అసలు ‘ది ఎంటీటీ’ బలమేంటో ఇంకాస్త బాగా అర్థమయ్యేది. ఇది కేవలం పార్ట్‌-1 మాత్రమే కాబట్టి, ప్రేక్షకులను మెప్పించే సన్నివేశాలను ‘పార్ట్‌-2’ కోసం దాచి పెట్టి ఉండవచ్చు.

  • బలాలు
  • + టామ్‌ క్రూజ్‌ నటన
  • + యాక్షన్‌ సీన్స్‌
  • + సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం
  • బలహీనతలు
  • - నిడివి
  • చివరిగా:  యాక్షన్‌ ప్యాక్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌-7’.. అసలు కథ ఇప్పుడే మొదలైంది. (Mission Impossible 7 Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు