BRO: పవన్‌ ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది: ఎంపీ రఘురామ

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమా చూసిన ఎంపీ రఘురామ కృష్ణరాజు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 28 Jul 2023 21:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అభిమానులే కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ‘బ్రో’ (BRO) అని అన్నారు నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju). తాజాగా ఈ సినిమా చూసిన ఆయన ‘బ్రో’ టీమ్‌ని కొనియాడారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘బ్రో’ని ఇప్పుడే చూశా. ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంకాదనే అంశంతో తెరకెక్కింది. మానవ జీవితాలను స్పృశిస్తుంది. పవన్‌ అభిమానులే కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, త్రివిక్రమ్‌, నిర్మాత, నా స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్‌, దర్శకుడు సముద్రఖని, సంగీత దర్శకుడు తమన్‌కు, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

దాన్ని ముందే ఊహించాం: ‘బ్రో’ సెలబ్రేషన్స్‌లో సాయిధరమ్‌ తేజ్‌

భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. తన గత సినిమాల్లోని కొన్ని పాటలకు పవన్‌ వేసిన స్టెప్పులు, త్రివిక్రమ్‌ (Trivikram) అందించిన సంభాషణలు సినీ అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. కాలం అనే దేవుడి పాత్రలో పవన్‌ సందడి చేయగా, మార్క్‌ అలియాస్‌ మార్కండేయులుగా సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ఆకట్టుకున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలుగా నటించారు. బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించి, మెప్పించారు.

క‌థేంటంటే: ఇంటికి పెద్ద కొడుకైన మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధ‌ర‌మ్ తేజ్) తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత అన్ని బాధ్య‌త‌ల్నీ త‌న  భుజాన మోస్తుంటాడు. ఇద్ద‌రు చెల్లెళ్లు, త‌మ్ముడు స్థిర‌ప‌డాల‌ని... ఉద్యోగంలో త‌ను మ‌రింత ఎత్తుకు ఎద‌గాల‌ని నిరంతరం శ్ర‌మిస్తుంటాడు. ఓ రోజు ఊహించ‌ని రీతిలో ఓ రోడ్డు ప్ర‌మాదం కాల‌నాగులా ఆయ‌న్ని క‌బ‌ళిస్తుంది. త‌న‌వాళ్లెవ‌రూ జీవితంలో  స్థిర‌ప‌డ‌లేద‌ని, తాను చేయాల్సిన ఎన్నో ప‌నులు మిగిలిపోయాయ‌ని... త‌న జీవితానికి ఇంత తొంద‌ర‌గా ముగింపునివ్వ‌డం అన్యాయమని కాలం (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) అనే దేవుడి ముందు మొర‌పెట్టుకుంటాడు. (BRO Movie Review in telugu) దాంతో కాలం అనుగ్ర‌హించి 90 రోజులు అత‌ని జీవిత‌కాలాన్ని పెంచుతాడు. అలా మ‌ళ్లీ ఇంటికి చేరిన మార్క్ 90 రోజుల్లో అనుకున్న‌వ‌న్నీ చేశాడా? అత‌నివ‌ల్లే ప‌నుల‌న్నీ అయ్యాయా? ఆ 90 రోజుల స‌మ‌యంలో ఏం తెలుసుకున్నాడన్న‌ది మిగ‌తా క‌థ‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని