BRO Movie Review: రివ్యూ: బ్రో.. పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ల మూవీ మెప్పించిందా?

BRO Movie Review in telugu: పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ కీలక పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ‘బ్రో’ ఎలా ఉందంటే?

Updated : 28 Jul 2023 15:02 IST

BRO Movie Review; చిత్రం: బ్రో; నటీనటులు: పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు; సంగీతం: తమన్‌; సినిమాటోగ్రఫీ: సుజీత్‌ వాసుదేవ్‌; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; రచన: సముద్రఖని, శ్రీవత్సన్‌, విజ్జి; స్క్రీన్‌ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌; దర్శకత్వం: సముద్రఖని; విడుదల: 28-07-2023

వన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej)తో కలిసి నటిస్తున్నారంటే ఆ సినిమా మరింత ప్రత్యేకం. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో వచ్చిన ‘వినోదయసిత్తం’ తమిళ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పుడు అదే సినిమాను పవన్‌ కీలక పాత్రలో ‘బ్రో’(BRO Movie) మూవీగా రీమేక్‌ చేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాయడం విశేషం. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?(BRO Movie Review in telugu) ‘వినోదయసిత్తం’లో ఏ మార్పులు చేశారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

క‌థేంటంటే: ఇంటికి పెద్ద కొడుకైన మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధ‌ర‌మ్ తేజ్) తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత అన్ని బాధ్య‌త‌ల్నీ త‌న  భుజాన మోస్తుంటాడు. ఇద్ద‌రు చెల్లెళ్లు, త‌మ్ముడు స్థిర‌ప‌డాల‌ని... ఉద్యోగంలో త‌ను మ‌రింత ఎత్తుకు ఎద‌గాల‌ని నిరంతరం శ్ర‌మిస్తుంటాడు. ఓ రోజు ఊహించ‌ని రీతిలో ఓ రోడ్డు ప్ర‌మాదం కాల‌నాగులా ఆయ‌న్ని క‌బ‌ళిస్తుంది. త‌న‌వాళ్లెవ‌రూ జీవితంలో  స్థిర‌ప‌డ‌లేద‌ని, తాను చేయాల్సిన ఎన్నో ప‌నులు మిగిలిపోయాయ‌ని... త‌న జీవితానికి ఇంత తొంద‌ర‌గా ముగింపునివ్వ‌డం అన్యాయమని కాలం (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) అనే దేవుడి ముందు మొర‌పెట్టుకుంటాడు. (BRO Movie Review in telugu) దాంతో కాలం అనుగ్ర‌హించి 90 రోజులు అత‌ని జీవిత‌కాలాన్ని పెంచుతాడు. అలా మ‌ళ్లీ ఇంటికి చేరిన మార్క్ 90 రోజుల్లో అనుకున్న‌వ‌న్నీ చేశాడా? అత‌నివ‌ల్లే ప‌నుల‌న్నీ అయ్యాయా? ఆ 90 రోజుల స‌మ‌యంలో ఏం తెలుసుకున్నాడన్న‌ది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: అగ్ర తార‌ల సినిమాల్లో ప్ర‌ధాన భూమిక పోషించేది వాణిజ్యాంశాలే. ఇక తారస్థాయిలో  ఇమేజ్‌... బ‌ల‌మైన అభిమాన‌గ‌ణం ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా అంటే  చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌కి కిక్ ఇచ్చే అంశాల్ని జోడిస్తూ వాళ్ల‌ని సంతృప్తిప‌ర‌చాల్సిందే. మ‌రి ఏమాత్రం వాణిజ్యాంశాలు లేని... క‌థే ప్ర‌ధానంగా సాగే ‘వినోదయ సిత్త‌ం’ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో రీమేక్ చేయ‌డం అంటే క‌త్తిమీద సామే. వాణిజ్యాంశాల విష‌యంలో ఉన్న ఆ సందేహాల‌న్నిటినీ ప‌టాపంచ‌లు చేస్తూ... ప‌వ‌న్ ఇమేజ్ గురించి బాగా తెలిసిన త్రివిక్ర‌మ్ త‌న‌దైన శైలిలో ర‌చ‌న చేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌త సినిమాల్లోని పాట‌లు... ఆయ‌న మేన‌రిజ‌మ్స్‌... ఆయ‌న గెటప్స్‌ని  పక్కాగా సినిమాలోని స‌న్నివేశాల‌కి త‌గ్గ‌ట్టుగా మ‌లిచారు. అవి ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో ఈల‌లు కొట్టించేలా ఉన్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ (Pawan kalyan) చెప్పే సంభాష‌ణ‌లు కూడా  ఆయ‌న భావాలు ... రాజ‌కీయ సిద్ధాంతాల‌కి అనుగుణంగా ఉంటాయి. పాట‌లు, సంభాష‌ణ‌లు వెర‌సి ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెర‌పై వీరోచితంగా ఫైట్లు చేయ‌డం లేద‌నే విష‌యాన్ని కూడా మ‌రిపిస్తాయి. (BRO Movie Review in telugu) ప‌వ‌న్ పోషించిన పాత్ర ఔచిత్యానికి త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న చిటికేసిన ప్ర‌తిసారీ హీరోయిజం పండుతుంది.  వీటి మధ్య ప్ర‌ధాన క‌థ‌కి ఎక్క‌డా స‌మ‌స్య రాకుండా చూసుకోవ‌డంలో స‌ముద్ర‌ఖ‌ని విజ‌య‌వంతం అయ్యారు.

మాతృక‌లోని తండ్రి పాత్ర‌ని... ఇక్క‌డ పెద్ద కొడుకుగా మార్చి దాని చుట్టూ అల్లిన కుటుంబ స‌న్నివేశాలు మంచి డ్రామాని పంచుతాయి. మార్క్ పాత్ర‌ని ఆట‌ప‌ట్టిస్తూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసే హంగామా సినిమాకి ప్ర‌ధాన బ‌లం. లోతైన భావాల‌తో జీవిత స‌త్యాన్ని తెలిపేలా ఉంటూనే, ఆ ఆట మంచి వినోదాన్ని పంచుతుంది. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి మ‌రింత కీల‌కం. మార్క్ మ‌న‌సుని తేలిక ప‌రిచే ఆ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతాయి. ప్ర‌త్యేకంగా టీ క‌ప్పుని చూపించ‌డం మొద‌లుకొని రాజ‌కీయాల్ని గుర్తు చేసే ప‌లు సంభాష‌ణ‌ల కోసం  త్రివిక్ర‌మ్ ప్ర‌త్యేకంగా ‘స్పేస్’ తీసుకుని రాసిన‌ట్టు అనిపిస్తుంది. (BRO Movie Review in telugu) ‘మ‌న జీవితం, మ‌ర‌ణం భావిత‌రాల కోస‌మే...’, ‘పుట్టుక మ‌లుపు  మ‌ర‌ణం గెలుపు’ అంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పే సంభాష‌ణ‌లు ఆలోచ‌న రేకెత్తిస్తాయి. ప్ర‌థ‌మార్ధంలో వినోదం ప్ర‌ధాన‌మైతే... ద్వితీయార్ధానికి భావోద్వేగాలు కీల‌కం. అయితే  మాతృక‌స్థాయిలో భావోద్వేగాలు పండ‌క‌పోయినా సినిమా మాత్రం మెప్పిస్తుంది.

బ్రో’ సినిమా వచ్చేసింది.. ‘వినోదయసిత్తం’ గురించి ఇవి మీకు తెలుసా?

ఎవ‌రెలా చేశారంటే: ప‌వ‌న్‌క‌ల్యాణ్.. సాయిధ‌ర‌మ్ తేజ్‌ల మ‌ధ్య స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఇద్ద‌రి పాత్ర‌లూ ఆక‌ట్టుకుంటాయి. ప‌వ‌న్‌కల్యాణ్‌ అభిమానుల్ని మెప్పించే మేనరిజ‌మ్స్‌తో అద‌ర‌గొడితే... సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్ర మంచి డ్రామాని పండిస్తుంది. అటు అభిమానులూ... ఇటు సాధార‌ణ ప్రేక్ష‌కులూ సంతృప్తిప‌డేలా స‌న్నివేశాలు ఉంటాయి. సాయిధ‌ర‌మ్ తేజ్ ప్రేయ‌సిగా కేతిక శ‌ర్మ క‌నిపించేది కొద్దిసేపే. చిన్న పాత్రే అయినా ఓ పాటలో త‌న అందంతో ఆక‌ట్టుకుంటుంది కేతిక‌. మ‌రో క‌థానాయిక ప్రియా వారియ‌ర్ పాత్ర ఆశ్చ‌ర్య ప‌రుస్తుంది. రోహిణి, సుబ్బ‌రాజు తదిత‌రులు అల‌వాటైన పాత్ర‌ల్లోనే క‌నిపిస్తారు. బ్ర‌హ్మానందం చిన్న పాత్ర‌లో మెరుస్తారు. వెన్నెల కిశోర్‌, రోహిణి, త‌నికెళ్ల భ‌ర‌ణి, అలీ రెజా త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.  (BRO Movie Review in telugu) త‌మ‌న్ పాట‌ల కంటే నేప‌థ్య సంగీతం బాగుంటుంది. కెమెరా, ఎడిటింగ్‌,  ఆర్ట్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. త్రివిక్ర‌మ్ ర‌చ‌న అభిమానుల్ని మెప్పించింది. సంఘ‌ర్ష‌ణ‌, భావోద్వేగాలు బ‌లంగా పండ‌క‌పోయినా స‌ముద్ర‌ఖ‌ని మాతృక‌లో చెప్పిన విష‌యాన్ని తెలుగులోనూ ప్రేక్ష‌కులకు విజ‌య‌వంతంగా చెప్పిన‌ట్టే. నిర్మాణం బాగుంది.

  • బ‌లాలు
  • + ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. తేజ్ మ‌ధ్య స‌న్నివేశాలు
  • + ప్ర‌థ‌మార్ధంలో వినోదం
  • + అభిమానుల్ని మెప్పించే అంశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - క‌థ‌లో కొర‌వ‌డిన సంఘ‌ర్ష‌ణ‌
  • చివ‌రిగా...: పవన్‌ బ్రో... ఎనర్జీతో మెప్పిస్తాడు!(BRO Movie Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని