Mrunal Thakur: మేమూ మనుషులమే.. నెటిజన్‌ వ్యాఖ్యలకు మృణాల్‌ అసహనం

తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పి.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటోంది నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). పలువురు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనిపై ఆమె ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేసింది.

Published : 12 Feb 2023 14:49 IST

ముంబయి: ‘సీతారామం’(Sita Ramam)తో తెలుగువారికి చేరువైన బాలీవుడ్‌ భామ మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur)‌. ప్రస్తుతం ‘సెల్ఫీ’ (Selfiee), నాని (Nani 30) సినిమాల్లో నటిస్తోన్న ఈ నటి తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఇందులో ఓ నెటిజన్‌ మృణాల్‌ మాట తీరును తప్పుబట్టాడు. తనకు కాబోయే భర్త గురించి మృణాల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇటీవల కపిల్‌ శర్మ షోలో పాల్గొన్నప్పుడు చెప్పిన మాటలు జత చేస్తూ.. ఆమె రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతోందని వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేసింది.

‘‘కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంలో గతంలోనూ, ప్రస్తుతం నాకున్న అభిప్రాయాన్ని కనీసం నేను  ధైర్యంగా చెప్పగలిగాను’’ అని బదులిచ్చింది. ఆమె (Mrunal Thakur)‌ ఇచ్చిన రిప్లైపై పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్‌ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల విసిగిపోయిన ఆమె.. ‘‘నటీనటులు కూడా మనుషులేననే విషయాన్ని కొంతమంది వ్యక్తులు మర్చిపోతారనుకుంటా’’ అంటూ తన అసంతృప్తిని తెలియజేసింది.

ఇదే చిట్‌చాట్‌లో ఆమె (Mrunal Thakur)‌ తన అభిరుచులను సైతం పంచుకున్నారు. తనకి మధురైలోని దేవాలయాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. అలాగే, తనకు చీరలు నచ్చుతాయని, ఐరన్‌ మ్యాన్‌ను ఇష్టపడతానని, మార్వెల్‌ స్టూడియోస్‌ తెరకెక్కించే సూపర్‌హీరో సినిమాలో నటించాలనుందని ఆమె తెలిపారు. అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్‌ తనకు కాబోయే భర్త మంచి వాడైతే చాలని, అందం అనేది విషయం కాదని చెప్పింది. ఇటీవల కపిల్‌ శర్మ షోలో పాల్గొన్న ఆమె తనకు కాబోయే భర్త అందగాడై ఉండాలని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె ట్విటర్‌ చాట్‌ నిర్వహించగా.. దీనిని గురించే ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని