Mrunal Thakur: తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మృణాల్‌ ఠాకూర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. కారణం ఏమిటంటే?

తెలుగు సినీ ప్రియులను ఉద్దేశిస్తూ నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) తాజాగా ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. తనని ఎంతగానో ఆదరించినందుకు ధన్యవాదాలు చెప్పారు.

Updated : 05 Aug 2023 15:52 IST

హైదరాబాద్‌: మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur).. సరిగ్గా ఏడాది ముందు వరకూ తెలుగువారికి పెద్దగా పరిచయం లేని పేరు ఇది. కానీ, ఇప్పుడు అలా కాదు. తొలి చిత్రం ‘సీతారామం’ (Sita Ramam)తో తెలుగు ప్రేక్షకుల మది దోచి ఇక్కడ వరుస సినిమాలు చేస్తున్నారీ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తెలుగింటి అమ్మాయిగా తనను అంగీకరించిన ఇక్కడి ప్రేక్షకులను ఉద్దేశిస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.

మృణాల్‌ ఠాకూర్‌  - దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రధారులుగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదలై నేటితో సరిగ్గా ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ప్రియులు, చిత్రబృందానికి కృతజ్ఞతలు చెబుతూ మృణాల్‌ తాజాగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘డియర్‌ ఆడియన్స్‌.. నటిగా నా తొలి తెలుగు చిత్రం ‘సీతారామం’. నేను కన్న కలలను మించి మీరు నాపై ప్రేమాభిమానాలు చూపించారు. నన్ను మీ తెలుగింటి అమ్మాయిలా ఆదరించినందుకు, ఈ ప్రయాణంలో అమితమైన ప్రేమాభిమానాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. ఇది నాకెంతో ప్రత్యేకం. మరెన్నో ఏళ్ల పాటు విభిన్నమైన పాత్రలతో వినోదాన్ని అందిస్తానని మీకు మాటిస్తున్నా. ’’ అని ఆమె తెలిపారు.

Samantha: చికిత్స కోసం స్టార్‌హీరో రూ.25 కోట్ల సాయమంటూ వార్తలు.. సమంత ఏమన్నారంటే

అనంతరం చిత్రబృందాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘నా నుంచి సీత బెస్ట్‌ వెర్షన్‌ను స్క్రీన్‌పైకి తీసుకువచ్చిన దర్శకుడు హను రాఘవపూడికి..  ఈ మొత్తం ప్రయాణాన్ని నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన దుల్కర్‌తోపాటు చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు’’ అని ఆమె పోస్ట్‌ పెట్టారు. ‘సీతారామం’ మేకింగ్‌ వీడియోను సైతం అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను ఆకర్షిస్తోంది. మరోవైపు, చిత్ర నిర్మాణ సంస్థ సైతం స్పెషల్‌ వీడియోలు షేర్‌ చేసింది. వైజయంతి మూవీస్‌, స్వప్నా సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు రాబట్టింది. మృణాల్‌ ప్రస్తుతం.. ‘హాయ్‌ నాన్న’తోపాటు విజయ్‌ దేవరకొండతో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని