Love Story Review: రివ్యూ: లవ్‌స్టోరి

Love Story: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ ఎలా ఉందంటే?

Updated : 07 Dec 2022 21:28 IST

చిత్రం: లవ్‌స్టోరీ; నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, దేవయాని, రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు; సంగీతం: పవన్‌కుమార్‌ సీహెచ్‌; సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి. కుమార్‌; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌; నిర్మాత: నారంగ్‌ దాస్‌ కె నారంగ్‌, పుష్కర్‌రామ్‌ మోహనరావు; రచన, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల; బ్యానర్‌: అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌; విడుదల: 24-09-2021

రెండో ద‌శ క‌రోనా త‌ర్వాత ఇంటిల్లిపాదీ క‌లిసి థియేట‌ర్‌కి వెళ్లాల‌నే ఆస‌క్తిని పెంచిన సినిమా ‘ల‌వ్‌స్టోరి’. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి నటించడం... శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం... ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఈ సినిమా  ప‌లుమార్లు వాయిదాప‌డినా ప్రేక్ష‌కుల్లో ఏమాత్రం ఆస‌క్తి స‌న్న‌గిల్ల‌లేదు. శేఖ‌ర్ క‌మ్ముల మేకింగ్‌పై ప్రేక్ష‌కుల్లో ఉన్న న‌మ్మ‌కం అది. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా? ప్రేమికులుగా నాగచైతన్య, సాయిపల్లవి ఎలా మెప్పించారు? అసలు ఈ సినిమా కథేంటి?

క‌థేంటంటే: రేవంత్ (నాగ‌చైత‌న్య) జీరో నుంచి జీవితాన్ని మొద‌లు పెట్టిన ఓ మ‌ధ్య త‌ర‌గతి కుర్రాడు. హైద‌రాబాద్‌లో జుంబా సెంట‌ర్ న‌డుపుతుంటాడు. చిన్న‌ప్ప‌టి నుంచి ఊళ్లో వివ‌క్ష చూపించ‌డంతో,  బాగా స్థిర‌ప‌డి ఉన్న‌తంగా బ‌త‌కాల‌నేది త‌న క‌ల‌.  మౌనిక (సాయిప‌ల్ల‌వి) బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగ వేట‌లో హైద‌రాబాద్‌కి చేరుకుంటుంది. కానీ, ఎంత ప్ర‌య‌త్నించినా ఉద్యోగం దొర‌క‌దు. దాంతో రేవంత్ జుంబా సెంట‌ర్‌లో డ్యాన్స‌ర్‌గా చేరుతుంది. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మధ్య ప్రేమ చిగురిస్తుంది. మౌనిక ఓ పెద్దింటి అమ్మాయి.  ఆ ఇద్ద‌రి పెళ్లికి కులం అడ్డొస్తుంది. మ‌రి రేవంత్, మౌనిక క‌లిసి బతికేందుకు ఎలాంటి సాహ‌సం చేశారు? ఆ క్ర‌మంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? మౌనిక‌కి త‌న ఇంట్లోనే ఓ పెద్ద స‌మ‌స్య ఉంటుంది. అదేంటి? దాన్ని ఎలా ప‌రిష్క‌రించారనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: సున్నిత‌మైన అంశాల్ని స్పృశిస్తూ హృద్య‌మైన భావోద్వేగాల్ని ఆవిష్క‌రిస్తుంటారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈసారి మ‌రో అడుగు ముందుకేశారు. కులంతోపాటు ఇళ్ల‌ల్లో అమ్మాయిల‌పై జ‌రిగే లైంగిక హింస వంటి సంక్లిష్ట‌మైన అంశాల్ని స్పృశిస్తూ ప్రేమ‌క‌థ‌ని తీశారు. బ‌య‌టికి చెప్ప‌డానికి, మాట్లాడుకోవ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని లైంగిక దాడుల గురించి ఓ ప్రేమ‌క‌థ ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం మంచి ప‌రిణామం. శేఖ‌ర్ క‌మ్ముల‌లాంటి ద‌ర్శ‌కుడు ఈ త‌ర‌హా అంశాల్ని  తెర‌పై చూపిస్తే మ‌రింత మంది ప్రేక్ష‌కులకు చేరువ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. సున్నిత‌మైన ఈ అంశాన్ని తెర‌పై అంతే సున్నితంగా ఆవిష్క‌రించారు. క‌థానాయ‌కుడి జీవితాన్ని ప‌రిచ‌యం చేస్తూ నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లాడు ద‌ర్శ‌కుడు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడి క‌ష్టాలు... త‌న క‌ల‌ల్ని తెర‌పై చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. అదే స‌మయంలో క‌థానాయిక త‌న క‌లల్ని సాకారం చేసుకోవ‌డానికి హైద‌రాబాద్ చేరుకుని చేసే ప్ర‌య‌త్నాలు, ఆ క్ర‌మంలో ఆమెకి ఎదుర‌య్యే ఇబ్బందులు హ‌త్తుకుంటాయి.

ప్ర‌థ‌మార్ధం మొత్తం శేఖ‌ర్ క‌మ్ముల మార్క్ సెన్సిబిలిటీస్‌తో స‌ర‌దాగా సాగుతుంది. ద్వితీయార్ధంలో అస‌లు ప్రేమ‌క‌థ మొద‌ల‌వుతుంది. రేవంత్‌, మౌనిక ప్రేమకి ఎదుర‌య్యే స‌వాళ్లు, ఊళ్లో ప‌రిస్థితులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. క‌థ చివ‌రి ద‌శ‌కు చేరుకునే క్ర‌మంలో వ‌చ్చే స‌న్నివేశాలు మ‌న‌సుకు భారంగా అనిపిస్తాయి. ముఖ్యంగా మౌనికకి త‌న ఇంట్లోనే ఎదురైన స‌మ‌స్య గురించి చెప్పే స‌న్నివేశాలు మింగుడు ప‌డ‌నిరీతిలో సాగినా... అవి ఆలోచ‌న రేకెత్తిస్తాయి. స‌మాజానికి ఓ మంచి సందేశాన్నిస్తాయి.  ప‌తాక స‌న్నివేశాలు ప‌రువు - ప్రేమ నేప‌థ్యంలో సాగే సినిమాల్నే గుర్తు చేస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌ట‌న చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. వారిద్ద‌రూ రేవంత్‌, మౌనిక పాత్రల్లో ఒదిగిపోయారు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడిగా క‌నిపిస్తూ నాగ‌చైత‌న్య ప‌లికించిన భావోద్వేగాలు, ఆయ‌న ప‌లికిన తెలంగాణ యాస పాత్ర‌కి జీవం పోసింది. ఏదో స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఓ యువ‌తిగా, ఏదైనా సాధించాల‌నే త‌ప‌న ఉన్న నేటిత‌రం అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. జుంబా నేప‌థ్యంతో కూడిన ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి చేసిన డ్యాన్సులు కూడా అల‌రిస్తాయి. రాజీవ్ క‌న‌కాల, ఈశ్వ‌రీరావు, దేవ‌యాని, ఉత్తేజ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించి చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు.

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ప‌వ‌న్ సీహెచ్ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. పాట‌లు హ‌త్తుకుంటాయి. ‘నీ చిత్రం చూసి’, ‘ఏవో ఏవో క‌ల‌లే’ పాట‌ల చిత్ర‌ణ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. హోరెత్తించిన ‘సారంగ ద‌రియా’ పాట సినిమాలో ప‌ర్వాలేద‌పిస్తుందంతే. బహుశా బయట అనేక సార్లు విని, చూడటం వల్ల కూడా కావచ్చు. విజ‌య్ సి.కుమార్ కెమెరా ప్ర‌తీ స‌న్నివేశాన్నీ తెర‌పై స‌హ‌జంగా ఆవిష్క‌రించింది. శేఖ‌ర్ క‌మ్ముల త‌న మార్క్ మేకింగ్‌తోనే ప్ర‌స్తుత స‌మాజానికి అవ‌స‌ర‌మైన కొన్ని అంశాల్ని స్పృశించారు. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

బ‌లాలు

+ నాగ‌చైత‌న్య‌... సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌

+ శేఖ‌ర్ క‌మ్ముల మార్క్ భావోద్వేగాలు

+ క‌థా నేప‌థ్యం

బ‌ల‌హీన‌త‌లు

- అక్క‌డ‌క్క‌డా నెమ్మ‌దించే క‌థ

చివ‌రిగా: ఈ ‘ల‌వ్‌స్టోరి’... గుర్తుండిపోతుంది!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు