PAPA Review: రివ్యూ: ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి

నాగశౌర్య - మాళవికా నాయర్‌ జంటగా నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా ఎలా ఉందంటే..?

Updated : 17 Mar 2023 14:18 IST

Phalana Abbayi Phalana Ammayi movie review: చిత్రం: ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి; న‌టీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్‌; ఛాయాగ్ర‌హ‌ణం: సునీల్ కుమార్ నామ; సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్ (కాఫీఫై సాంగ్); పాట‌లు: భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ; కూర్పు: కిరణ్ గంటి; క‌ళ‌: అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ; నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి; సంస్థ‌:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్‌; ర‌చ‌న‌, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల; విడుద‌ల‌ తేదీ: 17-03-2023

నాగ‌శౌర్య (naga shaurya) - శ్రీనివాస్ అవ‌స‌రాల (srinivas avasarala) కాంబినేషన్‌లో ‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి గుర్తుండిపోయే సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. వీరిద్దరూ క‌లిసి చేసిన మ‌రో సినిమానే.. ‘ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi movie review).  ఓ జంట జీవితంలోని ద‌శాబ్ద‌కాలంపాటు ప‌లు ద‌శ‌ల్ని ఆవిష్క‌రించే ఈ సినిమా.. క‌థ రీత్యా  చాలా రోజుల‌పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంది. 2020లోనే మొద‌లైన ఈ సినిమా దాదాపు రెండేళ్ల త‌ర్వాత పూర్త‌యింది.  మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో  తెలుసుకుందాం.

క‌థేంటంటే: సంజ‌య్ (నాగ‌శౌర్య‌) (naga shaurya), అనుప‌మ (మాళ‌విక నాయ‌ర్‌) (malavika nair) ఒకే క‌ళాశాల‌లో చ‌దువుకున్న‌వాళ్లు. అబ్బాయి కంటే అమ్మాయి కాలేజీలో సీనియ‌ర్‌. ర్యాగింగ్ వ‌ల్ల వీరి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ త‌ర్వాత చ‌దువుకునేందుక‌ని లండ‌న్ వెళ‌తారు. అక్క‌డ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ఆ త‌ర్వాత స‌హ‌జీవ‌నం చేస్తారు.  అనుకోని కొన్ని సంఘ‌ట‌న‌లు వారిని వేరు చేస్తాయి. మ‌ళ్లీ ఆ ఇద్ద‌రూ ఎప్పుడు క‌లుసుకున్నారు? ఎలాంటి విష‌యాలు వారిద్ద‌రి మ‌ధ్య ఎడ‌బాటుకు కార‌ణ‌మ‌య్యాయ‌నేది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే. (PAPA Review)

ఎలా ఉందంటే: కాలేజీలో ప‌రిచ‌య‌మైన ఓ జంట ప‌దేళ్ల ప్ర‌యాణ‌మే ఈ క‌థ‌. స్నేహంతో మొద‌లైన ఈ జంట జీవితాన్ని పంచుకునే క్ర‌మంలో ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కు గురైంద‌నేది కీల‌కం. ఇలాంటి సంఘ‌ర్ష‌ణ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం. కాస్త అటూ ఇటూగా  ఇలాంటి నేప‌థ్యాన్ని.. ఈ త‌ర‌హా భావోద్వేగాల్ని ఆవిష్క‌రిస్తూ ప‌లు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ‘ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు’, ‘తొలిప్రేమ‌’ నుంచి మొన్న‌టి ‘థ్యాంక్యూ’ వ‌ర‌కు చాలా చిత్రాలే గుర్తుకొస్తాయి. ఆ ర‌కంగా చూస్తే ఈ  క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ క‌నిపించ‌దు. సున్నిత‌మైన క‌థాంశాలకు పెట్టింది పేరైన శ్రీనివాస్ అవ‌స‌రాల  హాస్యంతోనూ.. మాట‌ల చ‌మ‌క్కులతోనూ వినోదం పంచుతుంటారు. కానీ, ఇది భావోద్వేగాలే ప్ర‌ధానంగా సాగే క‌థ కావ‌డంతో ఆ అవ‌కాశం కూడా ద‌క్క‌లేదు. ఈ సినిమాను  కొత్త పంథాలో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు. ఇండీ ఫిలింస్‌ని గుర్తు చేస్తూ స‌హ‌జ‌త్వానికి పెద్ద పీట వేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆ క్ర‌మంలో క‌థ‌నంలో వేగం మందగించింది.  ఎక్క‌డున్న క‌థ అక్క‌డే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. ప్ర‌థ‌మార్ధంతో కాలేజీ, స్నేహం, స‌హ‌జీవ‌నం చుట్టూ స‌న్నివేశాల్ని మ‌లిచారు ద‌ర్శ‌కుడు. ద్వితీయార్ధంలోనే భావోద్వేగాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. క‌లిసి జీవితాన్ని పంచుకోవాల‌నుకున్న జంట విడిపోవ‌డం వెన‌క ఉండే కార‌ణాన్ని బ‌లంగా  ఆవిష్క‌రించ‌డం కీల‌కం. కానీ, ఈ సినిమాలో  ఆ విష‌యాన్ని ప్ర‌భావ‌వంతంగా  ఆవిష్క‌రించ‌లేక‌పోయారు ద‌ర్శ‌కుడు. క‌థ‌ను ఛాప్ట‌ర్ల త‌ర‌హాలో ప‌లు పార్శ్వాలుగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు (PAPA Review).

ఎవ‌రెలా చేశారంటే: ప్రేమ క‌థ‌ల‌కి ప్ర‌ధాన జంట మ‌ధ్య  కెమిస్ట్రీ కీల‌కం.  ఆ విష‌యంలో  నాగ‌శౌర్య‌, మాళ‌విక నాయ‌ర్ జోడీ  మెప్పిస్తుంది. ప‌దేళ్ల ప్ర‌యాణంలో ఆయా ద‌శ‌ల‌కు త‌గ్గ‌ట్టుగా క‌నిపించిన తీరు, ఆ స‌న్నివేశాల్లో ఒదిగిపోయిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా నాగ‌శౌర్య (Naga Shaurya) పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా త‌న‌ని తాను మార్చ‌కున్న విధానం, ఆయ‌న క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది. సినిమాలో ప్ర‌ధానంగా క‌నిపించేది ఆ ఇద్ద‌రే. మిగిలిన పాత్ర‌ల ప్రాధాన్యం త‌క్కువే. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరుని క‌న‌బ‌రిచాయి.  శ్రీనివాస్ అవ‌స‌రాల ఈ క‌థ‌ని మ‌రీ డాక్యుమెంట‌రీ త‌ర‌హాలో న‌డిపారు. కొన్ని స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి.  ర‌చ‌న ప‌రంగా కూడా ఆయ‌న గత సినిమాలతో పోలిస్తే పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌దు. నిర్మాణం బాగుంది.

బ‌లాలు

+ నాగ‌శౌర్య‌, మాళ‌విక జోడీ, ద్వితీయార్ధంలో భావోద్వేగాలు

బ‌ల‌హీన‌త‌లు
-
సాగ‌దీత‌గా స‌న్నివేశాలు క‌థ‌, క‌థ‌నాల్లో లోపించిన కొత్త‌ద‌నం

చివ‌రిగా: అబ్బాయి అమ్మాయి మాత్ర‌మే మెప్పిస్తారు..!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని