Nani: నిర్మాతలందరూ.. వాళ్లకు అడ్వాన్స్‌ చెక్‌లు ఇచ్చిపెట్టుకోండి : నాని

నాని (Nani) నటించిన సరికొత్త సినిమా ‘దసరా’ (Dasara). తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగింది.

Updated : 27 Mar 2023 17:19 IST

హైదరాబాద్‌: నాని (Nani) - కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) జంటగా నటించిన  మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దసరా’ (Dasara). విభిన్నమైన కథాచిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం అనంతపురంలో ‘దసరా’ ప్రీ రిలీజ్‌ వేడుకగా జరిగింది. ఇందులో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘సినిమా వాళ్లకు ఓ ప్రత్యేకమైన భాష ఉంటుంది. మా వరకూ సీడెడ్‌ అంటే మాస్‌ అని అర్థం. ఇప్పటి వరకూ మిమ్మల్ని మెప్పించే మాస్‌ చిత్రం చూసి ఉంటారు. ‘దసరా’తో మీ మనసుని హత్తుకునే మాస్‌ సినిమా చూపిస్తా. అది నేను మీకు ఇస్తున్న మాట. అలాగే, మాస్‌ సినిమాలు చూసి విజిల్స్ వేసి ఉంటారు. కానీ, ఈ సారి ఆనందం, భావోద్వేగంతో మీరందరూ విజిల్స్‌ వేస్తారు. ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. దుమ్ము, ధూళిని లెక్కచేయకుండా ఒక సంవత్సరంపాటు ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశాం. టీమ్‌ మొత్తానికి నా ధన్యవాదాలు. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఇదొక ప్రత్యేకమైన చిత్రం కానుంది. నా ఫ్రెండ్స్‌ పాత్రలు చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా తర్వాత మీరెన్నో చిత్రాల్లో నటిస్తారు. సంతోష్‌ నారాయణన్‌.. సాంగ్స్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. ఇకపై మ్యూజిక్‌ కంపెనీలు మిమ్మల్ని వదలవు. మా ఫైట్‌ మాస్టర్‌.. ఈ సినిమా తర్వాత ఆయన డేట్స్‌ దొరకడం కష్టం కావొచ్చు. ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌.. 22 ఎకరాల్లో ‘వీర్లపల్లి’ అనే మా ఊరును క్రియేట్‌ చేశారు. మా ఎడిటర్ నవీన్‌.. మొదటి రోజు నుంచి ఈ కథను ఎంతో నమ్మాడు. కలిసిన వాళ్లందరికీ బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నామని చెబుతున్నాడు’’

‘‘డైరెక్షన్‌ టీమ్‌లో ఉన్న 12 మంది సభ్యులు.. వీలులైనంత త్వరగా వాళ్లందరూ దర్శకులు అయిపోవాలని  ప్రార్థిస్తున్నా. వాళ్లు బాగా కష్టపడ్డారు. నేనూ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. వాళ్ల జీవితం ఎలా ఉంటుందో నేను దగ్గర నుంచి చూశా. టాలీవుడ్‌ నిర్మాతలందరికీ చెబుతున్నా.. ‘దసరా’ అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ అందరికీ అడ్వాన్స్‌ చెక్‌లు ఇచ్చి పెట్టుకోండి.. ఎందుకంటే వీళ్లల్లో ఎవరు ఎప్పుడు దర్శకులు అయిపోతారో తెలియదు. దీక్షిత్‌ మీ అందరి మనసులు దోచుకుంటాడు. ఈ సినిమా తర్వాత సూర్యగానే అతడు గుర్తుండిపోతాడు. అంత అద్భుతంగా యాక్ట్‌ చేశాడు. ‘నేను లోకల్‌’ తర్వాత ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేయాలని నేనూ- కీర్తి అనుకున్నాం. ఇంతకు మించిన అద్భుతమైన చిత్రం ఏ నటీనటులకు దొరకదు. మార్చి 30న టాప్‌ లేచేపోయే సినిమా మేము మీకు ఇస్తున్నాం. మీరు కూడా టాప్‌ లేచిపోయే రెస్పాన్స్‌ ఇస్తారని ఆశిస్తున్నా’’ అని నాని (Nani) వివరించారు. కీర్తి సురేశ్‌ సైతం.. టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు చెప్పారు. అనంతరం ఆమె ‘చమ్మీల అంగీలేసి’ పాటకు స్టేజుపై డ్యాన్స్‌ చేసి అలరించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని