Nayanthara: నయనతార సర్‌ప్రైజ్‌కు ఫిదా అయిన విఘ్నేశ్‌.. అదేంటంటే?

ఎవరికైనా పెళ్లిరోజు ఎంత ప్రత్యేకమో.. వివాహం బంధంలో అడుగుపెట్టాక వచ్చే తొలి పుట్టినరోజూ అంతే ప్రత్యేకం. అందుకే దాన్ని ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుక చేసుకుంటుంటారు.

Published : 19 Sep 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరికైనా పెళ్లిరోజు ఎంత ప్రత్యేకమో.. వివాహం బంధంలో అడుగుపెట్టాక వచ్చే తొలి పుట్టినరోజూ అంతే ప్రత్యేకం. అందుకే దాన్ని ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుక చేసుకుంటుంటారు. తన భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (vignesh shivan)కు అలాంటి మధుర జ్ఞాపకాన్నే అందించారు నయనతార (Nayanthara). ఆదివారం విఘ్నేశ్‌ బర్త్‌డే. ఆ వేడుకలను ఇంట్లోనో, ఏ ఫైవ్‌ స్టార్‌ హోటల్లోనో, బీచ్‌ వాతావరణంలోనో కాకుండా దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా సౌధం వద్ద నిర్వహించి, సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ దంపతులతోపాటు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ విఘ్నేశ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నా భార్య ఎప్పటికీ మరిచిపోలేని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. నన్ను ప్రేమించే వారందరి సమక్షంలో బుర్జ్‌ ఖలీఫా దగ్గర పుట్టిన రోజు జరుపుకోవటానికి మించింది మరోటి లేదు. నా జీవితంలో ఇంతటి సంతోషాన్ని నింపుతున్న భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతూ ఉంటా’’ అని విఘ్నేశ్‌ పేర్కొన్నారు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు విఘ్నేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయన్‌- విఘ్నేశ్‌ ఈ ఏడాది జూన్‌లో వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వృత్తిపరంగా ఇద్దరూ బిజీగా ఉంటున్నా అప్పుడప్పుడు విహార యాత్రలు చేస్తున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘గాడ్‌ ఫాదర్‌’లో నయనతార కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా అక్టోబరు 5న విడుదలకానుంది. షారుఖ్‌ఖాన్‌ సరసన ‘జవాన్‌’, పలు తమిళ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ఈ ఏడాది ‘కాతువాకుల రెండు కాదల్‌’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన విఘ్నేశ్‌.. అజిత్‌తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని