Venkatesh: ‘ఓరి దేవుడా’.. విశ్వక్‌సేన్‌తో వెంకటేశ్‌.. గ్లింప్స్‌ అదిరింది

ఇతర నటులతో కలిసి నటించేందుకు ముఖ్యంగా యువ హీరోలతో తెరను పంచుకునేందుకు ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నటుడు వెంకటేశ్‌

Published : 21 Sep 2022 19:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇతర నటులతో కలిసి నటించేందుకు ముఖ్యంగా యువ హీరోలతో తెరను పంచుకునేందుకు ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నటుడు వెంకటేశ్‌ (Venkatesh). ఇప్పటికే పలువురి కథానాయకులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఆయన ఇప్పుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఓరి దేవుడా..!’ (Ori Devuda) చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దానికి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ‘లవ్‌ కోర్ట్‌’ అనే రూమ్‌లో ఓ సీతాకోక చిలుక ఎగురుకుంటూ వెళ్లి ఓ ఫైల్‌పై వాలుతుంది. ఆ ఫైల్‌ను తీసుకుని, అందులోని వివరాలు చూసే సీన్‌తో వెంకటేశ్‌ ఇచ్చిన ఎంట్రీ అదుర్స్‌ అనిపించేలా ఉంది. సీన్‌ నేపథ్యంలో వినిపించే ‘ఓరి దేవుడా’ అనే లైన్‌ అలరించింది. ఈ చిత్రంలో వెంకటేశ్‌ దేవుడిగా కనిపించనున్నారు.

తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’ చిత్రానికి  ‘ఓరి దేవుడా’ రీమేక్‌గా రూపొందుతోంది. మాతృకకు దర్శకత్వం వహించిన అశ్వత్‌ మరిముత్తునే ఈ చిత్రానికీ డైరెక్షన్స్‌ చేస్తున్నారు. ఇందులో విశ్వక్‌కు జోడీగా మిథాలీ పార్కర్‌ నటిస్తోంది. అక్టోబరు 21న ఈ సినిమా విడుదలకానుంది. పీవీపీ సినిమా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్‌, కూర్పు: విజయ్‌ ముక్తవరపు, ఛాయాగ్రహణం: విదు అయ్యన.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని