Published : 12 May 2021 01:01 IST

‘ఆయన హాలీవుడ్‌లో ఉంటే ఎన్నో అవార్డులు వచ్చేవి’

నటుడు పి.ఎల్‌.నారాయణ గురించి పరుచూరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: పి.ఎల్‌.నారాయణ.. మన సినీ ఇండస్ట్రీకి దొరికిన ఒక అద్భుతమైన నటుడు అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఆయన హాలీవుడ్‌లో ఉండి ఉంటే ఎన్నో అవార్డులు వచ్చేవని అభిప్రాయపడ్డారు. ‘పరుచూరి పలుకులు’లో భాగంగా దిగ్గజ నటుడు పి.ఎల్‌.నారాయణ గురించి తాజాగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఇంకా ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే చదివేయండి..

‘‘పి.ఎల్‌.నారాయణ ఒక నటుడు.. ఒక దర్శకుడు.. రచయిత కూడా. ‘ఖైదీ’ దగ్గర్నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ‘కలియుగ మహాభారతం’లో శకుని పాత్రలో అద్భుతంగా నటించారు. గుమ్మడి, ఎస్వీ రంగారావు, రావుగోపాల రావు, కైకాల సత్యనారాయణ.. అలాగే పి.ఎల్‌.నారాయణ, సుత్తివేలు, నూతన ప్రసాద్‌.. ఇలా అద్భుతమైన పాత్రలు ధరించే మహానటులు మనకు ఉన్నారు. ఇంకొంచెం పర్సనాలిటీ ఉండుంటే మీరు ఎస్వీరంగా రావు అంతటి వాడివయ్యేవాడివని పి.ఎల్‌.ఎన్‌తో చెప్తూ ఉండేవాడిని. వీలైతే ఆ సినిమా మీరు కూడా చూడండి. ఒకవేళ పి.ఎల్‌.నారాయణ హాలీవుడ్‌లో పుట్టి ఉంటే ఆయన నటనకు ఎన్నో అవార్డులు వచ్చి ఉండేవి. సజహనటి.. సహజ నటుడు అంటుంటాం కదా.. నారాయణ మాత్రం అతి సహజ నటుడు’’ అని పరుచూరి అన్నారు.

‘‘పి.ఎల్‌.ఎన్‌తో నీకు ‘నట గ్రామీణ’ అనే బిరుదు ఇస్తా అని అంటూ ఉండేవాడిని. అతను పంచె కట్టుకొని ప్రజల్లోకి వస్తే నటుడు అని ఎవరూ అనుకోరు. ఎవరో పేద రైతో.. శ్రామికుడో అనే అనుకుంటారు. అలాంటి పరిస్థితి ఏర్పరిచిన మహానటుడు పి.ఎల్‌.ఎన్‌. ‘ఖైదీ’లో చిరంజీవికి తండ్రి పాత్రలో ఆయన కనిపించారు. రావుగోపాల్‌తో కలిసి చేసే ఒకే ఒక సన్నివేశం నారాయణ నటన ఆకాశంలో మెరుపులా మెరిసింది. ఏదేమైనా అమ్మపాలు తాగిన వారు (రంగస్థలం) నుంచి వచ్చిన వారు అద్భుతమైన నటులే అవుతారు. అందులో ఒకరు పి.ఎల్‌.నారాయణ. 1985 అనుకుంటా.. పేదోళ్ల గురించి ఒక డైలాగ్‌ రాయమని అడిగారు. ‘పేదోడికి నోరు ఉంటది.. ఆకలి వేస్తే అమ్మా అంటది. కోపమొస్తే నీయమ్మా అంటది’ అని డైలాగ్‌ రాశాను. ఆ డైలాగ్‌ పి.ఎల్‌.ఎన్‌ చెప్పగానే థియేటర్‌ ఎలా ఊగిపోయిందో.. దానికి నేనే సాక్ష్యం. వెంటనే పి.ఎల్‌.ఎన్‌ వచ్చి నన్ను కౌగలించుకున్నాడు. ఆ డైలాగ్‌ తర్వాత ఆయనలో ప్రతి పేదవాడు తనను తాను చూసుకున్నాడు. ఆ తర్వాత ఏ ఊరికి వెళ్లినా నన్ను ఆ డైలాగ్‌ చెప్పమని అడుగుతూ ఉండేవారు’’.

‘‘‘ఘరానా మొగుడు’ సినిమాలో ఒక డైలాగ్‌ రాశాను. అయితే.. రాఘవేంద్రరావుగారు వద్దన్నారు. వెంటనే నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పగాను..‘డైలాగ్‌ చాలా బాగుంది కదా.. నేను చెప్తా ఉండండి’ అని వెళ్లి రాఘవేంద్రరావుకి చెప్పారు. అయినా రాఘవేంద్రరావు ఒప్పుకోలేదు. నేను మాత్రం చేయను కావాలంటే.. మీరే డైరెక్ట్‌ చేసుకోండి అని వెళ్లి పక్కన కూర్చున్నారు. అలా ఆ షాట్‌ను చిరంజీవి గారు డైరెక్ట్‌ చేశారు. ఇంతకీ ఆ డైలాగ్‌ ఏంటంటే అలా నడుచుకుంటూ వస్తున్న నగ్మను ఉద్దేశిస్తూ.. పి.ఎల్‌.ఎన్‌ ఒక డైలాగ్‌ చెప్తారు.. ‘అమ్మా.. పేదోడు ఎక్కాడని కారు తగలెట్టారు. ఇప్పుడు పేదోడు ముట్టుకున్నాడని ఒళ్లు తగలెట్టుకునేరు’ అంటాడు. ‘ఘరానా మొగుడు’ చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఆ డైలాగ్‌ రియాక్షన్‌ గుర్తుంటుంది. ఈ విషయంలో రాఘవేంద్రరావుగారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన నవ్వుతూ ఆ పక్కన కూర్చొని చిరంజీవి గారితో డైరెక్ట్‌ చేయించారు. ‘దేశంలో దొంగలు పడ్డారు’ చిత్రంలో పి.ఎల్‌.ఎన్ గాంధీ వేషంలో పండించిన నటన గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. టి.కృష్ణ తీసిన ప్రతి సినిమాలోనూ ఆయన ఉండేవారు. ఆర్‌.నారాయణమూర్తి సినిమాలన్నింటికీ ఆయన రచయితగా పనిచేశారు. ఇప్పుడు చనిపోయి ఎక్కడున్నా.. ఆయన కుటుంబం మాత్రం బాగుండాలని కోరుకుంటున్నా. ఆయన కేవలం తన శరీరాన్ని మాత్రమే కాదు.. నటనను విడిచి వెళ్లారని నేను భావిస్తా’ అని పరుచూరి చెప్పుకొచ్చారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని