Guntur Kaaram: అలా చేస్తే.. ‘గుంటూరు కారం’ మరోలా ఉండేది: పరుచూరి గోపాలకృష్ణ

మహేశ్‌ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రంపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Published : 17 Feb 2024 09:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) యూట్యూబ్‌ వేదికగా సినిమాలపై తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈసారి ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)పై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu)- డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌. రమ్యకృష్ణ, జయరామ్‌, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, ఈ మూవీ ఆయన ఏమన్నారంటే.. 

‘‘ఇది మహేశ్‌ బాబు స్థాయి సినిమా కాదనేది నా అభిప్రాయం. నేను ఎవర్నీ విమర్శించడం లేదు. కానీ, ఈ చిత్రం గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే మహేశ్‌పై నాకు అభిమానం ఉంది. పలు చిత్రాల స్క్రీన్‌ప్లే గురించి మీతో చర్చించి, 350కుపైగా సినిమాలకు పనిచేసిన నాకు ‘గుంటూరు కారం’ కథనం కాస్త కన్‌ఫ్యూజ్‌గా అనిపించింది. ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. రెండోసారి చూస్తే స్పష్టత ఉండొచ్చేమో. దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లేతో ఆడుకున్నాడు. రూ.200 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే కనీసం రూ.300 కోట్లు వసూళ్లు చేస్తే తప్ప లాభం ఉండదనేది ఇండస్ట్రీ భావన. 2021లో మొదలుపెట్టిన ఈ చిత్రం 2024లో విడుదలైంది. ఈ గ్యాప్‌లో కథలోనో, కథనంలోనో చిత్ర బృందం మధ్య తేడాలొచ్చి ఉంటాయి.’’

‘‘గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో ఇందులోని హీరో పాత్రను అలా క్రియేట్‌ చేశారు. త్రివిక్రమ్‌ మంచి టైటిల్స్‌ పెడతారు. ఆయన సినిమాన్నింటిలో ఇది కొంత తేడాగా అనిపించింది. తల్లి వద్దనుకుంటే.. సంబంధిత డాక్యుమెంట్స్‌పై హీరో సంతకం పెడతాడా, లేదా? అనే పాయింట్‌కు కంపోజ్‌డ్‌ సీన్స్‌ రాసుకున్నారు. శారద- బాలకృష్ణ, వాణిశ్రీ- చిరంజీవి కాంబినేషన్‌లానే రమ్యకృష్ణ- మహేశ్‌ బాబు కాంబో ఉంటుందని ఊహించుకున్నా. కానీ, ఇది తల్లీకొడుకుల కథ. ఇందులో కథానాయకుడు.. అమ్మను దైవంలా కొలుస్తాడు తప్ప టీజ్‌ చేయలేడు, ఇబ్బంది పెట్టలేడు. ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాటు అదే. అద్భుతంగా కథలు రాసే త్రివిక్రమ్‌ ఇది చాలు అనుకున్నారేమో’’

‘‘తల్లీకొడుకు సెంటిమెంట్‌, తాత- మనవడు సెంటిమెంట్‌తో ఎన్ని సినిమాలు విజయం అందుకున్నాయో మీకు తెలుసు. ఇందులో ఆ రెండూ పండలేదు. సెంటిమెంట్‌ ప్రధానంగా సినిమాని తీద్దామనుకుంటే ఈ టైటిలే తప్పు. ‘గుంటూరు అబ్బాయి’ అని పెట్టి ఉంటే కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ప్రేక్షకులు అనుకుని ఉండేవారు. గుంటూరు కారం.. పేరుకు సరిపోయేలా స్క్రీన్‌ప్లేని సెట్‌ చేశారు. సంతకం పెట్టించేందుకు హీరోయిన్‌.. హీరో ఇంటికొచ్చి, ప్రేమలో పడేయాలనుకుంటుంది. ఇది పాజిటివ్‌ దృక్పథం కాదు. రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్‌నే డెవలప్‌ చేసుకుంటూ వెళ్లి ఉంటే ఈ సినిమా మరో విధంగా ఉండేది. ఒకానొక సమయంలో ఫలానా పాత్రలో మార్పు వస్తుందని ఊహించా. కానీ, అలా జరగలేదు. ఏదైనా క్యారెక్టర్‌లో రియలైజేషన్‌ వచ్చి ఉంటే ప్రేక్షకుల హృదయానికి టచ్‌ అయ్యేది. త్రివిక్రమ్‌, మహేశ్‌ కాంబో కాబట్టి కలెక్షన్స్‌ వస్తాయి. డబ్బులు రావడం వేరు, సంతృప్తి రావడం వేరు. త్రివిక్రమ్‌ అంటే నాకు అభిమానం. ఆయన మళ్లీ మంచి కథతో వస్తారని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని