Hanuman: ‘హనుమాన్‌’.. రిలీజ్‌ డేట్‌ వాయిదా వేయకపోవడానికి కారణమదే: ప్రశాంత్‌ వర్మ

‘జాంబీరెడ్డి’ తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, నటుడు తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman). సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Updated : 31 Dec 2023 12:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్రాంతి చిత్రాల పోటీపై దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దర్శకత్వం వహించిన ‘హనుమాన్‌’ (Hanuman) రిలీజ్‌ను వాయిదా వేయకపోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ‘‘సినీ పరిశ్రమలో సంక్రాంతికి బిజినెస్‌ బాగా జరుగుతుంది. ఈ సమయంలో సాధారణంగా మూడు సినిమాలు విడుదలవుతాయి. ఈ సారి మాత్రం దాదాపు ఐదు చిత్రాలు బరిలో నిలిచాయి. అందుకే ఇంతలా పోటీ వాతావరణం నెలకొంది. మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబోలో ‘గుంటూరు కారం’, ‘హనుమాన్‌’ జనవరి 12న విడుదల కానున్నాయి.

దీంతో మా సినిమా విడుదలను వాయిదా వేయాలని పలువురు అడిగారు. నాకు ఏమాత్రం ఛాన్స్‌ ఉన్నా వేరే డేట్‌కు వెళ్లేవాడిని. అందులో ఎలాంటి ఇగో లేదు. హిందీ మార్కెట్‌ ఇప్పుడు మాకెంతో ముఖ్యం. నార్త్‌లో మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న వాళ్లు.. రెండు నెలల క్రితమే సినిమా చూశారు. ఈ సినిమాపై మా కంటే వాళ్లకే ఎక్కువ నమ్మకం ఉంది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటూ ఉత్తరాదిలో భారీగా ప్రమోట్‌ చేస్తున్నారు. రిలీజ్‌ వాయిదాకు వాళ్లు అంగీకరించలేదు. అందుకే మేము అనుకున్న తేదీకే విడుదల చేస్తున్నాం’’ అని ప్రశాంత్‌ వర్మ క్లారిటీ ఇచ్చారు. నిర్మాత సహకారంతోనే సినిమాను ఈ స్థాయిలో తీర్చిదిద్దగలిగానని తెలిపారు. ‘హనుమాన్‌’తోపాటు తాను మరో చిత్రాన్ని కూడా తెరకెక్కించానని.. ఈ సినిమా విడుదలయ్యాక ఆ చిత్రాన్ని అనౌన్స్‌ చేస్తానని చెప్పారు.

‘జాంబిరెడ్డి’ తర్వాత తేజ సజ్జా - ప్రశాంత్‌వర్మ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. సోషియోఫాంటసీ కథాంశంతో సూపర్‌హీరో ఫిల్మ్‌గా దీనిని తీర్చిదిద్దారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా విడుదల కానుంది. నిరంజన్‌ రెడ్డి నిర్మాత. వరలక్ష్మి శరత్‌కుమార్‌, అమృతా అయ్యర్‌, వినయ్‌ రాయ్‌, రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని