Tollywood: 8 వారాల తర్వాతే ఓటీటీలోకి

‘విడుదలయ్యే ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలో ప్రదర్శితం కావాలని, ఆ మేరకే  ఒప్పందం చేసుకునేలా నిర్మాతలంతా ఏకాభిప్రాయానికి వచ్చామ’ని తెలిపారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకునే విషయంలోనూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)తో

Updated : 19 Aug 2022 08:47 IST

సినిమాల ప్రదర్శనపై నిర్మాతల ఏకాభిప్రాయం

సమస్యల పరిష్కారమయ్యాకే చిత్రీకరణలు 

‘విడుదలయ్యే ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలో ప్రదర్శితం కావాలని, ఆ మేరకే  ఒప్పందం చేసుకునేలా నిర్మాతలంతా ఏకాభిప్రాయానికి వచ్చామ’ని తెలిపారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకునే విషయంలోనూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)తో కలిసి ఒక ఒప్పందం చేసుకున్నామని ఆయన తెలిపారు. చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో గురువారం విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం చిత్రీకరణలు నిలిపివేసి, కొన్నాళ్లుగా జరుపుతున్న చర్చలు, కార్యాచరణ పురోగతిని ఈ సమావేశంలో వెల్లడించారు. థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధరలు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరామనీ, అందుకు యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయని  తెలిపారు. శుక్రవారం నుంచి ప్రదర్శనకారులతో జరిగే సమావేశంలో వీపీఎఫ్‌ ఛార్జీలపైనా తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. చిత్రీకరణలు మొదలవుతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మరికొన్ని సమస్యలకి పరిష్కారం కనుక్కునే ప్రయత్నంలో ఉన్నామని, అన్నీ కొలిక్కి వచ్చాక చిత్రీకరణలపై మేమే ఓ ప్రకటనని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. దక్షిణాదిలోని ఇతర పరిశ్రమలతోపాటు, హిందీ చిత్ర పరిశ్రమ కూడా మేం తీసుకునే నిర్ణయాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని దిల్‌రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు బసిరెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్‌ప్రసాద్, నిర్మాతల మండలి అధ్యక్ష కార్యదర్శులు సి.కల్యాణ్, టి.ప్రసన్నకుమార్‌తోపాటు దర్శకులు తేజ, నిర్మాతలు స్రవంతి కిషోర్, అభిషేక్‌ నామా, ఆర్కే, అన్నే రవి తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని