Puri Musings: జీవితాలు నాశనం చేసుకోకండి.. యూత్‌కు పూరీ జగన్నాథ్‌ విన్నపం

‘పూరీ మ్యూజింగ్స్‌’(Puri Musings) పేరుతో ఎన్నో విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh)‌. ఈసారి ఆయన యూత్‌ను ఉద్దేశించి మాట్లాడారు. 

Published : 20 Dec 2022 14:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసులో ఉన్నప్పుడు ఏదో సాధించాలనే తపన ఉంటుందని. దానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని పూరీజగన్నాథ్‌(Puri Jagannadh) అన్నారు. యూత్‌ ఆలోచనలను పక్కదోవ పట్టించేవాళ్లు చాలా మంది ఉంటారని.. వారితో అప్రమత్తంగా ఉండాలని పూరీ హితవు పలికారు. పూరీ మ్యూజింగ్స్‌(Puri Musings)లో ఈసారి యూత్‌ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

‘‘యూత్‌.. వయసులో ఉన్న యువతరం మీరు. ఈ వయసులో మీ రక్తం ఎగసిపడుతుంటుంది. మీ మజిల్స్‌..విజిల్స్‌ వేస్తుంటాయి. కాళ్లల్లో విపరీతమైన బలం ఉంటుంది.  ఒకచోట కూర్చోవాలనిపించదు. నిద్ర రాదు. ఎప్పుడూ హైపర్‌గా ఉంటారు. ఏది వద్దంటే.. అదే చేస్తారు. ఎప్పుడు ఏ పని చేద్దామా అని ఎదురుచూస్తుంటారు. భయం తెలీదు. భవిష్యత్తు గురించి బాధ ఉండదు. మీ వయసులో ఉన్న యువతరమే మేథావులకు కావలసింది. కానీ, చాలా మంది యూత్‌ను తప్పుదోవ పట్టిస్తారు. మిమ్మల్ని నమ్మిస్తారు, ఉద్వేగపరుస్తారు. మీతో ధర్నాలు, ఉద్యమాలు చేయిస్తారు. ఎందుకంటే ప్రతిదానికి యూత్‌ కావాలి. గుడిలో భజన చేసేది మీరే, పండగలకు డాన్స్‌ చేసేది మీరే. సినిమా టికెట్స్‌ కోసం చొక్కలు చించుకునేది మీరే.. యుద్ధంలో ముందుండే సైనికులు మీరే. ఆఖరికి సూసైడ్‌ బాంబర్స్‌ కూడా మీరే. ఈ వయసులో మీకు కావాల్సింది మీలో స్ఫూర్తినింపే వాళ్లు. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో మీకే తెలీదు. యూత్‌కోసం చాలా మంది మేథావులు మాట్లాడతారు. అందరి ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయి. అయితే, స్ఫూర్తినింపడం వేరు, రెచ్చగొట్టడం వేరు. తేడా తెలుసుకోకపోతే మీరు చాలా తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఉసిగొలుపుతుంటారు. దయచేసి జీవితాలు నాశనం చేసుకోకండి. మీ అమ్మ నాన్నలు మీ గురించి ఎన్నో కలలు కంటారు. వాటిని వదిలేసి ఇంకెవరో కల కోసం బలి కావద్దు.  మీరు జేజేలు, నినాదాలు చేస్తుంటే అవి ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. చొక్క చించుకున్నప్పుడు.. అది మీ నాన్న కష్టార్జితం అని గుర్తుపెట్టుకోండి. చెయ్యి కోసుకున్నప్పుడు.. మీ అమ్మకు తెలిస్తే ఎంత ఏడుస్తుందో ఊహించుకోండి. యుక్త వయసులో భగత్‌సింగ్‌లా దేశం కోసం చేస్తే ఓకే. కానీ, ఇంకెవరి కోసమో అనవసరంగా చేస్తే మీ అంత మూర్ఖులు మరొకరు ఉండరు. గుర్తుపెట్టుకోండి.. మంచి నాయకులు ఉంటారు, చెడ్డ వాళ్లు కూడా ఉంటారు. మీలో స్ఫూర్తినింపే వాళ్లు ధైర్యం చెప్పి భుజం తడతారు. రెచ్చగొట్టే వాళ్లు లేనిపోనివి చెప్పి ఉసిగొల్పుతారు. జాగ్రత్తగా ఉండండి’’ అని పూరీ జగన్నాథ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని