Lal Salaam: తెలుగులో ‘లాల్‌ సలాం’కు తగ్గిన స్క్రీనింగ్‌

రజినీకాంత్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన మేర రాణించలేకపోతోంది.

Updated : 11 Feb 2024 13:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌(Rajinikanth) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘లాల్‌ సలాం’(Lal Salaam). ఇందులో ఆయన మొయినుద్దీన్‌ భాయ్‌గా కనిపించారు. భారీ అంచనాలతో విడుదలై తమిళంలో ఫరవాలేదు అనిపించుకున్నా తెలుగులో నిరాశనే మిగిల్చింది. ఇక్కడ చాలా ప్రాంతాల్లో లాల్‌ సలాం మార్నింగ్‌ షోలు రద్దు అయ్యాయి. మరి కొన్ని చోట్ల స్క్రీనింగ్‌ నుంచి తొలగించారు. రజనీకాంత్‌ కొత్త సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో సహజంగానే హైప్‌ ఉంటుంది. కానీ ఈ సారి చాలా మందికి ‘లాల్‌ సలాం’ విడుదల విషయం కూడా తెలీదు. సూపర్‌ స్టార్‌ క్రేజ్‌, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన మేర వసూళ్లను రాబట్టలేకపోయిందని సినీ విశ్లేషకులు అంచనా.  

విష్ణు విశాల్‌( Vishnu Vishal), విక్రాంత్‌ (Vikranth)ప్రధాన పాత్రలు పోషించగా.. ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించారు. భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, జీవితా రాజశేఖర్‌లు దీనిలో నటించారు. 
కథేంటంటే:  క్రికెట్‌ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. హిందూ ముస్లింలు ఐకమత్యంగా సోదరభావంతో మెలిగే ఊరిలో వ్యాపారవేత్తగా ఎదుగుతాడు మొయినుద్దీన్‌ భాయ్‌. తన కొడుకు షంసుద్దీన్‌(విక్రాంత్‌)ను క్రికెటర్‌ను చేయాలన్నది అతడి కల. క్రికెట్‌లో జరిగిన ఒక గొడవ మత కల్లోలంగా మారుతుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు ఆ గొడవకు కారణమేంటి? ఊళ్లోని మత కల్లోలాలను ఎలా ఆపారు అన్నదే మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని