Randeep Hooda: వీర్‌ సావర్కర్‌ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిన హీరో!

Randeep Hooda: ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’ పాత్ర కోసం రణ్‌దీప్‌ హుడా తనని తాను మార్చుకున్నారు. నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గారు.

Published : 30 May 2023 17:58 IST

ముంబయి: టామ్‌ క్రూజ్‌ నుంచి విక్రమ్‌ వరకూ సినిమానే సర్వస్వంగా బతికే ఎంతో మంది నటీనటులు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. సినిమా, అందులోని పాత్ర కోసం నిరంతరం కష్టపడతారు.. తమని తాము కష్టపెట్టుకుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయారు బాలీవుడ్‌ నటుడు రణదీప్‌ హుడా. (Randeep Hooda) ఆయన కీలక పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న పీరియాడియకల్‌ యాక్షన్‌ డ్రామా ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’ (Swatantrya Veer Savarkar). శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్‌లో ‘వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌’ పాత్రలో రణ్‌దీప్‌ హుడాను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ పాత్ర కోసం ఆయన తనని తాను మార్చుకున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ పాత్ర కోసం రణ్‌దీప్‌ నాలుగు నెలల్లో ఏకంగా 26 కేజీల బరువు తగ్గారట. ఈ చిత్ర నిర్మాత ఆనంద్‌ పండిత్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. ‘‘రణ్‌దీప్‌ హుడా పూర్తిగా ఆ పాత్రలో లీనమైపోయారు. ఎవరూ ఆక్షేపించకుండా ఉండేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఇందుకోసం సినిమా షూటింగ్‌ మొదలవడానికి ముందే సన్నద్ధమయ్యారు. అప్పుడు ఆయన 86 కేజీలు ఉండేవారు. సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయానికి అంటే, నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గారు. బరువు తగ్గేందుకు రోజూ ఒక ఖర్జూర పండు, 1 గ్లాస్‌ పాలు మాత్రమే రణ్‌దీప్‌ తీసుకున్నారు. అంతేకాదు, దామోదర్‌ సావర్కర్‌ పాత్ర కోసం గుండు కూడా చేయించుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

ఇక టీజర్‌ విడుదల సందర్భంగా రణ్‌దీప్‌ హుడా మాట్లాడుతూ.. ‘సావర్కర్‌ అద్భుతమైన జీవితాన్ని గడిపారు. ఈ సినిమా కోసం ఆయన గురించి పరిశోధన చేసినప్పుడు ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నా. ఆయన 140వ జయంతి సందర్భంగా టీజర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.  ఈ ఏడాదే ‘వీర్‌ సావర్కర్‌’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు రణ్‌దీప్‌ హుడా నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌’ జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో పాటు, ‘లాల్‌ రంగ్‌2’లో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని