rangamarthanda review: రివ్యూ: రంగమార్తాండ

Rangamarthanda review: ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన ‘రంగమార్తాండ’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 22 Mar 2023 18:07 IST

Rangamarthanda review; చిత్రం: రంగమార్తాండ; న‌టీన‌టులు: ప‌్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ సిప్లిగంజ్‌, అన‌సూయ‌, ఆద‌ర్శ్‌, భ‌ద్రం, వేణు, అలీ రెజా, స‌త్యానంద్ త‌దిత‌రులు; మాటలు: ఆకెళ్ళ శివ‌ప్ర‌సాద్‌; ఛాయాగ్రహణం: రాజ్ కె.నల్లి; సంగీతం: ఇళయరాజా; నిర్మాత‌లు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి; ద‌ర్శ‌క‌త్వం: కృష్ణవంశీ; సంస్థ‌:  హౌస్‌ఫుల్ మూవీస్‌, రాజ‌శ్యామ‌ల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌; విడుదల తేదీ : 22-03-2023

కృష్ణ‌వంశీ అన‌గానే ‘గులాబి’, ‘నిన్నే పెళ్లాడ‌తా’ మొద‌లుకొని విజ‌య‌వంత‌మైన ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. సింధూరం, అంతఃపురం, ఖ‌డ్గం త‌దిత‌ర చిత్రాలతో  క్లాసిక్ సినిమాల ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నాడు. మ‌ధ్య‌లో ఫామ్ కోల్పోయినా... ఆయ‌న‌పై అంచ‌నాలు మాత్రం త‌గ్గ‌లేదు.  కొంచెం విరామం త‌ర్వాత ఆయ‌న  తెర‌కెక్కించిన సినిమా ‘రంగ‌మార్తాండ‌’. మ‌రాఠీ చిత్రం ‘న‌ట‌సామ్రాట్‌’కి రీమేక్‌గా రూపొందింది. కృష్ణ‌వంశీ సినిమాల్లోనే గుర్తుండిపోయే పాత్ర‌లు పోషించి పుర‌స్కారాలు అందుకున్న ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో  కీల‌క పాత్ర పోషించారు. బ్ర‌హ్మానందం త‌న న‌ట‌న‌లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తూ ఈ సినిమా చేశారు.  మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?  (rangamarthanda review) కృష్ణ‌వంశీ మ‌ళ్లీ  ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టేనా?

క‌థేంటంటే: రంగ‌స్థ‌లంపై ఎన్నో పాత్ర‌ల‌కి జీవం పోసి ర‌క్తి క‌ట్టించిన న‌టుడు రాఘ‌వ‌రావు (ప్ర‌కాశ్‌రాజ్‌). నాట‌క‌రంగ‌మే ప్ర‌పంచంగా బ‌తికిన  ఆయ‌న‌కి రంగ‌మార్తాండ అనే బిరుదుని ప్రదానం చేస్తారు. ఆయ‌న స్నేహితుడు చ‌క్ర‌పాణి (బ్ర‌హ్మానందం) కూడా రంగ‌స్థ‌ల న‌టుడే. ఇద్ద‌రూ క‌లిసి దేశ విదేశాల్లో ప్ర‌దర్శ‌న‌ల‌తో ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకున్నవారు.  జీవితంలో ఒక‌రి క‌ష్ట‌సుఖాల్లో మ‌రొక‌రు పాలు పంచుకున్న‌ వారు. రంగ‌మార్తాండ బిరుదుతో త‌న‌ని స‌త్క‌రించిన వేదిక‌పైనే నాట‌క రంగం నుంచి నిష్క్ర‌మించి త‌ను సంపాదించిందంతా వార‌సుల‌కి క‌ట్ట‌బెడ‌తాడు రాఘ‌వరావు. అక్క‌డి నుంచి ఆయ‌న జీవితంలో కొత్త అంకం మొద‌ల‌వుతుంది. ఆ అంకంలో  ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? రంగ‌స్థ‌లంపై పోషించిన ప్ర‌తిపాత్ర‌నీ ర‌క్తి క‌ట్టించిన రాఘ‌వ‌రావుకి నిజ జీవితం ఎలాంటి పాత్ర‌ని ఇచ్చింది? మ‌రి  జీవిత నాట‌కంలో గెలిచాడా లేదా?  త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: నాట‌క‌రంగం నేప‌థ్యంలో సాగే  అమ్మానాన్న‌ల క‌థ ఇది.  విశ్రాంత జీవితాన్ని గ‌డుపుతున్న క‌న్న‌వాళ్ల‌ని ఎలా చూసుకోవాలో, వాళ్ల‌తో ఎలా మెల‌గాలో  చెప్పే  పిల్ల‌ల క‌థ‌.  మొత్తంగా నేటి జీవితాల్ని ప్ర‌తిబింబిస్తూ మ‌న‌సుల్ని త‌డిచేసే ఓ హృద్య‌మైన  క‌థ‌. మ‌రాఠీలో విజ‌య‌వంత‌మైన ‘న‌ట‌సామ్రాట్‌’కి రీమేక్‌ అయినా... కృష్ణ‌వంశీ త‌న మార్క్ తెలుగుద‌నం, త‌న మార్క్ పాత్రీక‌ర‌ణ‌, భావోద్వేగాలతో తీర్చిదిద్దిన సినిమా ఇది.  న‌టులు ఒక్కొక్క‌రూ  ఒక్కో రంగ‌మార్తాండునిలా  విజృంభించి త‌మ పాత్ర‌ల‌కి ప్రాణం పోయ‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సినిమా ఇది. రాఘ‌వ‌రావు, చ‌క్ర‌పాణి తెర‌పై క‌నిపించిన కొద్దిసేప‌టికే... వాళ్ల జీవితాల‌తో మ‌మేక‌మ‌వుతూనే,  ప్రేక్ష‌కులు  ఎవ‌రి జీవితాల్లోని సంఘ‌ట‌న‌ల్ని వాళ్లు త‌మ త‌మ మ‌నోఫ‌ల‌కంపై ఆవిష్క‌రించుకుంటూ  భావోద్వేగాల ప్ర‌యాణం చేస్తారు. థియేట‌ర్ నుంచి బ‌య‌టికొచ్చాక కూడా ఆ పాత్ర‌లు  వెంటాడుతూ వ‌స్తుంటాయి. అంత ప్ర‌భావం చూపిస్తుందీ చిత్రం. రంగ‌స్థ‌లంపై నాట‌కంలో ఒకొక్క భాగాన్ని ఒక్కో అంకం అని ఎలా పిలుస్తామో... అలా రాఘ‌వ‌రావు జీవితంలోని రెండు ప్ర‌ధాన  అంకాల్ని చూపించాడు ద‌ర్శ‌కుడు.  నాట‌కాల్లో చేయి తిరిగిన  రాఘ‌వ‌రావు రంగ‌మార్తాండ అనిపించుకుంటాడు.  ఆరోజే రంగ‌స్థ‌లానికి స్వ‌స్తి ప‌లికి కొత్త జీవితాన్ని మొద‌లుపెడ‌తాడు. (rangamarthanda review) ఇక న‌ట‌న కాకుండా... జీవిద్దాం అనుకుంటాడు. కానీ, జీవితం మాత్రం ఇదే అతి పెద్ద రంగస్థ‌లం అని చెప్ప‌క‌నే చెబుతుంది. ఆ క్ర‌మంలో చోటు చేసుకునే సంఘ‌ర్ష‌ణే సినిమా అంతా.

జీవిత‌మంతా న‌చ్చిన‌ట్టుగా బ‌తికిన రాఘ‌వ‌రావు... ఎదిగిన త‌న పిల్ల‌ల ద‌గ్గ‌ర ఇమ‌డ‌లేక స‌త‌మత‌మ‌య్యే స‌న్నివేశాలు మ‌న‌సుల్ని క‌దిలిస్తాయి. పోనీ రాఘ‌వ‌రావు  ఏమైనా  ఈత‌రంతో ఇమ‌డ‌లేని  పాత‌కాల‌పు చాద‌స్తపు మ‌నిషా అంటే కాదు.  క‌ళాకారుడు స‌మాజం కంటే  ఒక త‌రం ముందుంటాడ‌నే విష‌యాన్ని న‌మ్మి అందుకు త‌గ్గ‌ట్టుగా న‌డుచుకునే ఆధునిక భావాలున్న మ‌నిషి.  అలాంటి మ‌నిషి కూడా ప‌రిస్థితుల ప్ర‌భావంతో  సంఘ‌ర్ష‌ణ‌కి గుర‌య్యే వైనం ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తుంది. ఇటు త‌ల్లిదండ్రులు, అటు పిల్ల‌లు... తరాల‌కి త‌గ్గ‌ట్టుగా  ఎవ‌రి ఆలోచ‌న‌లు వాళ్ల‌వి.  ఎవ‌రినీ త‌ప్పు ప‌ట్ట‌లేం. అలాంటి ప‌రిస్థితుల మ‌ధ్యే సంఘ‌ర్ష‌ణ‌ని సృష్టించ‌డంలో కృష్ణ‌వంశీ విజయం సాధించారు. పాఠశాల‌లో తెలుగు మాట్లాడింద‌ని త‌న మ‌న‌వ‌రాల్ని శిక్షించిన‌ప్పుడు... సాంస్కృతిక వేడుక‌ల్లో భాగంగా పిల్ల‌ల‌తో డ్యాన్స్‌ వేయించిన‌ప్పుడు  ప్ర‌కాశ్‌రాజ్ ఆవేశ‌ప‌డి, ఆవేద‌న‌కి గుర‌య్యే సంద‌ర్భం మ‌న‌సుల్ని క‌దిలిస్తుంది. షేక్‌స్పియ‌ర్ నాట‌కాలతో పోల్చి తెలుగు నాట‌క‌రంగాన్ని త‌క్కువ చేసి మాట్లాడే సంద‌ర్భంలో స‌న్నివేశాలు సినిమాకి హైలైట్‌. (rangamarthanda review) ప‌తాక స‌న్నివేశాల్లో ప్ర‌కాశ్‌రాజ్, ర‌మ్య‌కృష్ణ క‌లిసి రోడ్డు ప‌క్క‌న నిదుర‌పోయే స‌న్నివేశాలు మ‌న‌సుల్ని బ‌రువెక్కిస్తాయి. రాఘ‌వ‌రావు స‌న్నిహితుడు  చ‌క్ర‌పాణి (బ్ర‌హ్మానందం)  జీవితం కూడా క‌థ‌కి కీల‌కం.  భ‌ర్త చాటు భార్య‌గా బ‌తుకుతున్న రాజుగారు (ర‌మ్య‌కృష్ణ‌) త‌న భ‌ర్త‌కి అవ‌మానం ఎదురైన‌ప్పుడు ఆమె ప‌డే వేదన‌,  ఆస్ప‌త్రిలో ప్ర‌కాశ్‌రాజ్ - బ్ర‌హ్మానందం మ‌ధ్య స‌న్నివేశాలు సినిమాకి ఆయువుప‌ట్టుగా నిలిచాయి.  వాణిజ్య ప్ర‌ధానమైన సినిమాల‌కి పెట్టింది పేరైన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...  మ‌న‌సుల్ని త‌డిచేసి, హృద‌యాల్ని మెలిపెట్టే  సినిమాలు అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే వ‌స్తుంటాయి. అలాంటి మ‌రో  చిత్ర‌మే ఇది. ఇందులో సందేశం నేటిత‌రానికి చాలా అవ‌స‌రం.

ఎవ‌రెలా చేశారంటే: ప్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ‌... ఈ ముగ్గురూ సినిమాకి మూల‌స్తంభాలు. ప్ర‌కాశ్‌రాజ్ చాలా రోజుల త‌ర్వాత  ఓ బ‌ల‌మైన పాత్ర‌లో క‌నిపిస్తారు. త‌న‌కున్న అనుభ‌వంతో ఆ పాత్ర‌ని ర‌క్తిక‌ట్టించారు. ప‌ద్యాలు, ఆంగ్ల సంభాష‌ణ‌లు, అచ్చ తెలుగు మాట‌ల్ని  చెబుతూ ఆ పాత్ర‌కి మ‌రింత వ‌న్నె తీసుకొచ్చాడు. ప్ర‌కాశ్‌రాజ్ త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేర‌నిపించేలా ఉంటుంది రాఘ‌వ‌రావు పాత్ర‌. బ్ర‌హ్మానందంలోని కొత్త కోణం ఇందులో క‌నిపిస్తుంది.  ఆయ‌న పేరు చెప్ప‌గానే కామెడీ పాత్ర‌లే గుర్తొస్తాయి. కానీ ఆయ‌న ఇందులో హృద‌యాల్ని బ‌రువెక్కించేలా న‌టించి ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు.  ర‌మ్య‌కృష్ణ ఎక్కువ సంభాష‌ణ‌లు లేకుండా... క‌ళ్ల‌తోనే భావోద్వేగాలు ప‌లికించే పాత్ర‌ని చేసింది. రాజుగారూ అంటూ ఆమెను ప్ర‌కాశ్‌రాజ్ సంబోధించ‌డం, వాళ్లిద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌తని చూస్తే స‌గ‌టు ప్రేక్ష‌కుడికి వాళ్ల త‌ల్లిదండ్రులు గుర్తుకురాక మాన‌రు. (rangamarthanda review) శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్‌, అన‌సూయ‌, ఆద‌ర్శ్, అలీ రెజా  నేటిత‌రం పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఆయా పాత్ర‌ల‌పై బ‌ల‌మైన ప్ర‌భావ‌మే చూపించారు.  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ఇళ‌య‌రాజా సంగీతం సినిమాకి ప్ర‌ధాన బ‌లం. పాట‌లు, నేప‌థ్య  సంగీతం క‌థ‌లో భాగంగా సాగుతాయి. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఆకెళ్ళ శివ‌ప్ర‌సాద్ మాట‌లు సినిమాకి మ‌రో హైలైట్‌. నాట‌కం, జీవితం, సినిమాల‌పై ఎంతో అవ‌గాహ‌న ఉంటే త‌ప్ప  అలాంటి మాట‌లు రాయ‌లేరు. సినిమా ఆరంభంలో ల‌క్ష్మీభూపాల్ ర‌చ‌న‌లో చిరంజీవి చెప్పిన షాయిరీ ఆక‌ట్టుకుంటుంది.  దర్శ‌కుడు కృష్ణ‌వంశీ మేకింగ్‌లో ఆయ‌న ప‌ట్టుని, అనుభ‌వాన్ని రంగ‌రించి మ‌రో గుర్తుండిపోయే చిత్రాన్ని తెర‌కెక్కించారు. 

బ‌లాలు: + నటీనటుల భావోద్వేగాలు; + బ్ర‌హ్మానందం పాత్ర‌; + సంగీతం

బ‌ల‌హీన‌త‌లు: - తారాబ‌లం లేక‌పోవ‌డం;- ప్రేక్ష‌కుడి అంచ‌నాకి త‌గ్గ‌ట్టుగా సాగే క‌థ

చివ‌రిగా...: ర‌ంగ‌మార్తాండ‌... మ‌న‌సుల్ని హ‌త్తుకునే చిత్రం (rangamarthanda review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని