Rocketry Review: రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’

Madhavan - Rocketry Review: రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ చిత్రం ఎలా ఉందంటే..? 

Updated : 01 Jul 2022 08:32 IST

చిత్రం: రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌; నటీనటులు: ఆర్‌.మాధవన్‌, సిమ్రన్‌, రజిత్‌ కపూర్‌, రవి రాఘవేంద్ర, మిషా ఘోషల్‌, సూర్య, షారుఖ్‌ ఖాన్‌, తదితరులు; సంగీతం: శ్యామ్‌ సి.ఎస్‌; సినిమాటోగ్రఫీ: సిర్షా రేయ్‌; ఎడిటింగ్‌: బిజిత్‌ బాలా; నిర్మాతలు: సరితా మాధవన్‌, మాధవన్‌, వర్ఘీస్‌ మూలన్‌, విజయ్‌ మూలన్‌; నిర్మాణ సంస్థలు: ట్రై కలర్‌ ఫిల్మ్స్‌, వర్ఘీస్‌ మూలన్‌ పిక్చర్స్‌; రచన, దర్శకత్వం: ఆర్‌.మాధవన్‌; విడుదల తేదీ: 1-07-2022

బ‌యోపిక్‌ల కాలం న‌డుస్తోందిప్పుడు. క్రీడాకారులు, రాజ‌కీయ నేత‌లు మొద‌లుకొని వ్యాపార‌వేత్తలు, మేధావులు, న‌టుల వ‌ర‌కూ స‌మాజంపై ప్రభావం చూపించిన ఎంతోమంది ప్రముఖుల జీవిత క‌థ‌లు సినిమాలుగా తెర‌కెక్కుతున్నాయి. ఆ ప‌రంప‌ర‌లో వ‌చ్చిన మ‌రో జీవిత క‌థే.. ‘రాకెట్రీ’ (Rocketry movie). ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త‌, గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల్ని ఎదుర్కొని నిర‌ప‌రాధిగా బ‌య‌ట‌ప‌డ్డ నంబి నారాయ‌ణ‌న్ జీవిత క‌థే ఈ చిత్రం. జేమ్స్‌ బాండ్‌ని కూడా త‌ల‌ద‌న్నేలా ఉంటుంది నంబి నారాయ‌ణ‌న్ (Nambi Narayanan) జీవితం. రాకెట్ సైన్స్ కోసం ఆయ‌న చేసిన కృషి.. మ‌న దేశం కోసం చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయ‌కం. ప‌ద్మభూష‌ణ్ పుర‌స్కార గ్రహీత అయిన ఆయ‌న జీవితంలో మ‌లుపులు సినిమాల్లోని ట్విస్ట్‌లను త‌ల‌ద‌న్నేలా ఉంటాయి. మ‌రి సినిమాగా అవి ప్రేక్షకుల‌పై ఏ మేర‌కు ప్రభావం చూపిస్తాయి? న‌ంబి నారాయ‌ణ‌న్‌గా న‌టించ‌డంతోపాటు తొలిసారి ఈ సినిమా కోసం మెగాఫోన్ ప‌ట్టిన మాధ‌వ‌న్ (Madhavan) ప‌ని తీరు ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం.

కథేంటంటే: నంబి నారాయ‌ణన్ (Nambi Narayanan) అరెస్ట్ కావ‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత క‌థానాయ‌కుడు సూర్య (Suriya) ఆయనని ఓ టీవీ స్టూడియోలో ఇంట‌ర్వ్యూ చేయ‌డంతో జీవితంలో ప‌లు పార్శ్వాల్ని తెర‌పైకి తీసుకొచ్చారు. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్‌ట‌న్ విశ్వవిద్యాల‌యంలో నంబి నారాయ‌ణ‌న్ చ‌దువుకున్న రోజులు మొద‌లుకొని.. ఆరోప‌ణ‌ల నుంచి విముక్తి కావ‌డం వ‌ర‌కు ఈ క‌థ సాగుతుంది.

ఎలా ఉందంటే: నంబి నారాయ‌ణ‌న్ (Nambi Narayanan) జీవితంలోనే ఓ సినిమా ఉంది. ఆయ‌నే ఓ పెద్ద జేమ్స్‌బాండ్‌లా అనిపిస్తారు. దాంతో క‌థ ప‌రంగా, డ్రామా ప‌రంగా ప్రత్యేకంగా క‌స‌ర‌త్తులు చేయాల్సిన అవ‌స‌రం మాధ‌వ‌న్‌కి రాలేదు. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో భార‌త‌దేశం స‌త్తా చాటేందుకు నంబి నారాయ‌ణ‌న్ చేసిన కృషి ఎలాంటిదో ప్రథమార్ధంలో చూపించి, ద్వితీయార్ధంలో ఆయన ఎదుర్కొన్న ఆరోప‌ణ‌లు, త‌ద్వారా భావోద్వేగాల్ని పండించే ప్రయ‌త్నం చేశారు. స‌గ‌టు ప్రేక్షకుడు ద్వితీయార్ధంతో ఎక్కువ క‌నెక్ట్ కావొచ్చు. ప్రథ‌మార్ధంలో అంత‌రిక్ష ప‌రిశోధ‌న దిశ‌గా మ‌న దేశం వేసిన తొలి అడుగుల్ని, ఎదురైన అడ్డంకుల్ని ఆస‌క్తిక‌రంగా చూపించే ప్రయ‌త్నం చేశారు. అవి ఆస‌క్తిక‌ర‌మే కాదు, నేటి త‌రానికి అవ‌స‌రం కూడా. సాలిడ్ ఇంజిన్‌, లిక్విడ్ ఫ్యూయ‌ల్ ఇంజిన్‌, క్రయోజ‌నిక్ ఇంజిన్.. ఇలా రాకెట్ సైన్స్ గురించి ప‌లు విషయాల్ని స్పృశించారు. సామాన్య ప్రేక్షకుడు అంత‌గా క‌నెక్ట్ కాని అంశాల‌వి. కానీ రాకెట్ సైన్స్‌తోనే ముడిప‌డిన నంబి నారాయ‌ణ‌న్ జీవితాన్ని ఆ అంశాలు స్పృశించ‌కుండా తెర‌పైకి తీసుకురావ‌డం క‌ష్టం.

స్వత‌హాగా ఇంజినీరింగ్ చ‌దివిన మాధ‌వ‌న్ ఆ సాంకేతిక విష‌యాల్నింటినీ ప‌క్కాగా తెలుసుకుని తెర‌పైకి తీసుకొచ్చే ప్రయ‌త్నం చేశారు. విక్రమ్ సారాబాయ్‌, స‌తీష్ ధావ‌న్ వంటి శాస్త్రవేత్తలతో స‌న్నిహితంగా మెలుగుతూ, అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌కి అవ‌స‌ర‌మైన శాస్త్ర సాంకేతిక‌త‌ను నంబి నారాయ‌ణ‌న్ ఎలా సంపాదించారో ఇందులో ఆస‌క్తిక‌రంగా చూపించారు. వికాస్ ఇంజిన్ కోసం ఆయ‌న ప‌డిన శ్రమాని, దాన్ని ప‌రీక్షించిన విధానం నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్షకుల‌తో చ‌ప్పట్లు కొట్టిస్తాయి. త‌గినంత డ‌బ్బు, శాస్త్ర ప‌రిజ్ఞానం మ‌న దేశంలో లేక‌పోయినా.. త‌న తెగువ‌తో ఫ్రాన్స్‌, ర‌ష్యాతోపాటు, యూర‌ప్ దేశాల‌కి చెందిన శాస్త్రవేత్తల‌తో నెరిపిన సంబంధాలు, వాళ్లని ఒప్పించి అక్కడి సాంకేతిక‌త‌ని తీసుకురావ‌డం, అమెరికా నాసా నేప‌థ్యం, అబ్దుల్ క‌లామ్‌తో అనుబంధం త‌దిత‌ర స‌న్నివేశాలు ప్రథ‌మార్ధంలో చ‌క్కటి వినోదాన్ని పంచుతాయి. దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన నారాయ‌ణ‌న్ ఒక్కసారిగా గూఢ‌చ‌ర్యం కేసులో ఇరుక్కోవ‌డం క‌థ‌లో ఓ పెద్ద మ‌లుపు. ఆ క్రమంలో ఆయ‌న, ఆయ‌న కుటుంబం ప‌డిన మాన‌సిక సంఘ‌ర్షణ‌ను ద్వితీయార్ధంలో చూపించారు. ఆ స‌న్నివేశాలు ప్రేక్షకుల‌కు చ‌క్కటి భావోద్వేగాల్ని పంచుతాయి. దేశ ప్రజలంద‌రి త‌ర‌ఫున అంటూ సూర్య ప‌తాక స‌న్నివేశాల్లో చేసిన ప‌ని చ‌ప్పట్లు కొట్టిస్తుంది. మొత్తంగా చెప్పాల్సిన ఈ క‌థ‌ని అంతే ప్రభావితంగా చెప్పారు మాధ‌వ‌న్‌ (Rocketry Review).

ఎవ‌రెలా చేశారంటే: నంబి నారాయ‌ణ‌న్ (Nambi Narayanan) యుక్త వ‌య‌సులో ఉన్నప్పట్నుంచి ఆయ‌న వృద్ధాప్యం వ‌ర‌కు సాగే క‌థ ఇది. స‌వాల్‌తో కూడిన ఆ పాత్రకి త‌గ్గట్టుగా తన ఆహార్యాన్ని స‌హ‌జంగా ఉండేలా మార్చుకుంటూ మాధ‌వ‌న్ న‌టించారు. పొట్ట పెంచ‌డం, పంటి వ‌ర‌స మార్చుకోవ‌డం, నంబి నారాయ‌ణ‌న్‌లాగే తెల్ల జుట్టు, గడ్డంతో మారిపోవ‌డం వ‌ర‌కు స‌హ‌జంగానే మారిపోయి న‌టించారు మాధ‌వ‌న్ (Madhavan)‌. ఎక్కడా ప్రోస్థటిక్‌ మేక‌ప్ వాడలేదు. ఇత‌ర న‌టులు కూడా అదే త‌ర‌హాలో క‌నిపిస్తారు. అబ్దుల్ క‌లామ్‌గా గుల్షన్ గ్రోవ‌ర్ క‌నిపిస్తారు. పాత్రల‌కి త‌గ్గ న‌టుల్ని ఎంపిక చేసుకున్నారు మాధ‌వ‌న్‌. నంబి నారాయ‌ణ‌న్‌ని ఇంట‌ర్వ్యూ చేసే న‌టులుగా హిందీలో షారుఖ్‌, ద‌క్షిణాదిలో సూర్య క‌నిపిస్తారు. సూర్య (Suriya) ప‌తాక స‌న్నివేశాల్లో సినిమాపై చ‌క్కటి ప్రభావం చూపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మాధ‌వ‌న్‌కి ద‌ర్శకుడిగా ఇదే తొలి చిత్రం.

కొన్ని చోట్ల స‌న్నివేశాలు కాస్త నెమ్మది అనిపిస్తాయి త‌ప్ప ఎక్కడా త‌డ‌బాటు లేకుండా సినిమాని ప‌క్కాగా తెర‌పైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆయ‌న ర‌చ‌నలోనే బ‌లం క‌నిపిస్తుంది. ‘బేసిగ్గా భార‌తీయులు త‌మ భార్యల్ని ప్రేమ‌గా చూసుకుంటారు. అందుకే దేశంలో అంత జనాభా?’, ‘సైంటిస్ట్‌లు ఓ వింతైన వ్యక్తులు. మావాళ్లకి ప్రయోగించిన రాకెట్ కిందప‌డితే ఎలా ఫీల్ అవ్వాలో తెలుసేమో కానీ, మ‌నిషి ప‌డితే ఎలా ఫీల్ అవ్వాలో తెలియ‌దేమో’ లాంటి అర్థం వచ్చే సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. సంగీతం, కూర్పు చ‌క్కగా అమ‌రాయి. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. ప‌లు దేశాల‌తో ముడిప‌డిన ఈ క‌థ‌ని అంతే ప‌క్కాగా తెర‌పై చూపించారు. ఒక సైంటిస్ట్ జీవితం కాబ‌ట్టి క‌థానాయ‌కుడి పాత్రని స‌గ‌టు సినిమాల త‌ర‌హాలో హీరోయిక్‌గా, డ్రమటిక్‌గా చూపించలేక‌పోయారు మాధ‌వ‌న్‌. అది సామాన్య ప్రేక్షకుల‌కి రుచించ‌ని విష‌య‌మే కానీ, ఇలాంటి క‌థ‌ని ఇలా తీయ‌డమే ఉత్తమం అనిపిస్తుంది.

బ‌లాలు

క‌థ‌లో మ‌లుపులు

మాధ‌వ‌న్ న‌ట‌న

ద్వితీయార్ధంలో భావోద్వేగాలు

ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- ప్రథ‌మార్ధంలో నెమ్మ‌దైన స‌న్నివేశాలు

చివ‌రిగా: రాకెట్రీ.. ఓ నిజాయ‌తీ ప్రయ‌త్నం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts