RRR: ఆస్కార్‌ కమిటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌.. అరుదైన గౌరవమంటూ అభినందనలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ పురస్కారాలు అందజేసే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ప్యానెల్‌ సభ్యులుగా ఆరుగురు ఎంపికయ్యారు.

Updated : 29 Jun 2023 15:22 IST

హైదరాబాద్‌:  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర బృందం కూడా ఇప్పటి వరకు ఎన్నో అవార్డులను అందుకుంది. తాజాగా ఈ మూవీ టీమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ఆస్కార్‌ కమిటీలో అవకాశం లభించింది.

ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (The Academy Of Motion Picture Arts And Sciences) కొత్తగా ఆస్కార్‌ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇందులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు చెందిన ఆరుగురు ఉండడం విశేషం. మన స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌తో (NTR) పాటు సంగీత దర్శకుడు కీరవాణి (MM Keeravani), గేయ రచయిత చంద్రబోస్‌, అలాగే ఛాయాగ్రాహకుడు సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సిరిల్‌లకు ఈ కమిటీలో స్థానం దక్కింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే మణిరత్నం, కరణ్‌జోహార్‌లకు కూడా ఆస్కార్‌ కమిటీ ఆహ్వానం పలికింది. 

ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమాలోని పాటను అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డు వరించింది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే రికార్డు సాధించిన వీరికి ఆస్కార్‌ కమిటీలో చోటు కల్పించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దర్శకధీరుడు రాజమౌళికి (Rajamouli) కూడా స్థానం కల్పించి ఉంటే బాగుండేదంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాదికిగానూ ఆస్కార్‌ ఆర్గనైజర్స్‌ మెంబర్‌ షిప్‌ దక్కించుకున్న వారిలో 40శాతం మహిళలు ఉన్నారు. అలాగే  వచ్చే ఏడాది ఆస్కార్‌ వేడుక మార్చి 10న నిర్వహించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు