Salman Khan: స్టేజ్‌పై కన్నీరు పెట్టుకున్న అక్షయ్‌.. సల్మాన్‌ ఏం చెప్పారంటే

బాలీవుడ్‌ అగ్రహీరోలు సల్మాన్‌ఖాన్‌ - అక్షయ్‌కుమార్‌ మధ్య జరిగిన తాజా సంభాషణలు ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో వీరిద్దరి గురించే బీటౌన్‌ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.

Published : 17 Dec 2022 16:37 IST

ముంబయి: ‘రక్షాబంధన్‌’ ప్రమోషన్‌ టైమ్‌లో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) స్టేజ్‌పై కన్నీరు పెట్టుకున్న ఓ వీడియోపై సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) తాజాగా స్పందించారు. సోషల్‌మీడియా వేదికగా ఈ వీడియో చూసిన ఆయన భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. ‘‘ఇప్పుడే సోషల్‌మీడియాలో ఈ వీడియో చూశాను. దీనిని అందరితో పంచుకోవాలనిపించింది. దేవుడి దీవెనలు నీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నా అక్కీ. నిజంగానే నువ్వు గొప్ప వ్యక్తివి. ఈ వీడియో చూసి నేనూ ఎమోషనల్‌ అయ్యాను. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. మరెన్నో సినిమాల్లో నటించాలి’’ అని సల్మాన్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. దీనిపై అక్షయ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నీ సందేశం నా హృదయాన్ని తాకింది. నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నువ్వు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా’’ అని రిప్లై ఇచ్చారు.

చెల్లెళ్ల పెళ్లి చేయడం కోసం ఓ అన్నయ్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే ఆసక్తికర అంశాలతో ‘రక్షాబంధన్‌’ తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాఖీ రోజున అక్షయ్‌ ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఆసమయంలోనే అక్షయ్‌ సోదరి పంపించిన ఓ ఎమోషనల్‌ సందేశాన్ని షోలో ప్రసారం చేశారు. ‘‘నాన్న చనిపోయిన తర్వాత ఇంటిల్లిపాదిని నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు. మాకోసం ఎంతో కష్టపడ్డావు. అన్నింటా అండగా నిలిచావు’’ అంటూ ఆమె మాటలతో సాగిన ఈ వీడియో చూసిన ఆయన కళ్లల్లో నీరు తిరిగాయి. తాజాగా ఈ వీడియోను ఓ నెటిజన్‌ షేర్‌ చేయగా.. దాన్ని చూసిన సల్మాన్‌ ఈ విధంగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని