Shaakuntalam: షూటింగ్‌కి ఎప్పుడొస్తారని ఒక్క ఫోన్‌కాల్‌ రాలేదు: సమంత

‘శాకుంతలం’ సినిమా ప్రెస్‌మీట్‌ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ జరిగింది.

Updated : 10 Apr 2023 21:27 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన దృశ్యకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్‌ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. మరి కొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను చిత్రబృందం తాజాగా వెల్లడించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సమంత, గుణశేఖర్‌, దిల్‌రాజు పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

భారతదేశం మొత్తానికి తెలిసిన పాత్ర ఇది. శకుంతల పాత్ర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?

సామ్‌: చిన్నప్పుడే ఈ కథను చదివాను. దీని గురించి కొంచెం మాత్రమే తెలుసు. పూర్తి వివరాలు తెలియదు. గుణశేఖర్‌ నాకు ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇది నేటి తరానికి ఉపయోగపడే కథ. ఈ పాత్ర గురించి వినగానే చేయనని చెప్పేశాను. ఎందుకంటే, అప్పుడే నేను రాజీ లాంటి పాత్ర పోషించాను. వెంటనే ‘శకుంతల’గా కనిపించడం కష్టమనిపించింది. నేను చేయగలనో లేదోనని భయపడ్డా. దర్శకుడు ధైర్యం చెప్పడంతో అడుగు ముందుకేశా. ప్రతి సినిమాకు నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. అలాగే, ఈ సినిమాకు కూడా బెస్ట్‌ ఇచ్చాననే అనుకుంటున్నా. దర్శకనిర్మాతలు సంతృప్తిగానే ఉన్నారని భావిస్తున్నా.

శకుంతల పాత్ర నేటి తరం మహిళలకు ఏవిధంగా కనెక్ట్‌ అవుతుంది?

సామ్‌: శకుంతల.. ప్రేమలో పడుతుంది. సమాజంలో తన స్థానం కోసం పోరాటం చేస్తుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా తలవంచకుండా ముందుకు అడుగువేస్తుంది. విజయం అందుకుంటుంది. నాకు తెలిసినంతవరకూ తనే మొట్టమొదటి సింగిల్‌ మదర్‌.

ఒకప్పటి సమంతకు, ఇప్పటి సమంతకు ఉన్న వ్యత్యాసం ఏమిటి?

సామ్‌: పరిస్థితుల వల్ల మనిషి మారుతూ ఉంటాడు. అప్పట్లో నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పెద్ద సమస్యల్లేవు దాంతో నేను సంతోషంగా, సింపుల్‌గా ఉన్నాను. కానీ, సమస్యలు వచ్చిన తర్వాత నేను ఇలా మారిపోయాను. ధైర్యంగా అడుగు వేయడం తెలుసుకున్నాను. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు.. అవి నన్ను నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నా.

ఈ పాత్ర చేసే ముందు రెఫరెన్స్‌ కోసం మీరు ఏదైనా సినిమా చూశారా?

సామ్‌: ‘శాకుంతలం’ విషయంలో గుణశేఖర్‌ గారికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ఆయన విజన్‌కు అనుగుణంగా ప్రయాణం చేశాను. ఆయన మైండ్‌లో ఏదైతే ఉందో అదే నాకూ ఉండటం వల్ల సినిమా షూట్‌ సరదాగా గడిచింది. ప్రతి సీన్‌ ఒకటి లేదా రెండు టేక్స్‌లో పూర్తి చేసేశాను.

ఇకపై అన్నీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్సే చేస్తారా? (విలేకరి సమంతను ఈ ప్రశ్న అడగ్గా దిల్‌రాజు బదులిచ్చారు)

దిల్‌రాజు: అది కథపై ఆధారపడి ఉంటుంది. నిర్మాతలు, దర్శకులు పాన్‌ ఇండియా సినిమా చేయాలనుకుంటే నటీనటులు నటిస్తారు. 

3డీలో ట్రైలర్‌ చూశాక మీ భావన ఏమిటి?

సామ్‌: కొచ్చిలో ఈసినిమా 3డీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. దాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ కథకు 3డీ అవసరం. గుణశేఖర్‌ ఒక మేజికల్‌ వరల్డ్‌ క్రియేట్‌ చేశారు.

అర్హతో మీకున్న మధుర జ్ఞాపకం?

సామ్‌: అర్హ స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది.

ఇది హిందీ సినిమానా లేదా తెలుగు సినిమానా? (విలేకరి ఈ ప్రశ్న సమంతను అడగ్గా దిల్‌రాజు జవాబిచ్చారు)

దిల్‌రాజు: ఇది తెలుగు సినిమా.

మరి, సామ్‌.. హిందీలో పబ్లిసిటీపై పెట్టిన దృష్టి తెలుగుపై ఎందుకు పెట్టడం లేదు?

దిల్‌రాజు: నిర్మాతగా నేను ఏది డిజైన్‌ చేస్తే నటీనటులు అక్కడికి వస్తున్నారు. ప్రమోట్‌ చేస్తున్నారు. తెలుగులో చేయడం లేదు అనేది కరెక్ట్‌ కాదు. గడిచిన మూడు రోజుల నుంచి తెలుగులోనే ప్రమోషన్స్‌ చేస్తున్నాం.

సామ్‌: అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్నిరోజులు నుంచి నేను బ్రేక్‌లో ఉన్నాను. ‘ఖుషి’, ‘సిటాడెల్‌’ షూట్స్‌ ఉన్నాయి. ఆయా షూట్స్‌లో పాల్గొంటూనే ఈ సినిమా ప్రమోషన్స్‌ చేస్తున్నాను. ‘సిటాడెల్‌’ షూట్‌లో ఉన్నప్పుడు ముంబయి ప్రమోషన్స్‌లో చేశా. ‘ఖుషి’ షూట్‌లో ఉన్నప్పుడు కొచ్చిలో ప్రమోషన్లలో ఉన్నాను. అంతేకానీ, తెలుగులో కాకుండా వేరే రాష్ట్రాల్లోనే ప్రమోట్‌ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు కూడా ‘ఖుషి’ షూట్‌ నుంచే ఇక్కడి వచ్చాను.

దిల్‌రాజు: నిర్మాతలుగా మాకు తెలుగు రాష్ట్రాలు ముఖ్యం. డబ్బులు ఎక్కువ వచ్చేది ఇక్కడే. సామ్‌కు ఉన్న సమస్యలకు అనుగుణంగా మేము ఆయా ప్రాంతాల్లో ప్రమోషన్స్‌ చేస్తున్నాం. తను ఎంతో కష్టపడుతోంది.

శకుంతల - దుష్యంత్‌ కలిసిన తర్వాత సినిమా ఎంత వరకూ చూపించారు?

గుణశేఖర్‌: వాళ్లు కలవడం, భరతుడి పట్టాభిషేకంతో సినిమాకు శుభం కార్డు పడుతుంది.

ఈ చిత్రానికి మీరు సోలో ప్రొడ్యూసరా?

దిల్‌రాజు: జాయింట్‌. గుణశేఖర్‌ వాళ్ల కుమార్తె, నేనూ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాం. ముందు వాళ్లే ఈ సినిమా అనుకున్నారు. తర్వాత నేను భాగం అయ్యాను.

తెలుగు నటీనటులు ఇక్కడి మీడియాతో కంటే హిందీ మీడియాతోనే అన్ని విషయాలు పంచుకుంటారు? దానికి కారణం ఏమిటి? (సమంతను ఈ ప్రశ్న అడగ్గా దిల్‌రాజు సమాధానమిచ్చారు)

దిల్‌రాజు: సొంతింట్లో మనం ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. నేను తమిళనాడు వెళ్లా.. వారిసు చేశా. నాకు వచ్చింది మాట్లాడా. అదే తెలుగులో అలా మాట్లాడితే కుదురుతుందా? ((నవ్వులు) మీరు (విలేకర్లు) ఆమెను కౌంటర్‌ చేస్తే నేను కాపాడాలి కదా. మీరు అడిగే ప్రశ్నకు శాకుంతలం సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ దిల్‌ రాజు నవ్వులు పూయించారు). జోక్స్‌ అన్నీ పక్కన పెడితే.. మేము తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్‌. మేము ఏం మాట్లాడినా అది వైరల్‌ అవుతుంది. ఒకవేళ నేను ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడితే ఆ తర్వాత రోజే అది వైరల్‌ అవుతుంది. కాబట్టి, ఆమె వేరే ప్రాంతాల్లో కాస్త బోల్డ్‌గా మాట్లాడినా పర్వాలేదు నడుస్తుంది.

సామ్‌: ఇప్పటివరకూ తెలుగులో ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలోనూ నో కామెంట్‌ అనేది చెప్పలేదు.

మూడు భాషల్లో డబ్బింగ్‌ చెప్పడం ఎలా ఉంది?

సామ్‌: పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నప్పుడు ఈ మాత్రం కష్టపడాలి.

ఇలాంటి పాత్రను పోషించడానికి మీరెలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? (సామ్‌ను ఈ ప్రశ్న అడగ్గా గుణశేఖర్‌ బదులిచ్చారు)

గుణశేఖర్‌: ఇది కేవలం శకుంతలకు ఎదురైన సమస్యపైనే ఉండదు. అన్ని షేడ్స్‌ ఉంటాయి.

ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్‌ లభించింది?

సామ్‌: ఇండస్ట్రీ నుంచి నాకెంతో సపోర్ట్‌ వచ్చింది. ముఖ్యంగా నిర్మాతలు బాగా సపోర్ట్‌ చేశారు. అనారోగ్యంతో ఇన్ని రోజులపాటు బ్రేక్‌ తీసుకున్నప్పటికీ ఏ ఒక్కరూ.. ‘షూటింగ్‌కు ఎప్పుడు వస్తున్నావు?’ అని ఫోన్‌కాల్‌ చేయలేదు. ఆరోగ్యం చక్కబడిన తర్వాతే రమ్మని ఒత్తిడి పెట్టలేదు. దానిని నేనస్సలు ఊహించలేదు.

ఇదొక సున్నితమైన కథాంశం. ఈ సినిమాలో భాగమైనప్పుడు కమర్షియల్‌గా ఎంతవరకు వసూళ్లు రాబడుతుందని ఆలోచించారు?

దిల్‌రాజు: ఓ నిర్మాతగా నేను 50 సినిమాలు చేశాను. నేనొక సక్సెస్‌ఫుల్‌ నిర్మాతననే విషయం అందరికీ తెలుసు. ఈ కథ చెప్పినప్పుడు ఈ ప్రాజెక్టులో నేనెందుకు భాగం కాకూడదనిపించింది. వాళ్ల మంచి ప్రయత్నంలో భాగం కావాలనుకున్నా.. అయ్యాను. ఇక ఫైనాన్సియల్‌ రిస్క్‌ అంటారా.. గత పాతికేళ్ల నుంచి నేను చేసినట్లు ఎవరూ రిస్క్‌ చేయరు. డిస్ట్రిబ్యూషన్‌ అంటేనే పెద్ద రిస్క్‌. ఈ సినిమా విషయంలో డబ్బు గురించి ఆలోచించలేదు. సక్సెస్‌ అయినా, డబ్బులు రాకపోయినా దీనిని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లాలనే భాగమయ్యాను.

నిర్మాతలు హీరోలను పొగుడుతూనే ఉండాలా?

దిల్‌రాజు: స్టార్‌ హీరో అంటే స్టార్‌ హీరోనే. ఏ భాషకు వెళ్లినా వాళ్లు స్టార్సే. మార్నింగ్‌ షోలు వేస్తే థియేటర్లు ఫుల్‌ అయ్యేలా చేసేది స్టార్‌ హీరోలే. అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదు.

‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్‌ నటించి బాక్సాఫీస్‌ వసూళ్లకు సాయం చేశారు. మరి, ఈ సినిమాలో ఎవరు ఉన్నారు? 

గుణశేఖర్‌: ‘రుద్రమదేవి’ని ప్రకటించినప్పుడు ఆ సినిమాలో అల్లు అర్జున్‌ లేడు. కథానాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాగానే దాన్ని మొదలుపెట్టాం. సగంలో.. బన్నీ అందులో జాయిన్‌ అయ్యాడు. ఆ సినిమాకు ఆయనొక ప్లస్‌ అయ్యాడు. ఇప్పుడు ‘శాకుంతలం’ కూడా కథను నమ్మే చేశాను. నా సినిమాకు దిల్‌రాజే స్టార్‌.

నాలుగు రోజుల ముందే ప్రీమియర్స్‌ వేయడం వెనుక కారణం?

దిల్‌ రాజు: నేను నెమ్మదిగా హాలీవుడ్‌ పద్ధతికి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా. హాలీవుడ్‌లో ఒక స్టూడియో సినిమాని రెడీ చేశాక.. వాళ్లు డబ్బు గురించి ఆలోచించరు. పలుచోట్ల షోలు వేస్తూ చివరకు దాన్ని రిలీజ్ చేస్తారు. హాలీవుడ్‌లో రిలీజ్‌ కంటే ముందే ఇండియాలో మనకు షోలు వేసి చూపిస్తారు. దాన్నే నేను అవలంబించాలనుకుంటున్నా. సినిమా ఫైనల్‌ కాపీ చూశాక.. నాకెంతో ఆనందంగా అనిపించింది. అందుకే దీన్ని ప్రీమియర్‌ షోలు వేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని