Avantika Vandanapu: సమంత విజయమే నాకు స్ఫూర్తి: అవంతిక వందనపు

  ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో సమంత తనకు ఎంతో సపోర్ట్‌ చేశారని నటి అవంతిక వందనపు అన్నారు. 

Updated : 04 Mar 2024 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైల్డ్‌ ఆర్టిస్టుగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం హాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు నటి అవంతిక వందనపు. చైల్డ్‌ ఆర్టిస్టుగా తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఆమె తాజాగా ఇక్కడ షూటింగ్‌ రోజులను గుర్తుచేసుకున్నారు. సమంత, కాజల్‌, నాగచైతన్యలతో కలిసి గడిపిన క్షణాలు మధురమైనవని అన్నారు.

‘భారత నటీనటులు హాలీవుడ్‌లోనూ రాణించడం ఎంతో ఆనందంగా ఉంది. వారిలో నేనూ భాగమవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నేను టాలీవుడ్‌లో నటించినప్పుడు అక్కడి నటీనటులంతా బాగా చూసుకున్నారు. ‘ప్రేమమ్‌’ సెట్‌లో నాగచైతన్య చాలా ప్రేమ చూపేవారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వారికి సమంత, కాజల్‌ అగర్వాల్‌ ఎంతో సపోర్ట్‌ చేస్తారు. నాపై కూడా వీళ్లిద్దరూ అపారమైన ఆప్యాయత చూపారు. సమంత ఇప్పుడు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఆమె విజయమే నాకు స్ఫూర్తి’ అని చెప్పారు. హాలీవుడ్‌లో అవకాశాలు తెచ్చుకోవాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాలని అవంతిక అన్నారు. భారతీయ సినీ పరిశ్రమతో పోలిస్తే హాలీవుడ్‌ చాలా భిన్నంగా ఉంటుందని ఆమె చెప్పారు. ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు బంధుప్రీతి, వర్ణవివక్ష వంటి సవాళ్లనూ అధిగమించాలన్నారు.

అవంతిక వందనపు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’తో బాలనటిగా తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమయ్యారు అవంతిక. ఆ తర్వాత ‘ప్రేమమ్‌’,  ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘బాలకృష్ణుడు’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లో కనిపించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మీన్‌ గర్ల్స్‌-ది మ్యూజికల్’ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం పలు హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లోనూ అవకాశాలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని