Shaitan Review: రివ్యూ: సైతాన్‌ (వెబ్‌సిరీస్‌)

సినీ దర్శకుడు మహి వి. రాఘవ్‌ తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌.. ‘సైతాన్‌’. ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో విడుదలైన ఈ సిరీస్‌ రివ్యూపై ఓ లుక్కేయండి..

Published : 16 Jun 2023 16:55 IST

Shaitan Review: వెబ్‌ సిరీస్‌: సైతాన్‌ (9 ఎపిసోడ్లు); తారాగణం: రిషి, షెల్లీ నబుకుమార్‌, రవి కాలే, దేవయాని, జాఫర్‌ సాదిక్‌, మణికందన్‌, నితిన్‌ ప్రసన్న, కామాక్షి భాస్కర్ల తదితరులు; సంగీతం: శ్రీరామ్‌ మద్దూరి; సినిమాటోగ్రాఫర్‌: షణ్ముగ సుందరం; ఎడిటర్‌: శ్రవణ్‌; ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజ్‌కుమార్‌ మురుగేశన్‌; రచన, దర్శకత్వం: మహి వి. రాఘవ్‌; స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌.

ప్రచార చిత్రాలతో నెట్టింట ఇటీవల హాట్‌ టాపిక్‌గా మారిన వెబ్‌ సిరీస్‌.. సైతాన్‌ (Shaitan). అసభ్య పదజాలం ఎక్కువగా ఉండడంతో.. ‘‘యాత్ర’లాంటి చిత్రాన్ని తీసిన దర్శకుడేనా? ఈ సిరీస్‌ని తెరకెక్కించింది’’ అని సినీ ప్రియులు ఆశ్చర్యపడేలా చేసింది. మరి, ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సిరీస్‌ కథేంటి? ఎలా ఉందో తెలుసుకుందామా (Shaitan Review)..

కథేంటంటే: భర్త వదిలేసిన సావిత్రి (షెల్లీ).. తన ముగ్గురు పిల్లలు బాలి (రిషి), గుంతీ (జాఫర్‌), జయప్రద (దేవయాని)లను పోషించేందుకు పోలీసు అధికారితో సహజీవనం చేస్తుంది. అలా చేయడం ఆమె పిల్లలకు నచ్చదు. తెలిసిన వారంతా అవమానిస్తున్నారంటూ తన తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్ద కొడుకు బాలి.. ఏదైనా పని చేసి కుటుంబాన్ని పోషించాలనుకుంటాడు. ఏ పనైనా చేస్తానంటూ అన్ని దుకాణాలు తిరిగినా ఫలితం ఉండదు. ప్రతి చోటా అవమానమే ఎదురవుతుంది. మరోవైపు, సావిత్రితో సహజీవనం చేసిన పోలీసు.. జయప్రదతోనూ సుఖం పొందాలనుకుంటాడు. అది తట్టుకోలేని సావిత్రి కుటుంబం ఆ పోలీసుని హత్య చేస్తుంది. ఆ విధంగా నేరస్థుడనే ముద్ర ఉన్న బాలి.. దళంలోకి ఎలా ప్రవేశించాడు?ప్రేమించిన దళ సభ్యురాలు కళావతి (కామాక్షి భాస్కర్ల)ని తన కుటుంబ సభ్యులు చంపేస్తామంటే బాలి ఏం నిర్ణయం తీసుకున్నాడు? హోమ్‌ మినిస్టర్‌ తలపై తుపాకీ గురి పెట్టి మరీ వార్నింగ్‌ ఇచ్చేంతగా ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఎవరెవరిని కోల్పోయాడు? అన్నది మిగతా కథ (Shaitan Review).

ఎలా ఉందంటే: ఓటీటీకి సెన్సార్‌ లేదు కాబట్టి స్వేచ్ఛ అనే పేరుతో అడల్ట్‌ కంటెంట్‌, అసభ్య పదజాలంతోనే వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా తెరకెక్కుతున్నాయనే మాటలు తరచూ వినిపిస్తున్నాయి. ట్రైలర్‌లోనే విచ్చలవిడిగా అసభ్య సన్నివేశాలు చూపించడంతో ‘సైతాన్‌’పై చాలామందికి ఆ అభిప్రాయమే ఏర్పడింది. భర్త వదిలేసిన/చనిపోయిన భార్య, వారి పిల్లల్ని సమాజం ఎలా చూస్తుందనేది ఈ సిరీస్‌ సారాంశం. నేటి హంతుకుల్ని.. ఒకప్పటి బాధితులుగా దర్శకుడు ఆవిష్కరించాడు. పగ ఉన్నవారిపై బాధితులు హత్యలు చేసుకుంటూ వెళ్లినా తప్పేం లేదన్నట్టుగా చూపించారు. సభా వేదికపై ప్రధాన పాత్ర బాలి.. హోమ్‌ మినిస్టర్‌కి వార్నింగ్‌ ఇచ్చే సీన్‌తో సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఆ ఘటన అనంతరం బాలి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ చూస్తున్న ప్రేక్షకులకు వివరించడం ఆసక్తిగా రేకెత్తిస్తుంది. అప్పటి వరకు 2002లో జరిగే కథ ఫ్లాష్‌బ్యాక్‌ (1995)లోకి వెళ్తుంది. అలా.. బాలి బాల్యాన్ని పరిచయం చేస్తూ సైతాన్‌ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు దర్శకుడు. మగ దిక్కులేని మహిళలపై కొందరు వ్యక్తులు ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడతారు?, అలాంటి వారి పిల్లల భవిష్యత్తు ఏంటి? తదితర అంశాలను ప్రస్తావించారు. ఫ్యామిలీ ఎమోషన్‌ని చూపిస్తూనే నక్సలైట్‌ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే, ఆయా సన్నివేశాలు అంతగా పండలేదు. సాగదీతగా అనిపిస్తాయి. బాలి, కళావతి లవ్‌ట్రాక్‌ మాత్రం ఆకట్టుకుంటుంది. ఒకానొక సమయంలో ఆ దళమే తనకు న్యాయం చేస్తుందని గట్టిగా నమ్మిన బాలికి ఎదురుదెబ్బ తలుగుతుంది. ఆ దళ అగ్రనేతపై పంతం గెలిచేందుకు పోలీసు అధికారులతో చేయి కలుపుతాడు. ఆయా సీన్లు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తిస్తాయి. నేపథ్య సంగీతం ఆ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్తుంది. నక్సలిజం, పోలీసు డిపార్ట్‌మెంట్‌.. ఇలా ప్రతి దాంట్లోనూ చెడ్డవారు, స్వార్థపరులు ఉంటారనేది పలు సన్నివేశాల ద్వారా చూపించారు (Shaitan Review). 

అయితే, చంపడమే అన్నింటికీ సమాధానం అన్నట్టుగా సావిత్రి, బాలి, గుంతీ, జయప్రద పాత్రలను తీర్చిదిద్దారు. తలలు తెగిపడే దృశ్యాలు, శృంగార సన్నివేశాలు, పచ్చి బూతులు.. ప్రతి ఎపిసోడ్‌లోనూ ప్రధానంగా ఉంటాయి. ‘దేనికైనా ఓ లిమిట్‌ ఉంటుంది’ అనే విషయాన్ని పక్కనపెట్టి ప్రతి పాత్రతోనూ బూతులు చెప్పించారు దర్శకుడు. హోమ్‌ మినిస్టర్‌ క్యారెక్టర్‌తో సహా! కుటుంబ సభ్యులతో కలిసి ఈ సిరీస్‌ చూడకపోవడం బెటర్‌. సిరీస్‌ విడుదలకు ముందు దర్శకుడు చెప్పినట్టే కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే ఈ సిరీస్‌ నచ్చొచ్చు. సైతాన్‌లు ఎక్కడి నుంచో ఊడిపడరు.. ఒకరు చేసిన గాయాలు కారణంగానే వారు తయారవుతారు అని చెప్పే.. ముగింపు సీన్‌ ఆకట్టుకుంటుంది (Shaitan Review).

ఎలారెలా చేశారంటే: ప్రేమ, కోపం, బాధ.. ఇలా ఎన్నో భావోద్వేగాలతో కూడిన బాలి పాత్రకు కన్నడ నటుడు రిషి పూర్తి న్యాయం చేశాడు. ‘సేవ్‌ ది టైగర్స్‌’లో చైతన్య కృష్ణకు భార్యగా నటించిన దేవయానిని ఈ సిరీస్‌లో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. షెల్లీ నబుకుమార్‌.. తల్లి పాత్రలో ఒదిగిపోయింది. గుంతీగా జాఫర్‌ చక్కని నటన కనబరిచాడు. సాంకేతికంగా సిరీస్‌ ఉన్నతంగా ఉంది. టేకింగ్‌ బాగుంది (Shaitan Review).

  • బలాలు:
  • + రిషి నటన
  • + పోలీసు డిపార్ట్‌మెంట్‌, బాలి మధ్య సాగే సీన్లు
  • బలహీనతలు: 
  • - శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం
  • - మితిమీరిన హింస
  • - నక్సలిజం నేపథ్యంలోని సాగదీత సన్నివేశాలు
  • చివ‌రిగా: ఈ ‘సైతాన్‌’.. కొందరికి మాత్రమే (Shaitan Review)!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు