Oscar Awards 2023: ‘ఆస్కార్‌’ వేడుకలు.. మర్చిపోలేని ఐదు ఘటనలు.. ఎప్పుడేం జరిగిందంటే?

ఆస్కార్‌ వేడుకలకు సంబంధించి ఏ సంవత్సరంలో ఏ ఆసక్తికర ఘటన చోటుచేసుకుందో ఓ సారి నెమరువేసుకుందామా..?

Updated : 28 Feb 2023 13:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’ (95th Academy Awards) వేడుకలకు సమయం ఆసన్నమవుతోంది. తగిన ఏర్పాట్లలో అకాడమీ బిజీగా ఉంది. ‘ఈ ఏడాది ఉత్తమ నటుడు అవార్డు ఎవరు అందుకుంటారు? ఉత్తమ దర్శకుడిగా ఎవరు నిలుస్తారు?’ అనుకుంటూ యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం 5: 30 గం.లకు ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమవుతుంది. సమీప భవిష్యత్తులో జరగబోయే ఈవెంట్‌ను చూసే ముందు.. గతంలో ఆస్కార్‌ వేదికపై చోటుచేసుకున్న ఆసక్తికర ఘట్టాలను గుర్తుచేసుకుందాం (Oscars 2023)..

ఆస్కార్‌ అందుకున్న తొలి నల్ల జాతీయుడిగా..

అది 1963వ సంవత్సరం. రెడ్‌ కార్పెట్‌పై ఓ నల్ల జాతీయుడు ఆస్కార్‌ అందుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేసింది. ఆ నటుడెవరో కాదు సిడ్నీ పోయిటర్‌ (Sidney Poitier). ‘ఈ క్షణం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నా. నన్ను ప్రేమించిన మీ అందరి వల్లే ఇది సాధ్యమైంది’ అంటూ అవార్డు అందుకున్న అనంతరం సిడ్నీ ఉద్వేగానికి లోనయ్యారు. నటనపై ఎంతో ఆసక్తి ఉన్న సిడ్నీ 1947లో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘బ్లాక్‌బోర్డ్‌ జంగిల్‌’, ‘గుడ్‌బై- మై లేడీ’, ‘గో మ్యాన్‌ గో’ తదితర చిత్రాలతో కెరీర్‌లో ముందుకెళ్తూ ‘ది డెఫియంట్‌ వన్స్‌’ సినిమాతో తొలిసారి ఆస్కార్‌ బరిలో నిలిచారు. ఆ చిత్రానికిగానూ 1958 ఆస్కార్‌ అవార్డుల్లో ఆయన ఉత్తమ నటుడిగా నామినేట్‌ అయ్యారు. ఫలితం దక్కలేదు. అయినా తన ప్రయత్నం మానుకోలేదు. ‘లిల్లీస్‌ ఆఫ్‌ ది ఫీల్డ్‌’లోని నటనకుగానూ పోయిటర్‌ 1963 ఆస్కార్‌ వేడుకల్లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఆ పురస్కారం లభించిన తొలి నల్ల జాతీయుడిగా నిలిచి, ఎంతోమందిలో స్ఫూర్తినింపారు. పోయిటర్‌ నటుడిగానే కాదు ‘ఏ పీస్‌ ఇఫ్‌ ది యాక్షన్’, ‘ఫాస్ట్‌ ఫార్వాడ్‌’, ‘ఘోస్ట్‌ డాడ్‌’లాంటి చిత్రాలతో దర్శకుడిగానూ హాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు.

ఐదుసార్లు నిరుత్సాహ పడినా...

మార్టిన్‌ స్కోర్సెస్‌ (Martin Scorsese) హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుల్లో ఒకరు. 1967లో ‘హూజ్‌ దట్‌ నాకింగ్‌ ఎట్‌ మై డోర్‌’తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2007లో ‘ది డిపార్టెడ్‌’తో బెస్ట్‌ డైరెక్టర్‌గా ఆస్కార్‌ అందుకున్నారు. విశేషం ఏంటంటే.. 1981 నుంచి మార్టిన్‌ 2005 వరకు ఉత్తమ దర్శకుడిగా ఐదు సార్లు నామినేట్‌ అయ్యారు. ఆరో ప్రయత్నంలో తనకు అవార్డు దక్కడంపై మార్టిన్‌ ఆ వేదికపై భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాతా ఆయన మూడు సార్లు బెస్ట్‌ డైరెక్టర్‌గా ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యారు. మార్టిన్‌లో నిర్మాత, స్క్రీన్‌ రైటర్‌, యాక్టర్‌ కూడా ఉన్నారు.

తిరస్కరణ.. క్షమాపణ

‘ఆస్కార్‌కు నామినేట్‌ అయినా చాలు’ అని అనుకునే నటులెందరో. అలాంటిది ఉత్తమ నటుడు విభాగంలో మార్లొన్‌ బ్రాండో (Marlon Brando) ఎంపికవగా దాన్ని ఆయన తిరస్కరించారు. తాను వేడుకకు హాజరవకుండా అమెరికన్‌ నటి, సామాజిక వేత్త సచీన్‌ లిటిల్‌ఫెదర్‌ (Sacheen Littlefeather)ను రిప్రెజెంటర్‌గా పంపించారు. ఆమె ప్రసంగిస్తున్నప్పుడూ కొందరు జాత్యహంకార ధోరణిని ప్రదర్శించారు. 1973 ఆస్కార్‌ వేడుకల్లో ఇది జరగ్గా 2022లో ఫెదర్ చనిపోవడానికి (అక్టోబరు 2) కొన్నిరోజుల ముందు అకాడమీ ఆమెకు క్షమాపణ చెప్పింది. అమెరికన్‌ ఇండియన్స్‌ను హాలీవుడ్‌ చిన్నచూపు చూస్తోందన్న కారణంతో బ్రాండో ఆ పురస్కారాన్ని వద్దన్నారట. ‘ది గాడ్‌ఫాదర్‌’ సినిమాలోని నటనకుగానూ ఆయనకు ఆస్కార్‌ను ప్రకటించారు. అంతకు ముందు, ‘ఆన్‌ ది వాటర్‌ఫ్రంట్‌’ చిత్రానికి బెస్ట్‌ యాక్టర్‌గా ఆస్కార్‌ (1954) అందుకున్నారు.

పేరు తప్పుగా పలికి..!

అవార్డుకు ఎంపికైన సినిమా పేరుకు బదులు మరో సినిమా పేరు పలికిన ఘటన 2017 ఆస్కార్‌ ప్రదానోత్సవంలో జరిగింది. ‘ది మూన్‌లైట్‌’ (The Moonlight) బెస్ట్‌ పిక్చర్‌గా ఎంపికైతే ప్రెజెంటర్స్‌ దాని స్థానంలో ‘లా.. లా.. ల్యాండ్‌’ (La la land)ను ప్రకటించారు. ఈ సినిమా తరఫున ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్‌ ఎంపికయ్యారు. ఆమె వివరాలు ఉన్న కవర్‌ను ముందుగా ఓపెన్‌ చేసిన ప్రెజెంటర్స్‌ ‘లా.. లా.. ల్యాండ్‌’ను ఉత్తమ చిత్రమనుకోవడంతో తప్పిదం దొర్లింది. దీంతో వేదికపై కొంతసేపు గందరగోళం నెలకొంది. అసలు విషయం తెలిసిన తర్వాత ‘మూన్‌లైన్‌’ చిత్ర బృందం ఆనందానికి అవధుల్లేవు.

వ్యాఖ్యాతకు చెంపదెబ్బ..!

గతేడాది జరిగిన 94వ ఆస్కార్‌ ప్రదానోత్సవ వివాదం అందరికీ తెలిసిందే. దానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ (Chris Rock) హాస్యాన్ని పండించే క్రమంలో ప్రముఖ నటుడు విల్‌ స్మిత్‌ (Will Smith) భార్య జాడా పింకెంట్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. అలోపేసియా అనే అనారోగ్య సమస్య కారణంగా జాడా పూర్తిగా గుండుతో కన్పించడంతో.. క్రిస్‌ రాక్‌ ఆమెను ‘జీ.ఐ.జేన్‌’ చిత్రంలో ‘డెమి మూర్‌’ పోషించిన పాత్రతో పోల్చారు. దీంతో సహించలేకపోయిన విల్‌ స్మిత్‌ నేరుగా వేదికపై వెళ్లి క్రిస్‌ చెంప పగలగొట్టారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత విల్‌ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. అనంతరం, ఘటనపై స్పందించిన స్మిత్‌ అకాడమీ, సహచరులకు క్షమాపణలు తెలిపారు. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అకాడమీ నిర్వాహకులు విల్ స్మిత్‌ని ఆస్కార్ వేడుకలకు హాజరుకాకుండా పదేళ్లపాటు నిషేధం విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని