Updated : 22 May 2022 06:55 IST

Sobhita Dhulipala: బాధ్యతతో చేశా

‘‘నా కెరీర్‌లో నేనింత వరకు కన్నీళ్ల కోసం గ్లిజరిన్‌ వాడింది లేదు. ‘మేజర్‌’ కథని అనుభవించిన తర్వాత జీవితంలో నాకెప్పటికీ గ్లిజరిన్‌ అవసరం ఉండదనిపించింది’’ అంది నటి శోభితా ధూళిపాళ. ‘గూఢచారి’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ తెలుగందం.. ఇప్పుడు ‘మేజర్‌’లో కీలక పాత్ర పోషించింది. అడివి శేష్‌ టైటిల్‌ పాత్ర పోషించారు. జూన్‌ 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది నటి శోభితా. ఆ  సంగతులు ఆమె మాటల్లోనే..

‘‘గూఢచారి’ చేస్తున్నప్పుడే అడివి శేష్‌కు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పట్ల ఉన్న ఆరాధనా భావాన్ని గమనించాను. ఆయన అంతకు ముందు నుంచే సందీప్‌ జీవితంపై పరిశోధన చేస్తున్నారు. ఆసక్తికరమైన సంగతుల్ని శేష్‌ నాకు చెప్పేవారు.  ఆయన ఈ చిత్రం చేస్తారని, దీంట్లో నేను చేస్తానని నాకు  తెలియదు. ఒక విధంగా ఈ కథకు నేనే తొలి ఆడియన్‌’’.

బోలెడు కోణాలున్న పాత్ర..
‘‘ఈ సినిమాలో ఒక పక్క సందీప్‌ జీవితాన్ని, మరోపక్క 26/11 తాజ్‌ ఉగ్రదాడుల్ని సమాంతరంగా చూపిస్తారు. నేను ఆ దాడుల్లో ఓ బందీగా కనిపిస్తా. నా పాత్ర పేరు ప్రమోద.  భావోద్వేగాలతో నిండిన బరువైన పాత్రిది. నిజ జీవితంలో ఒక వ్యక్తి ఈ దాడుల్ని, బాధని ఎదుర్కొన్నారు. అందుకే దీన్ని   సినిమాటిక్‌గా కాకుండా మనసు పెట్టి ఒక బాధ్యతతో చేశా. కచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది’’.

సందీప్‌ జీవన ప్రయాణం..
‘‘ఆర్మీ కథలు ఒక యుద్ధం లేదా ఒక సంఘటన మీద ఆధారపడి ఉంటాయి. ఇది అలాంటి చిత్రం కాదు. మేజర్‌ సందీప్‌ ఎలా జీవించారు? దేశం కోసం ఎంత ధైర్యంగా నిలబడ్డారు? అన్నది ఈ చిత్రంలో చూస్తారు. సందీప్‌ జీవితంలో సినిమాకి కావాల్సిన బోలెడన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఎంత కష్టం వచ్చినా సరే.. ధైర్యమైన మార్గాన్నే ఎంచుకోవాలని, అలా ఎంచుకునే సామర్థ్యం అందరిలో ఉందనే విషయాన్ని గుర్తుచేసే సినిమా ‘మేజర్‌’’.  

వాళ్లు గర్వపడాలనే!
‘‘ఈ సినిమా కోసం అడివి శేష్‌ చాలా కష్టపడ్డాడు. ఈ కథ మేజర్‌ సందీప్‌ తల్లిదండ్రులకు చాలా సున్నితమైన అంశం. వారు ఈ చిత్రం చూసి గర్వపడాలనే ఉద్దేశంతో శేష్‌ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా చూశాక సందీప్‌ తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారోనని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మహేష్‌బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం మాకు గొప్ప ఎనర్జీని ఇచ్చింది.\

తెలుగులో ఎక్కువగా చేయాలి..
‘‘నేను బయట అన్ని భాషల్లోనూ బాగానే సినిమాలు చేస్తున్నా. తెలుగులోనే సరిగ్గా కుదరడం లేదు. రానున్న రోజుల్లో ఇక్కడా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. నాకు చారిత్రక కథల్లో నటించాలని కోరిక ఉండేది. ‘పొన్నియన్‌ సెల్వన్‌’తో అది నెరవేరింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని