Adipurush: అతిథిగా ఆధ్యాత్మిక వేత్త.. ఉచితంగా టికెట్లు.. ‘ఆదిపురుష్‌’ విశేషాలివీ

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన మైథలాజికల్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’ ఈ నెల 16న విడుదలకానుంది. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..

Published : 12 Jun 2023 13:50 IST

‘రామాయణం’ (Ramayana) ఆధారంగా తెరకెక్కిన ఎన్నో సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush) ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చూద్దాం..

  • ప్రముఖ హీరో ప్రభాస్‌ (Prabhas)కు ఇది 21వ సినిమా. ఆయన నటించిన ఐదో పాన్‌ ఇండియా చిత్రం. మైథలాజికల్‌ స్టోరీలో నటించడం, హిందీ దర్శకుడితో కలిసి పనిచేయడం ఆయనకు ఇదే తొలిసారి. జగదానంద కారకుడైన రామ అవతారంలో ఇప్పటి వరకు నటించిన వారంతా మీసం లేకుండా కనిపించారు. ప్రభాస్‌ మాత్రం ‘ఆదిపురుష్‌’లో మీసంతో కనిపిస్తారు. రాముడి పాత్ర పోషించేందుకు ప్రభాస్‌ ముందుగా ఎంతో భయపడ్డారు. ప్రాజెక్ట్‌ ఓకే అనుకున్నాక మూడు రోజుల తర్వాత దర్శకుడికి ఫోన్‌ చేసి.. ప్రేక్షకులకు చేరువయ్యేలా ఈ పాత్రలో ఎలా ఒదిగిపోవాలనే విషయంపై చర్చించి, ముందడుగేశారు.
  • ఈ సినిమాలో సీత/జానకి పాత్ర పోషించే అవకాశం కృతి సనన్‌ (Kriti Sanon)కు దక్కింది. ఈ నటి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు సినిమా ‘1 నేనొక్కడినే’తో తెరంగేట్రం చేసిందీ దిల్లీ భామ. సీత పాత్రలో కృతి నటిస్తుందనే ప్రకటన వెలువడకముందు.. అనుష్కశెట్టి, కియారా అడ్వాణీ, కీర్తిసురేశ్‌ తదితరుల పేర్లు ప్రచారంలో నిలిచాయి.
  • హీరోగా బాలీవుడ్‌లో సుదీర్ఘ ప్రస్థానం ఉన్న సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన.. రావణాసురుడు/లంకేశ్‌ పాత్ర పోషించారు. మరోవైపు, ఎన్టీఆర్‌ (NTR)- కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ (Devara) సినిమాలోనూ సైఫ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
  • లక్ష్మణుడిగా బాలీవుడ్‌ నటుడు సన్నీసింగ్‌(Sunny Singh), హనుమంతుడిగా మరో బాలీవుడ్‌ నటుడు దేవ్‌దత్తా నాగే (Devdatta Nage) నటించారు.
  • ఈ సినిమాతో దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut) పేరు దక్షిణాదిన బాగా వినిపిస్తోంది. రామాయణాన్ని తెరకెక్కించారు కాబట్టి దర్శకుడిగా ఆయనకు ఎంతో అనుభవం ఉందనుకుంటే పొరపాటే. ఈ చిత్రం కంటే ముందు ఆయన హిందీలో రెండే సినిమాలకి (లోక్‌మాన్య్‌, తానాజీ) దర్శకత్వం వహించారు. రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండల్లోని ప్రధానమైన కథని ‘ఆదిపురుష్‌’లో చూపించనున్నారు.
  • అత్యున్నత సాంకేతికతతో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రచారాన్నీ చిత్ర బృందం భారీ స్థాయిలో చేసింది. అయోధ్యలో టీజర్‌ని లాంచ్‌ చేసిన టీమ్‌.. తిరుపతిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇటీవల నిర్వహించింది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి (Chinna Jeeyar Swamy) ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం. ‘‘ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి’’ అని ఆయనే తెలిపారు.
  • టికెట్ల విక్రయంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకాన్ని గౌరవిస్తూ.. ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు, రాముడి గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ (Abhishek Agarwal) 10 వేలకిపైగా టికెట్లను తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు అందివ్వనున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) సైతం తనవంతుగా 10 వేల టికెట్లను, పేద చిన్నారులకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలోని రామాలయానికి 100+1 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు శ్రేయస్‌ మీడియా (Shreyas Media) ప్రకటించింది.  తాజాగా బాలీవుడ్‌ సింగర్‌ అనన్య బిర్లా 10వేల టికెట్స్‌ను బుక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అనాథపిల్లల కోసం వీటిని కొన్నట్లు తెలిపింది. ఇన్ని టికెట్లను ఉచితంగా ఇస్తుండడం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదే ప్రథమం.
  • సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ట్రిబెకా ఫెస్టివల్‌’ (#Tribeca Festival)లో ప్రదర్శనకు ‘ఆదిపురుష్‌’ ఎంపికైంది. న్యూయార్క్‌లో ఇప్పటికే మొదలైన ఆ వేడుకలో ‘ఆదిపురుష్‌’ను జూన్‌ 13న ప్రదర్శిస్తారని చిత్ర బృందం ఇటీవల తెలిపింది.
  • సెన్సార్‌ బోర్డు (Central Board of Film Certification).. యు (U) సర్టిఫికెట్‌ జారీ చేసిన ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు. ఇంతటి రన్‌టైమ్‌తో తెరకెక్కిన అతి తక్కువ సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమా బడ్జెట్‌ సుమారు రూ. 500 కోట్లు. 3డీ ఫార్మాట్‌లో తెలుగు, హిందీలో ఏకకాలంలో రూపొందింది.
  • ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకావాల్సి ఉంది. కానీ, టీజర్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఓంరౌత్‌ అండ్‌ టీమ్‌.. వీఎఫ్‌ఎక్స్‌పై మరింత వర్క్‌ చేసింది. దాని కోసమే దాదాపు రూ. 100 కోట్లు ఖర్చయిందట.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని