
James Bond: మతిపోగొట్టే జేమ్స్‌బాండ్ సినిమాలివే!
బాండ్, జేమ్స్‌బాండ్, 007, రహస్య గూఢచారి ఎలా పిలిస్తే ఏముంది? ఏ సూపర్ హీరోకూ లేని క్రేజ్ సంపాదించుకుందీ జేమ్స్‌బాండ్ సిరీస్. సీన్ కానరీ, పియర్స్ బ్రాస్నన్, రోజర్ మూర్, డేనియల్ క్రెగ్ నటుడు ఎవరైతే ఏంటి? దండిగా కాసులు కురిపించే సత్తా ఉన్న మూవీ ఫ్రాంఛైజీగా నిలిచిపోయింది. ఎత్తుకు పైఎత్తులేస్తూ మెరుపు వేగంగా కదిలే బాండ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాడు. శత్రువులను మట్టుబెట్టేందుకు చూపించే తెగువతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాడు. సీటు చివర కూర్చోబెట్టే సాహసాలతో థియేటరు కొచ్చే ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. అందుకే 50 ఏళ్లైనా బాండ్‌కున్న బ్రాండ్ చెక్కు చెదరలేదు. 25వ జేమ్స్‌బాండ్ చిత్రంగా ‘నో టైమ్ టు డై’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా గతంలో ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలేంటి? అవి ప్రేక్షకులను ఎంతమేరకు అలరించాయో చూద్దాం.
తొలి సినిమా నుంచే ప్రభంజనం
ఇయాన్ ఫ్లెమింగ్ పుస్తకాల్లో రాసుకున్న బాండ్ పాత్రకు సీన్ కానరీ ప్రాణం పోశాడు. తొలి జేమ్స్‌బాండ్‌గా ప్రేక్షకులకు చిరస్థాయిగా మిగిలిపోయే సినిమాలను అందించాడు. ఈ సిరీస్‌లో వచ్చిన తొలి చిత్రం ‘డాక్టర్ నో’. ఇయాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్బర్ట్ ఆర్ బ్రోకలి, సాల్జ్‌మెన్ నిర్మించారు. 1962లో విడుదలైంది. జమైకాలోని బ్రిటీష్ ఏజెంట్ హత్యతో ఆ దేశానికి జేమ్స్‌బాండ్ పయనమవుతాడు. అక్కడికెళ్లాక అమెరికా అంతరిక్ష ప్రయోగాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్ నో గురించి తెలుస్తుంది. ఎలాంటి సాహసాలు చేసి వారి ప్రయత్నాలను అడ్డుకున్నాడనే కథాంశంతో తెరకెక్కిందీ సినిమా. టెరెన్స్ యంగ్ తెరకెక్కించాడు. 1 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 60 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. మొదటి చిత్రమే ఇంతటి ఘనవిజయం సాధించడంతో రెండో సినిమా ‘టు రష్యా విత్ లవ్’(1963)కి రెట్టింపు బడ్జెట్ కేటాయించారు. అది 80 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఆశ్చర్యపరిచింది. ఇది కూడా టెరెన్స్ యంగ్ దర్శకత్వంలో తెరకెక్కిందే. మూడో చిత్రం ‘గోల్డ్ ఫింగర్’(1964) చిత్రం 125 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. దీన్ని హామిల్టన్ తెరకెక్కించారు
సీన్ కానరీ విరామం.. రీ ఎంట్రీ..
జేమ్స్‌బాండ్ సిరీస్‌లో వచ్చిన నాలుగో చిత్రం ‘థండర్‌బాల్’(1965). తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన టెరెన్స్ యంగ్ మరోసారి మెగాఫోన్ పడితే, బాండ్‌గా సీన్ కానరీ మళ్లీ అదరగొట్టాడు. 9 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, 141 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టి సినీలోకాన్ని ఆశ్చర్యపరిచింది. వరుసగా నాలుగు సంవత్సరాలు, నాలుగు బ్లాక్ బస్టర్లతో సీన్‌కానరీ హాలీవుడ్‌లో తారాస్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత ‘యూ ఓన్లీ లైవ్ ట్వెస్’(1967)లో నటించాడు. లూయిస్ గిల్బర్ట్ దర్శకుడు. ఏటా పెరుగుతూ వెళ్తున్న వసూళ్లు ఈ చిత్రంతో మాత్రం తగ్గిపోయాయి. 110 మిలియన్ డాలర్లను సాధించి ‘థండర్‌బాల్’ వసూళ్లతో పోల్చుకుంటే వెనకబడింది. బాండ్‌గా సీన్‌కానరీ చివరి చిత్రమని ప్రకటించారు. దీంతో ‘ఆన్ హర్ మెజెస్ట్రీస్ సీక్రెట్ సర్వీస్’(1969) చిత్రానికి కొత్త బాండ్‌గా జార్జ్ లజెన్బీ అరంగేట్రంగా చేశాడు. ఇయాన్ ఫ్లెమింగ్ నవలలకు అతి దగ్గరగా తీసిన సినిమాల్లో ఇదొకటి. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. గత చిత్రాలతో పోల్చితే వసూళ్లు మళ్లీ తగ్గాయి. 82 మిలియన్ డాలర్లను మాత్రమే సాధించి నిర్మాతలను కొంత నిరాశపరిచింది. దీన్ని పీటర్ హంట్ తెరకెక్కించారు. దీంతో మళ్లీ సీన్ కానరీ పేరు తెరపైకొచ్చింది.
నయా బాండ్.. రోజర్ మూర్
ఏడో చిత్రం ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’(1971) చిత్రంతో మరోసారి సీన్ కానరీ జేమ్స్‌బాండ్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సీన్ కానరీ శాశ్వతంగా బాండ్ పాత్ర నుంచి విరమించుకున్నాడు. హామిల్టన్ దీన్ని తెరకెక్కించాడు. దీని తర్వాత వచ్చిన మరో రెండు చిత్రాలకు ఆయనే దర్శకత్వం చేశాడు. సీన్ కానరీ తర్వాత మూడో బాండ్‌గా రోజర్ మూర్ వెండితెరకు పరిచయమై వరసగా ఏడు సినిమాల్లో నటించాడు. ‘లైవ్ అండ్ లెట్ డై’(1973), ‘ది మ్యాన్ విత్ గోల్డెన్ గన్’(1974), సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు దక్కించుకున్నాయి.
సైన్స్ ఫిక్షన్ కథతో ప్రయోగం
పదో జేమ్స్‌బాండ్ చిత్రమైన ‘ది స్పై హూ లవ్డ్ మీ’(1977) చిత్రంలో నీటిలోపల వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌ను పంచాయి. రోజర్ మూర్ తనకు సంతృప్తినిచ్చిన చిత్రమిదేనని చెప్పుకున్నాడు. ఈజిప్ట్, ఇటలీ దేశాల్లో భారీ సెట్లతో చిత్రీకరణ జరుపుకొని నిర్మాతలకు కనకవర్షం కురిపించిందీ సినిమా. అదే ఏడాది వచ్చిన స్టార్ వార్స్ సినిమా జనాలకు విపరీతంగా నచ్చడంతో తరువాత వచ్చిన ‘మూన్‌రేకర్’(1979)ను బాండ్ చిత్రాలకు భిన్నంగా సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని జోడించి తీశారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకాడలేదు. గత చిత్రానికి రెట్టింపు బడ్జెట్‌తో తెరకెక్కించారు. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ రెండొందల మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసిందీ సినిమా. ‘మూన్‌రేకర్’ ప్రయోగం తర్వాత తదుపరి చిత్రాన్ని మునపటి బాండ్ శైలిలోనే ‘ఫర్ యువర్ ఐస్ ఓన్లీ’(1981) తీసి ప్రేక్షకులకు అందించారు. వసూళ్లు దండిగానే వచ్చాయి.
ఇండియాకి జేమ్స్‌బాండ్
జేమ్స్‌బాండ్ ‘ఆక్టోపసీ’(1983) సినిమాకోసం ఇండియాకొచ్చాడు. కథలో భాగంగా రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో చిత్రీకరణ జరుపుకుందీ చిత్రం. కబీర్‌బేడీ ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన ఓ చిన్నకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత ‘ఏ వ్యూ టు ఏ కిల్’(1985) వచ్చింది. ఇదే బాండ్‌గా రోజర్ మూర్ నటించిన చివరి చిత్రం. మొత్తం ఏడు చిత్రాలతో ఎక్కువసార్లు 007గా మెప్పించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఆ తర్వాత నాలుగో బాండ్‌గా ‘ది లివింగ్ డే లైట్స్’(1987) తో టిమోతీ డాల్టన్ తెరపైకొచ్చాడు. మిశ్రమ స్పందన లభించినా, వసూళ్లలో ఏమాత్రం తగ్గలేదు.
టైటానిక్‌తో పోటాపోటీ
జేమ్స్‌బాండ్‌గా టీమోతి డాల్టన్ రెండోసారి నటించిన సినిమా ‘లైసెన్స్ టు కిల్’(1989). బాండ్‌గా ఆయన చివరి చిత్రం కూడా ఇదే. జాన్ గ్లెన్ దర్శకుడు. ఇంగ్లాండ్‌లో ఒక్క సీన్ కూడా షూటింగ్ జరుపుకోని మొదటి చిత్రమిదే. ‘లైసెన్స్ టు కిల్’ విడుదలయ్యాక మరో బాండ్ సినిమా రావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. ఐదో బాండ్‌గా పియర్స్ బ్రాస్నన్ తెరపైకొచ్చాడు. ‘గోల్డెన్ ఐ’ సినిమా (1995)లో రహస్య గూఢచారిగా దుమ్ము దులిపి దంచికొట్టాడు. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన బాండ్‌కున్న బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదని నిరూపించిందీ సినిమా. ఏకంగా 350 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి హాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వచ్చిన ‘టు మారో నెవర్ డై(1997), టైటానిక్ చిత్రాలు ఒకే సమయంలో విడుదలవడంతో వసూళ్లు కొంతమేర తగ్గాయి. లేదంటే మరిన్ని కలెక్షన్లు రాబట్టేవాడని విశ్లేషకుల అంచనా.
క్రెగ్‌పై విమర్శలు.. ప్రశంసలు
పియర్స్ బ్రాస్నన్ ‘వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్’(1999) కోసం ఎంచుకున్న కథాంశం విమర్శలు ఎదుర్కొంది. అయినా మంచి వసూళ్లే దక్కించుకుంది. రాబర్ట్, నీల్ పుర్విస్‌లు రాసిన సొంత కథతో ఇది తెరకెక్కింది. మైఖేల్ ఆప్టెడ్ దీన్ని తెరకెక్కించారు. పియర్స్ బ్రాస్నన్ బాండ్‌గా నటించిన చివరి చిత్రం ‘డై అనదర్ డే’. 2002లో విడుదలైన ఈ చిత్రం నాలుగు వందల మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. పియర్స్ బ్రాస్నన్ తప్పుకొన్నాక కొత్త బాండ్ కోసం భారీ ఎత్తున అన్వేషణ జరిగింది. పలువురు హాలీవుడ్ తారల పేర్లు తెరపైకొచ్చాయి. డేనియల్ క్రెగ్‌ను కొత్త జేమ్స్‌బాండ్‌గా ప్రకటించాక విమర్శకులు విరుచుకుపడ్డారు. 2006లో ‘కాసినో రాయల్’ విడుదలయ్యాక తన నటనతో విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు క్రెగ్. మార్టిన్ కాంప్‌బెల్ ఈ సినిమాకు దర్శకుడు. సుమారు 600 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.
కలెక్షన్ల ప్రవాహం
‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’(2008),‘ స్కైఫాల్’(2012), ‘స్పెక్టర్’(2015) చిత్రాలతో నయా బాండ్‌గా సంచలనాలు సృష్టించాడు క్రెగ్. మొత్తం ఐదు చిత్రాల్లో బాండ్‌గా చేశాడు. విడుదలైన నాలుగు సినిమాలు 3 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ‘స్కైఫాల్’ సినిమా ఏకంగా 1 బిలియన్ డాలర్ల మార్కుని దాటి బాండ్ సినిమాల్లో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ‘నో టైమ్ టు డై’తో ఐదో సారి బాండ్‌గా పలకరించేందుకు వస్తున్నాడు క్రెగ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు అదిరిపోయే యాక్షన్ సీన్లు, స్టంట్లతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డేనియల్ క్రెగ్ తన చివరి చిత్రమని చెప్పడంతో నెక్ట్స్ ఎవరనే చర్చ ఇప్పటికే మొదలైంది. తరువాత వచ్చే బాండ్ ఎవరైనా కానీ, ఆ బ్రాండ్ చెదిరేది కాదని చెప్పుకొంటున్నారు అభిమానులు. ‘ది నేమ్ ఈజ్ బాండ్.. జేమ్స్‌బాండ్’ డైలాగ్ మళ్లీ వెండితెర మీద ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 30 దాకా వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే
- Andhra News: కాటేసిన కరెంటు
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం