Sree Vishnu: నవ్విస్తే చాలు.. మిగతా అంతా బోనస్సే!

శ్రీవిష్ణు సినిమాలతో వినూత్నమైన కథలెన్నో తెరపైకొచ్చాయి. అందుకే ఆయన సినిమా వస్తోందంటే అటు ప్రేక్షకుల్లోనూ... ఇటు పరిశ్రమల్లోనూ కథల పరంగా ప్రత్యేకమైన అంచనాలు కనిపిస్తుంటాయి. 

Updated : 21 Mar 2024 10:51 IST

శ్రీవిష్ణు సినిమాలతో వినూత్నమైన కథలెన్నో తెరపైకొచ్చాయి. అందుకే ఆయన సినిమా వస్తోందంటే అటు ప్రేక్షకుల్లోనూ... ఇటు పరిశ్రమల్లోనూ కథల పరంగా ప్రత్యేకమైన అంచనాలు కనిపిస్తుంటాయి.  ‘సామజవరగమన’ తర్వాత... ‘ఓం భీమ్‌ బుష్‌’ అంటూ మరోసారి నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘సామజవరగమన’ తర్వాత మరోసారి నవ్వులు పంచుతున్నారా?

ఈ కథలో ఓ కొత్త అంశం ఉంది. ఇప్పటివరకూ తెరపైన ఎవరూ స్పృశించని విషయం అది. మేం కథలో చెప్పిన కొత్త అంశానికే పరిమితం కాకుండా... దాని  చుట్టూ ఉన్న కథని హాస్య భరితంగా చెప్పే ప్రయత్నం చేశాం. కథలో ఆ కొత్త అంశం వచ్చేవరకూ హాస్యాన్ని ఆస్వాదిస్తారు. ఆ తర్వాత ఆ కొత్త అంశం కూడా నచ్చిందంటే దానికీ కనెక్ట్‌ అవుతారు. ఇలా అన్ని కోణాల్లోనూ ఆకట్టుకునేలా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు శ్రీహర్ష.

హాస్య ప్రధానమైన చిత్రంగానే ప్రచారం చేస్తున్నారు కదా...

నిజమే కానీ, ఇందులో అంతకుమించిన అంశాలూ ఉన్నాయి. మిస్టరీ, థ్రిల్‌తోపాటు ఐదారు అంశాలు ఈ కథలో కీలకం. అయితే ఇవి ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయనేది మాకూ తెలియదు. అందుకే హాస్యం మాత్రం పక్కా కాబట్టి ఆ కోణంలోనే ప్రచారం చేస్తున్నాం. ముందు ప్రేక్షకుల్ని నవ్విస్తే చాలు, మిగతావన్నీ బోనస్సే.

కథ అనుకున్నప్పుడే ‘ఓం భీమ్‌ బుష్‌’ పేరు ఖరారైందా?

సినిమా చూసుకున్నాక నిర్మాత వంశీ దీనికి ‘ఓం భీమ్‌ బుష్‌’ పేరే ఖరారు చేద్దాం అన్నారు. మిగతావాళ్లూ దానికి ఓటేశారు. శాస్త్రవేత్తలు కావాలని పీహెచ్‌డీ చేయాలని వెళ్లి, ఆ తర్వాత భైరవపురం అనే ఊరికి ఎలా చేరుకున్నామనేది కీలకం.

మార్కెట్‌ లెక్కలు, అంచనాలు మీపైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి?

మార్కెట్‌ పెరగాలి పెరగాలి అనుకుంటూ ఉంటే ఎప్పుడూ దానిపైనే దృష్టి ఉంటుంది. నా మార్కెట్‌ని నేనెప్పుడూ అంతకుముందు సినిమాతో బేరీజు వేసుకోను. అంతకంటే ఎక్కువ వసూళ్లు సాధించొచ్చు, వాటికంటే తక్కువగా రావొచ్చు. ఏదీ మన చేతుల్లో ఉండదు. చేస్తున్న కథ ఏమిటి? దాని బడ్జెట్‌ ఏమిటనేదే నాకు కీలకం. ఈ కథపైన నిర్మాత పెట్టిన పెట్టుబడి పోకూడదనే అంతా పనిచేస్తాం. ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమాపై పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే మూడు నాలుగు రెట్ల లాభం వచ్చింది. దీనికి ‘సామజవరగమన’ విజయం ఒక కారణమైతే, ఈ సినిమా టీజర్‌, ట్రైలర్లు, యు.వి.క్రియేషన్స్‌లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఇతర కారణాలు. పెద్ద నిర్మాణ సంస్థతో సినిమాలు చేస్తే వాళ్లు అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు.


‘‘పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత కథానాయకుడిగా మారా. ఆ తర్వాత మళ్లీ కొన్ని కీలకమైన పాత్రల్లో కనిపించా. ఇప్పుడు హీరోగా చేస్తున్నా. ఇదంతా ఓ సైకిల్‌లాంటి ప్రయాణం. ఇద్దరు ముగ్గురు హీరోలున్న సినిమాల్లోనూ చేస్తున్నా కదా, మంచి కథ అనిపిస్తే, వేరే హీరోల చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేయడానికి నేను సిద్ధమే. టాప్‌స్టార్స్‌ తప్ప అందరూ ఎప్పుడో ఒకసారి పాత్రల్లోకి దిగాల్సిందే’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని