SS Karthikeya: ‘RRR’ ఆస్కార్‌ క్యాంపెయిన్‌ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్‌!

SS Karthikeya on RRR Oscar: ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ క్యాంపెయిన్‌ కోసం భారీగా ఖర్చు చేశారని వచ్చిన వార్తలపై సినిమా లైన్‌ ప్రొడ్యూసర్‌, రాజమౌళి తనయుడు కార్తికేయ స్పష్టతనిచ్చారు.

Updated : 27 Mar 2023 14:09 IST

హైదరాబాద్‌: ‘RRR’లో ‘నాటు నాటు...’ (Naatu Naatu) తెలుగు పాటకు ఫిదా అయి, ఆస్కార్‌ నడిచి వచ్చిన వేళ కొందరు పనిగట్టుకుని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అవార్డు కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని, కొన్నారని ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ‘RRR’ లైన్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌.ఎస్‌.కార్తికేయ (SS Karthikeya) స్పష్టతనిచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడుతూ.. అభిమానుల ప్రేమను కొనలేమని, సినిమాను వాళ్లే పైస్థాయిలో నిలబెట్టారని అన్నారు.

‘‘వివిధ భాషల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఘన విజయం సాధించిన తర్వాత అమెరికా (ఇంగ్లీష్‌ వెర్షన్‌)లో జూన్‌ 1న విడుదల చేయాలని నిర్ణయించాం. థియేటర్ల వివరాలు సేకరించి ఒక్క రోజు కోసం 60 స్క్రీన్‌లపై ప్రదర్శిద్దామనుకున్నాం. అప్పటికి ఐదు రోజుల ముందే మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ మొదలైంది. ఒకరోజు అనుకుని సినిమా విడుదల చేస్తే, అలా నెల గడిచిపోయింది. నాన్‌ - ఇండియన్స్‌ సినిమాను బాగా ఆదరించారు. సాధారణంగా ఇండియన్‌ సినిమాలంటే పాటలు, డ్యాన్స్‌లు ఉంటాయని హాలీవుడ్‌ ప్రేక్షకులు ఆలోచిస్తుంటారు. అయితే, ‘ఆర్‌ఆర్ఆర్‌’లో పాటలతో పాటు, అద్భుతమైన హీరోయిజం కూడా ఉంది. ‘సినిమాలో మీకు ఏం నచ్చింది’ అని స్క్రీనింగ్‌ అయిపోయిన తర్వాత చాలా మంది అభిప్రాయాలు అడిగేవాళ్లం. ‘చరణ్‌ను తారక్‌ అన్న ఎత్తుకుని ఫైట్‌ చేసే సీన్‌ బాగా నచ్చింది’ అని చెప్పేవాళ్లు. అప్పుడే #rrrforoscars ట్రెండ్‌ మొదలైంది. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఆస్కార్‌కు పంపాలని ప్రతి దర్శకుడు అనుకుంటాడు. ‘ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు కదా’ అని మాకు అనిపించింది’’ అని కార్తికేయ చెప్పారు. 

ఎవరైనా టికెట్‌ కొనాల్సిందే!

‘‘ఆర్‌ఆర్‌ఆర్’కు భారతదేశం నుంచి అధికారికంగా ఆస్కార్‌ ఎంట్రీ లభించనప్పుడు కాస్త బాధ అనిపించింది. సినిమా పంపి ఉంటే ఇంకాస్త బలంగా ఉండేది. ‘ఆస్కార్‌ కోసం క్యాంపెయిన్‌ చేసినప్పుడు అనేక వార్తలు వచ్చాయి. బోలెడంత డబ్బు ఖర్చు చేశారని, ఆస్కార్‌ టీమ్‌ను కొనేశారని, ఆస్కార్‌ టికెట్ల కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టారని’ వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram Charan), ప్రేమ్‌రక్షిత్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవలు ఆస్కార్‌ కమిటీ ఆహ్వానితులు. కీరవాణి బాబాయ్‌, చంద్రబోస్‌లు నామినేషన్‌లో ఉన్నారు’’

‘‘కమిటీ పిలిచిన వాళ్లు, నామినేషన్స్‌లో వాళ్లు తప్పితే, ప్రతి సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందాలు టికెట్‌ కొనాల్సిందే. ఇందుకోసం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఆస్కార్‌ కమిటీకి మెయిల్‌ చేయాలి. ఆ టికెట్‌లలో కూడా వివిధ రకాల క్లాస్‌లు ఉంటాయి. మా ఫ్యామిలీ కోసం కీరవాణి బాబాయ్‌ ఆస్కార్‌ వాళ్లకు మెయిల్‌ చేశారు. వాళ్లు అన్నీ సరిచూసుకున్న తర్వాత మెయిల్‌కు రిప్లై ఇస్తూ లింక్‌ పంపారు. అలా మేము ఒక్కో టికెట్‌ 1500 డాలర్లు పెట్టి కొన్నాం. మరో నలుగురి కోసం 750 డాలర్లు పెట్టి కొన్నాం. ఇదంతా అధికారికంగా జరిగింది’’

ప్రేక్షకుల ప్రేమను కొనగలమా?

‘‘సినిమా ప్రొఫైల్‌ పెంచడానికి డబ్బులు భారీగా ఖర్చు పెట్టామన్న ప్రచారం ఎందుకు వచ్చిందో తెలియదు. ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. ఆస్కార్‌ కోసం కచ్చితంగా క్యాంపెయిన్‌ చేయాలనుకున్నాం. పబ్లిసిటీ బడ్జెట్‌కు లోబడే అంతా చేశాం. ఎక్కడ ఎంత అనేది ప్రతిదీ ప్లాన్‌ ప్రకారమే జరుగుతుంది. డబ్బులు ఇస్తే ఆస్కార్‌ కొనుకోవచ్చన్నది పెద్ద జోక్‌. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇన్‌స్టిట్యూషన్‌ అది. అక్కడ ప్రతి దానికీ ఒక ప్రాసెస్‌ ఉంటుంది. ఒక విషయం మాత్రం చెప్పగలను. ఆడియన్స్‌ ప్రేమను కొనగలమా?. సినిమా గురించి స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, జేమ్స్‌ కామెరూన్‌ మాటలను కొనలేం కదా. అభిమానులే సినిమాకు పెద్దగా ప్రచారం చేశారు’’ అని కార్తికేయ చెప్పారు.

‘‘ఆస్కార్‌ క్యాంపెయిన్‌ చేయడం కోసం హాలీవుడ్‌ సినిమా వాళ్లు పలు స్టూడియోలను ఆశ్రయిస్తారు. మాకు అలాంటి ఆస్కారం లేదు. క్యాంపెన్‌ కోసం మేము అనుకున్న బడ్జెట్‌ రూ.5 కోట్లు. అది కూడా ఎక్కువ అనిపించింది. వీలైనంత ఖర్చు తగ్గిద్దామని ప్రయత్నించాం. దాన్ని మూడు దశల్లో ఖర్చు చేయాలనుకున్నాం. మొదటి ఫేజ్‌లో రూ.3 కోట్లు ఖర్చు చేశాం. నామినేషన్స్‌ వచ్చిన తర్వాత మరికొంత బడ్జెట్‌ పెంచాం. మొత్తం క్యాంపెన్‌కు రూ.ఐదారు కోట్లు అవుతుందనుకున్నాం. చివరకు రూ.8.5కోట్లు అయింది. న్యూయార్క్‌, లాస్‌ ఏంజిల్స్‌లో మరిన్ని స్క్రీనింగ్స్‌ వేయాల్సి వచ్చింది’’అని కార్తికేయ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు