హీరో కావడం... మాటలు కాదు!

‘నేనున్నా నాయనమ్మా’ అంటూ ‘ఇంద్ర’లో ముద్దుముద్దుగా మాట్లాడుతూ తొడగొట్టి... చిన్నప్పుడే తనకంటూ స్టార్‌డమ్‌ని సృష్టించుకున్న తేజా సజ్జా ఇప్పుడు...

Published : 01 Mar 2021 15:57 IST

‘నేనున్నా నాయనమ్మా’ అంటూ ‘ఇంద్ర’లో ముద్దుముద్దుగా మాట్లాడుతూ తొడగొట్టి... చిన్నప్పుడే తనకంటూ స్టార్‌డమ్‌ని సృష్టించుకున్న తేజా సజ్జా ఇప్పుడు... జాంబిరెడ్డిగా దూసుకుపోతున్నాడు. ఈ రంగంలోకి ఇష్టంతోనే వచ్చానంటూ తన మనసులోని ముచ్చట్లను పంచుకుంటున్నాడిలా...

వాళ్ల మాటలే స్ఫూర్తి

ఇప్పటివరకూ సినిమా రంగంలో ఎంతోమంది ప్రముఖ నటులు నన్ను మెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ... ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో అభిమానుల నుంచి వచ్చే ప్రశంసలు చదవడంలో ఓ కిక్‌ ఉంటుందనిపిస్తుంది. చాలామంది ‘కొత్తరకం సినిమా కథల్ని ఎంచుకుంటున్నావు. నీకు మా అండ ఎప్పుడూ ఉంటుంది’ అని చెబుతుంటారు. అలాంటివి చదివినప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఆమె చాలా సింపుల్‌

చిరంజీవిగారితో సినిమాలు చేసినా కూడా ఆయనకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆ తరువాత సమంత గారంటే చాలా ఇష్టం. తను ఎంత పెద్ద హీరోయిన్‌ అనేది అందరికీ తెలిసిందే కానీ... ఓ వ్యక్తిగా ఆమె నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఎదుటివారితో తను వ్యవహరించే తీరు చాలా నచ్చుతుంది. అంత ఉన్నత స్థాయికి ఎదిగినా... చాలా నిరాడంబరంగా ఉంటుంది. అదే ఆమె ప్రత్యేకత.

‘చూడాలని ఉంది’తో మొదలు

చిన్నప్పుడు దాదాపు యాభై సినిమాల్లో నటించినా... మొదటి అవకాశం ఎప్పుడూ ఓ మంచి జ్ఞాపకమే. అప్పుడు నాకు రెండున్నరేళ్లు అనుకుంటా. ఓసారి మా కజిన్‌ నన్నో రెస్టరంట్‌కి తీసుకెళ్లాడట. అప్పటికే దర్శకుడు గుణశేఖర్‌ ‘చూడాలని ఉంది’ కోసం ఓ అబ్బాయిని వెతుకుతున్నారట. అక్కడ నన్ను చూసిన ఆయన ఆ సినిమాకు ఎంపికచేశారు. అలా ఊహ తెలిసేసరికే నటుడిని అయ్యా. ఆ తరువాత ‘ఇంద్ర’ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి.

‘జాంబిరెడ్డి’... ఊహించలేదు

నాకు మొదటినుంచీ దర్శకుడు ప్రశాంత్‌వర్మ పరిచయమే. అతను ఓ స్టార్‌హీరోతో సినిమా ప్లాన్‌ చేసుకుంటే - అది ఆలస్యం అవుతోంది. నేనేమో నా సినిమా ప్రయత్నాలు చేసుకుంటున్నా. సరిగ్గా అలాంటి సమయంలో ఓ రోజు ప్రశాంత్‌వర్మ ఫోన్‌ చేసి...‘బాబాయ్‌ ఓ క్రేజీ కథ సిద్ధంగా ఉంది. మనం జనవరి 26 నుంచి సినిమా మొదలుపెడుతున్నాం. రెడీగా ఉండు’ అని చెప్పి పెట్టేశాడు. అలా ‘జాంబిరెడ్డి’ మొదలయ్యింది. లాక్‌డౌన్‌ తరువాత ఈ సినిమా కోసం రోజుకు వెయ్యిమంది జాంబీలతో కలిసి చేయడం ఓ థ్రిల్‌. త్వరలో ‘ఇష్క్‌’ విడుదల కాబోతోంది.

మాది ఫార్మా కుటుంబం

మా అన్న, నాన్న ఫార్మాకంపెనీల్లో పనిచేస్తున్నారు. వీళ్లే కాదు.. మా ఇంట్లో చాలామంది ఇదే రంగంలో ఉన్నారు. ఎక్కడా సినిమా నేపథ్యం లేకపోయినా... చిన్నప్పటినుంచీ మంచి అవకాశాలే వచ్చాయి. అందుకే పెద్దయ్యాక ఈ రంగంలోనే స్థిరపడేందుకు సిద్ధమయ్యా. బీబీఏ అయ్యాక నా అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టా. అప్పుడే ‘ఓ బేబీ’లో అవకాశం వచ్చింది. అందులో హీరోని కాకపోయినా పెద్దబ్యానర్‌ సినిమా అది. దానికితోడు నా పాత్రకూ మంచి గుర్తింపే వచ్చింది.

ఆ సినిమాలు ఇష్టం

నా సినిమాల్లో నాకు యువరాజు, ఇంద్ర, ఠాగూర్‌, బాచీ అంటే చెప్పలేనంత ఇష్టం.

పెద్దగా పట్టించుకోను

మొదటినుంచీ ప్రతిదీ సానుకూలంగా తీసుకునే తత్వం నాది. అందుకే ఏదయినా బాధ కలిగినా పెద్దగా మనసుకు తీసుకోను. ఒకటి రెండు రోజుల్లోనే మర్చిపోతా. అదే నా బలం అనుకుంటా.

సినిమా కష్టాలు లేవు కానీ...

మొదటినుంచీ సినిమాల్లో ఉన్నా పెద్దయ్యాక హీరోగా స్థిరపడటం అనుకున్నంత సులువు కాదు. దాదాపు అయిదేళ్లు అవకాశాల కోసం విశ్వప్రయత్నాలు చేశా. కొంతమంది నన్ను సెలెక్ట్‌ చేసేవారు. మర్నాడు పొద్దున్నే షూటింగ్‌ ఉందనగా... కొన్ని కారణాలతో షూటింగ్‌ ఆగిపోయేది. మరికొందరేమో ‘సారీ తేజా’ అంటూ మరొకరిని ఎంపిక చేసేవారు. ఇలా చాలా అవకాశాల్ని పోగొట్టుకున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని