Kangana Ranaut: నేను ‘తలైవి’గా మారడానికి కారణం ఆయనే!

‘తలైవి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌. కంగనా రనౌత్‌, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రమిది.

Published : 05 Sep 2021 22:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘తలైవి’ చిత్రంలో నేనుండటానికి కారణం రచయిత విజయేంద్ర ప్రసాద్‌’ అని నటి కంగనా రనౌత్‌ అన్నారు. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రమిది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవింద్‌ స్వామి, జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో పూర్ణ కనిపించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘‘తలైవి’లో నేనుండటానికి కారణం రచయిత విజయేంద్రప్రసాద్‌ గారు. తలైవి పాత్రకి నేను అయితేనే బాగుంటానని చిత్రబృందానికి నా పేరు సూచించారు. ఇంతటి భారీ బడ్జెట్‌తో నాయికా ప్రాధాన్య చిత్రాన్ని రూపొందించడం అంత తేలికైన విషయం కాదు. అన్ని సవాళ్లని అధిగమించి ఈ సినిమాని నిర్మించిన విష్ణువర్థన్‌ ఇందూరి, శైలేష్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. దర్శకుడు విజయ్‌ చాలా ప్రతిభావంతుడు. కల్మషం లేని వ్యక్తి. ఇప్పటి వరకు నేను అలాంటి వ్యక్తిని కలవలేదు. ఈ సినిమాకి పనిచేసిన నటులు అరవింద్‌ స్వామి, భాగ్యశ్రీ, మధుబాల, నాజర్‌, పూర్ణ, రచయితలు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు. సమష్టికృషి వల్లే ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది’ అని తెలిపారు.

విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘నిర్మాత విష్ణువర్థన్‌ నన్ను మూడేళ్ల క్రితం కలిశారు. సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడారు. తనకి సినిమా అంటే ఎంత ఇష్టమో అప్పుడే నాకు అర్థమైంది. అందుకే సినిమాల గురించి మీకు ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను అడగండి అని చెప్పాను. అలా ఈ ప్రాజెక్టుని నా దగ్గరికి తీసుకొచ్చారు. కథ రాసే అవకాశం ఇచ్చారు. దర్శకుడు విజయ్‌ ఈ ప్రాజెక్టు కోసం ఎంతో రీసెర్చ్‌ చేశాడు. ముందుగా ఈ సినిమాలోని టైటిల్‌ పాత్ర కోసం మరో నటిని అనుకున్నారు దర్శకనిర్మాతలు. కంగనా అయితే ఈ పాత్రకి న్యాయం చేయగలదని నా అభిప్రాయం వ్యక్తం చేశా. కంగనా అలా ఈ ప్రాజెక్టులోకి వచ్చింది. జయలలిత పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమా విడుదలయ్యాక నటిగా ఆమె మరోస్థాయికి చేరుకుంటుంది’ అని అన్నారు.

విజయ్ మాట్లాడుతూ.. ‘సినిమాని ప్రేమించే తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా గౌరవం. మా సినిమాని తెలుగులోనూ చేస్తుండటం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాశ్‌ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం. ఎం.జి.ఆర్‌గా అరవింద్ స్వామి, జయలలితగా కంగనా ఒదిగిపోయారు. నేను 2000 సంవత్సరంలో విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర కథలు రాసేవాడ్ని. ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నా. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’ అని అన్నారు.

అరవింద్ స్వామి మాట్లాడుతూ.. ‘నేను చాలా సినిమాల్లో నటించాను. కానీ, ఇలాంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగస్వామికావడం చాలా ఆనందంగా ఉంది. కంగనాతో కలిసి నటించి, ఓ నటుడిగా ఎంతో నేర్చుకున్నా. ఈ సినిమాను కంగనా తన భుజాలపై వేసుకుంది. రెండు రోజుల క్రితం ఈ సినిమా చూశా. చాలా బాగుంది. ఘన విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

‘అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ‘తలైవి’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని అనుకుంటున్నా. ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉంది’ అని భాగ్యశ్రీ తెలిపారు. ‘నా కెరియర్‌లో ది బెస్ట్ ప్రాజెక్టు ‘తలైవి’. ఇందులో అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్‌కి ఈ సందర్భంగా థ్యాంక్స్‌ చెబుతున్నా. కంగనా రనౌత్‌తో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి పంచింది. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మీ అందరూ ఆ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని పూర్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, క్రియేటివ్‌ హెడ్‌ బృందా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని