Kanabadutaledu: సునీల్‌తో కలిసి నటించేందుకు భయపడ్డా..!

‘ప్రేక్షకులు కచ్చితంగా తెలుగమ్మాయి అయిన నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటున్నా’ అని తెలిపింది  వైశాలి రాజ్‌. సునీల్‌, సుక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘కనబడుట లేదు’ చిత్రంతో నాయికగా వెండితెరకు పరిచయమవుతోంది.

Published : 18 Aug 2021 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రేక్షకులు కచ్చితంగా తెలుగమ్మాయి అయిన నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటున్నా’ అని తెలిపింది  వైశాలిరాజ్‌. సునీల్‌, సుక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘కనబడుట లేదు’ చిత్రంతో నాయికగా వెండితెరకు పరిచయమవుతోంది. బాలరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడింది వైశాలి. మరి ఆమె చెప్పిన సంగతులేంటో చదివేయండి...

లఘు చిత్రాల నుంచి వెండితెరకి..

నా అసలు పేరు కవిత కోన. సినిమాల్లోకి వచ్చాక వైశాలిరాజ్‌గా మార్చుకున్నా. నేను తెలుగమ్మాయినే. నా స్వస్థలం విశాఖపట్నం. విద్యాభ్యాసమంతా అక్కడే పూర్తి చేశాను. కొన్నాళ్లు హైదరాబాద్‌, చెన్నైలో ఉద్యోగం చేశా. ఓసారి అనుకోకుండా లఘు చిత్రంలో నటించా. ‘కనబడుట లేదు’ చిత్ర దర్శకుడు బాలరాజే ఆ షార్ట్‌ ఫిల్మ్‌ చేశారు. అలా నటిగా నా ప్రయాణం ఆయనతోనే ప్రారంభమైంది. ఐదారు లఘు చిత్రాలు, ఓ సీరియల్‌లో నటించా. ఈ చిత్రంతో తొలిసారి వెండితెరకు పరిచయమవుతున్నా.

కథంతా నా చుట్టూనే..

ఇదొక క్రైమ్‌, సస్పెన్స్‌ లవ్‌స్టోరీ. థ్రిల్లర్‌ అంశాలు మెండుగా ఉంటాయి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడొస్తున్న చిత్రాల్లో ఇది ది బెస్ట్‌ అని నమ్ముతున్నా. ఈ సినిమాలో సునీల్‌ ప్రధాన పాత్రధారి. ఆయనతో తెరను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సునీల్‌తో కలిసి నటించేందుకు మొదట్లో కొంచెం కంగారు పడ్డాను. కానీ, తర్వాత అలవాటైపోయింది. సెట్‌లో సునీల్‌ ఎంతో సరదాగా ఉండేవారు. నేనిందులో మధ్యతరగతి అమ్మాయి శశిత అనే పాత్రని పోషించాను. కథ అంతా ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అన్ని ఎమోషన్స్‌ ఉన్న పాత్ర కావడంతో నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. ఇటీవల సినిమా చూశాను. నటిగా సంతృప్తి చెందాను. ప్రేక్షకులు ఇచ్చే ఫలితం కోసం వేచి చూస్తున్నా.

అలా దర్శకత్వం వైపు..

లఘు చిత్రాలు, సీరియల్‌లో నటించడం వల్ల సన్నివేశాలు తెరకెక్కించడంలో కొంత అనుభవం వచ్చింది. కెమెరా ఎక్కడ పెట్టాలి? క్లోజ్‌ షాట్‌ ఉంటే నటులు ఎక్కడ ఉండాలి? తదితర అంశాలు నేర్చుకున్నాను. దాంతో నాలో దర్శకత్వ లక్షణాలున్నాయని చాలామంది అన్నారు. నాకూ దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది.

నేపథ్యం ఏదైనా ఓకే కానీ..

ఎలాంటి నేపథ్యంలోనైనా నటించాలనుంది కానీ కథంతా నా చుట్టూనే తిరగాలి. దీపికా పదుకొణె, నయనతార, సమంత అంటే చాలా ఇష్టం. వీరి కథల ఎంపిక చాలా బాగుంటుంది.ఈ విషయంలో వాళ్లని స్ఫూర్తిగా తీసుకుంటా. ప్రస్తుతానికి కొన్ని కథల్ని వింటున్నా. ఈ సినిమా విడుదలయ్యాక నిర్ణయం తీసుకుంటా. ప్రేక్షకులు కచ్చితంగా తెలుగమ్మాయి అయిన నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని