RRR: అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరునే ఖరారు చేశాం: రాజమౌళి

‘ఆర్ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రాన్ని ప్రారంభించినపుడు ఏం టైటిల్‌ పెట్టాలో తెలియలేదని, తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ అనుకున్నామని దర్శకుడు రాజమౌళి (Rajamouli) అన్నారు.

Published : 31 Dec 2021 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రాన్ని ప్రారంభించినపుడు ఏ టైటిల్‌ పెట్టాలో తెలియలేదని, తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ అనుకున్నామని దర్శకుడు రాజమౌళి (Rajamouli) అన్నారు. ఇటీవల ఓ హిందీ షోలో పాల్గొన్న ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విశేషాల్ని పంచుకున్నారు. టైటిల్‌ గురించి వివరిస్తూ.. ‘‘ఈ సినిమాను ప్రారంభించిన సమయంలో ఏ టైటిల్‌ పెట్టాలో మాకు అర్థంకాలేదు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి పేర్లు కలిసొచ్చేలా ఈ ప్రాజెక్టును ‘ఆర్‌ఆర్‌ఆర్’ అని పిలవాలనుకున్నాం. అలా #RRR హ్యాష్‌ట్యాగ్‌తోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చాం. ఈ పేరుకు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’నే  సినిమా పేరుగా ఖరారు చేశాం’’ అని వివరించారు. ఈ సినిమా వాయిదా పడుతుందనే విషయంపైనా ఆయన స్పందించారు. విడుదల తేదీలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టంచేశారు.

పాన్‌ ఇండియా కాంబినేషన్‌..

‘‘భావోద్వేగం, విప్లవం, భారతీయ సంస్కృతి.. వీటి సమ్మేళమనమే ‘ఆర్‌ఆర్‌ఆర్’. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు లార్జర్‌ దేన్‌ లైఫ్‌గా అవతరించింది. నా భార్య రమ (కాస్ట్యూమ్‌ డిజైనర్‌) మినహా ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఇతర రాష్ట్రాలకు చెందినవారు. పాన్‌ ఇండియా అంటే ఇదేనేమో’’ అని అన్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. సుమారు రూ. 400 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2022 జనవరి 7న విడుదల కానుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని