Updated : 12 Nov 2021 07:14 IST

Pushpaka Vimanam: మీనాక్షి... బలమైన పాత్ర

‘‘సెట్లో ఎవరైనా జోక్‌ వేసినా నవ్వేదాన్ని కాదు. పాత్ర కోసం అంత తీక్షణతో పనిచేశా’’ అన్నారు గీత్‌ సైని. ‘పుష్పకవిమానం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో కథానాయిక ఈమె. ఇందులో కథానాయకుడి భార్య మీనాక్షిగా నటించింది. ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గీత్‌సైని చిత్రం గురించి, తన నేపథ్యం గురించి బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

‘‘చిట్టిలంక సుందర్‌ భార్య మీనాక్షిగా నేను నటించా. నా పాత్ర సినిమాకి చాలా కీలకం. పెళ్లయ్యాక ఇంట్లో నుంచి వెళ్లిపోతాను. ఎక్కడికి వెళ్లాను? అలా వెళ్లిపోవడానికి కారణమేమిటనేది సినిమా చూసి తెలుసుకోవల్సిందే. మీనాక్షి పాత్ర సులువేం కాదు. కెరీర్‌ ఆరంభంలోనే ఇంత బలమైన పాత్ర దొరకడంతో సవాల్‌గా తీసుకుని పనిచేశా. పాత్ర కోసం ఎప్పుడూ ఒకే మూడ్‌లో ఉండాల్సి వచ్చింది. అందుకే సెట్లో నా చుట్టుపక్కల జరిగే విషయాల గురించి అస్సలు పట్టించుకునేదాన్ని కాదు. మీనాక్షి పాత్రలో నేను చాలా భిన్నంగా   కనిపిస్తా. మీనాక్షి కోసం నేనెంతగా కష్టపడ్డానో సినిమా చూశాక ప్రేక్షకులు అదే స్థాయిలో నా పాత్రని ఇష్టపడతారు’’.

* ‘‘ఆనంద్‌ దేవరకొండ చాలా మంచి వ్యక్తి. తను సెట్లో చక్కటి సహకారం అందించారు. ‘పుష్పకవిమానం’లో అవకాశం నా స్నేహితురాలివల్లే వచ్చింది. ఈ సినిమా కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి తను నా ఫొటోల్ని పంపించింది. దర్శకుడు నన్ను చూసి మీనాక్షి పాత్రకి బాగుంటుందని ఎంపిక చేసుకున్నారు. దీనికంటే ముందు ‘అలా..’ అనే ఒక సినిమా చేశా. దాంతో అంత గుర్తింపు రాలేదు’’.

* ‘‘మహారాష్ట్రలో పుట్టినా... మా నాన్న ఉద్యోగరీత్యా పలు ప్రాంతాల్లో పెరిగా. హైదరాబాద్‌లోనే నా చదువంతా. డ్యాన్స్‌ అంటే ఇష్టం. చిరంజీవి సర్‌ సినిమాలు చూసి డ్యాన్స్‌ నేర్చుకున్నా. కాలేజీలోనే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కొద్దిమంది సహాయ దర్శకులు ‘సినిమాల్లో నటిస్తారా?’ అని అడిగారు. మొదట ఇష్టం లేదని చెప్పా. ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. ఇది మంచి వేదిక కదా, ప్రయత్నం చేద్దామనిపించి మళ్లీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. డ్యాన్స్‌ బాగా వస్తుంది కాబట్టి సాయిపల్లవిలా నృత్య ప్రధానమైన కథల్లో నటించాలని ఉంది. దాంతోపాటు మంచి కథ అనిపిస్తే తప్పకుండా అందులో నటిస్తా’’.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని