Chiranjeevi: ఆ ఒక్కమాట.. చిరుని స్పెషల్‌ డ్యాన్సర్‌ని చేసింది!

చిరంజీవి డ్యాన్సుని విమర్శించెవరు? ఎందుకలా అన్నారు? తెలుసుకుందామా..

Published : 27 Jul 2021 10:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి డ్యాన్సు గురించి ఎవరైనా మీ అభిప్రాయం అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఆయన డ్యాన్సుకేంటి.. అదుర్స్‌.. సూపర్‌ అంటారు కదా! స్వయంగా చిరంజీవే తన డ్యాన్సు గురించి అడిగితే? మీరే కాదు ఎవరైనా చాలా బాగా చేశారని కితాబిస్తారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం అలా అనలేదు. ఆయన అలా అనకపోవడం వల్లే చిరంజీవి.. డ్యాన్సులో కొత్త ఒరవడి సృష్టించారు. ఎంతోమందికి ఆరాధ్యుడిగా మారారు. మరి చిరంజీవి డ్యాన్సుని విమర్శించిందెవరు? ఎందుకలా అన్నారు? తెలుసుకుందామా..

అవి చిరంజీవి సినీ కెరీర్‌ ప్రారంభించిన రోజులు. ఆయన కథానాయకుడిగా నటించిన 5వ సినిమానో 6వ సినిమానో చిత్రీకరణ జరుగుతుంది. ఓ పాటకి తనదైన స్టైల్‌లో స్టెప్పులేశారు చిరంజీవి. ఆ డ్యాన్సుని చూసి, అక్కడున్న వారంతా క్లాప్స్‌ కొట్టారు. అదే సమయంలో ఆ చిత్రానికి మేనేజరుగా పనిచేసిన వెంకన్నబాబు చిరంజీవిని తదేకంగా చూస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్లి ‘ఎలా ఉంది?’ అని చిరంజీవి అడగ్గా.. ‘ఆ.. ఏముంది? నీ వెనక ఉన్న డ్యాన్సర్లు ఏం చేశారో, నువ్వూ అదే చేశావు. నీ ప్రత్యేకత లేకపోతే ఎందుకట?’ అని సమాధానం ఇచ్చారాయన.  ‘ఆయన మాట నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది. డ్యాన్సు మాస్టర్లు చెప్పింది చేయడమే కాదు దానికి అదనంగా ఇంకేదో చెయ్యాలని ఆ క్షణమే అనిపించింది. అప్పుడే పాటని ఆస్వాదిస్తూ డ్యాన్స్‌ చేయడం అలవాటు చేసుకొన్నా’ అని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అలా సద్విమర్శని స్వీకరించి, డ్యాన్సులకి సంబంధించి తెలుగు తెరపై నూతనాధ్యయానికి శ్రీకారం చుట్టారు. బీట్‌ ఏదైనా తనదైన మార్క్‌ వేశారు. సినీ అభిమానుల్ని ఉర్రూతలూగించారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారాయన. కాజల్‌ అగర్వాల్‌ నాయిక. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ‘లాహే లాహే’ పాట శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటతో చిరు మరోసారి తన డ్యాన్సు స్టామినా ఏంటో చూపించబోతున్నారనిపిస్తుంది. ఈ సినిమాతోపాటు మలయాళీ చిత్రం ‘లూసిఫర్‌’ రీమేక్‌ని ఖరారు చేసిన ఆయన మరికొన్ని కథలకి పచ్చజెండా ఊపారు. 





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని