MAA Elections: దమ్ముంటే నా ఫ్యామిలీపై కామెంట్‌ చేయండి.. నేనేంటో చూపిస్తా: మంచు విష్ణు

మరి కొన్ని గంటల్లో జరగనున్న సిని‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు నటుడు మంచు విష్ణు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో ప్రత్యర్థి ప్యానల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు....

Updated : 09 Oct 2021 12:00 IST

నాగబాబు డైలాగ్‌ సినిమాల్లో వాడుకుంటా..!

హైదరాబాద్‌: మరి కొన్ని గంటల్లో జరగనున్న సిని‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు నటుడు మంచు విష్ణు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో ప్రత్యర్థి ప్యానల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు మద్దతిస్తూ ఇటీవల నాగబాబు చేసిన వ్యాఖ్యలపై విష్ణు కౌంటర్‌ ఇచ్చారు. తన ఫ్యామిలీపై ఎవరైనా కామెంట్లు చేస్తే జీవితంలో క్షమించనని హెచ్చరించారు. ‘పవన్‌కల్యాణ్‌కి కోపం వస్తే వార్‌ వన్‌సైడ్‌ అవుతుంది’ అంటూ నాగబాబు చేసిన ఓ కామెంట్‌పై విష్ణు సెటైర్‌ వేశారు. డైలాగ్‌ చాలా బాగుందని.. తన తదుపరి చిత్రాల్లో వాడుకుంటానని అన్నారు.

‘‘ఈ సారి జరగనున్న ‘మా’ ఎన్నికలు తెలుగు నటీనటుల ఆత్మగౌరవానికి సంబంధించినవి. నాకు ప్రత్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో అతడు తెలుగు వ్యక్తి కాదు. అతడి పేరు పలకడం కూడా నాకిష్టం లేదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిలయ్యాడు. ‘తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని సెట్‌ చేయడానికే ఇక్కడికి వచ్చా’ అంటూ తన మొదటి మీటింగ్‌లో అతడు చాలా ఆగ్రహావేశాలతో చెప్పాడు. అంత అవసరం లేదు. ఎందుకంటే మా సమస్యలను మేము చక్కదిద్దుకోగలం. సమస్యలు చక్కదిద్దడానికి ఇక్కడ చాలా మంది పెద్దోళ్లు ఉన్నారు. వాళ్లందరి తరఫు నుంచి అతడికి సమాధానం చెప్పడానికి నేను ఒక్కడిని చాలు. ప్రచారంలో భాగంగా అతడు నా ఫ్యామిలీపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు. ఇక్కడివాడు కాదు కాబట్టి అతడికి నా ఫ్యామిలీ గురించి ఏమీ తెలీదు.. అందుకే, క్షమించి వదిలేశాను. కానీ ఇప్పుడు ఛాలెంజ్‌ చేస్తున్నా.. దమ్ముంటే అతడిని నా ఫ్యామిలీపై కామెంట్స్‌ చేయమనండి.. నేనేంటో చూపిస్తా’ అని విష్ణు సవాల్‌ విసిరారు.

అనంతరం.. ‘‘పవన్‌కల్యాణ్‌ ప్రతిసారీ మీ నాన్న పేరే ఎందుకు ప్రస్తావిస్తారు’ అని అందరూ నన్ను అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఆ ప్రశ్న పవన్‌కల్యాణ్‌నే అడగాలి. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి ఈగో ప్రొబ్లమ్స్‌ లేవు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘వకీల్‌సాబ్‌’ సినిమా నాకు నచ్చింది. మా నాన్నకు విపరీతంగా నచ్చింది. వెంటనే పవన్‌కల్యాణ్‌కు ఫోన్‌ చేసి .. ‘సినిమా చాలాబాగుంది. ‘వకీల్‌సాబ్‌’గా నువ్వు బాగా యాక్ట్‌ చేశావు’ అని ప్రశంసించారు. దానికి పవన్‌.. ‘థ్యాంక్యూ అండి. మీ లాంటి పెద్ద నటులు ఫోన్‌ చేసి మెచ్చుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు. కావాలంటే మీరు పవన్‌ని అడగండి. ఇటీవల ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కొన్ని ప్రశ్నలు వేశారు. దానికి త్వరలోనే మా నాన్న సమాధానం చెబుతారు’

‘మెగా ఫ్యామిలీ హీరోలు నాకు మంచి స్నేహితులు. బన్నీ, చరణ్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. చరణ్‌-మనోజ్‌-మా అక్క క్లోజ్ ఫ్రెండ్స్‌‌. వాళ్లు తరచూ కలుస్తూనే ఉంటారు. నేను అంతగా కలవను. బన్నీ-నేను ఎక్కువగా మెస్సేజ్‌లు చేసుకుంటాం. శిరీష్‌ నా తమ్ముడు. తేజ్‌ అయితే నా చిన్న తమ్ముడు. మెగా హీరోస్‌తో నాది ఇప్పటి అనుబంధం కాదు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్లందరూ నాకు సపోర్ట్‌ చేస్తున్నారు’

‘మంచు విష్ణుకి ఫ్యామిలీ సపోర్ట్‌ లేదు అంటూ ప్రచారం జరుగుతోంది. అందులో ఎలాంటి నిజం లేదు. మీడియా ముందుకు మాత్రమే వాళ్లు రావడం లేదు. కానీ, వాళ్లకున్న ఫ్రెండ్స్‌ సర్కిల్‌లో వాళ్లు ప్రచారం చేస్తున్నారు. అందరికీ ఫోన్లు చేస్తున్నారు. మరి కొన్ని గంటలపాటు ప్రత్యర్థి ప్యానల్‌ వాళ్లు నాపై ఎన్ని విమర్శలైనా చేసుకోనివ్వండి. వాళ్లు శ్రుతిమించి నా ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తే వాళ్లని జీవితంలో క్షమించను’ అని మంచు విష్ణు వార్నింగ్‌ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని