RRR Postponed: ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా!

తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు, యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR Postponed) విడుదల వాయిదా పడింది.

Updated : 01 Jan 2022 17:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు, యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR Postponed) విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకుని జనవరి 7న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఎంతో కష్టపడి పనిచేసినా, కొన్ని పరిస్థితులు తమ చేయి దాటిపోయాయని పేర్కొంది. దేశంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదలను వాయిదా వేయటం తప్ప తమకు మరో మార్గం కనిపించలేదని చిత్ర బృందం తెలిపింది.

‘‘ఎంతో కష్టపడి అవిశ్రాంతంగా పనిచేసినా, కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. అనేక రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడుతున్నాయి. సినిమా విడుదల వాయిదా వేయటం తప్ప మరో మార్గం లేదు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. ఆలస్యమైనా ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తాం. ఇండియన్‌ సినిమా వైభవాన్ని సరైన సమయంలో మళ్లీ మీ ముందుకు తీసుకొస్తామని హామీ ఇస్తున్నాం’’ -ట్విటర్‌లో ఆర్ఆర్ఆర్‌ టీమ్‌

స్వాతంత్ర్య పోరాట కాలంలో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు ఎలా కలిశారు? ఏవిధంగా బ్రిటిష్ వారిపై పోరాటం చేశారన్న ఫిక్షనల్‌ కథతో ‘ఆర్ఆర్‌ఆర్‌’ను తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. రూ.400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, సముద్రఖని, అలీసన్‌ డూడీ రే స్టీవెన్‌సన్‌, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కీరవాణి మ్యూజిక్‌ డైరెక్టర్‌. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేశారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విడుదల వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని