RIP Jayanthi: ప్రముఖ నటి జయంతి కన్నుమూత

అభినయ శారదగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటి జయంతి(76) కన్నుమూశారు

Updated : 26 Jul 2021 10:28 IST

బెంగళూరు: ప్రముఖ నటి జయంతి(76) కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జయంతి మరణంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

కర్ణాటకలోని బళ్లారికి చెందిన జయంతి అసలు పేరు కమలకుమారి. 1960లో ‘యానై పాగన్‌’ అనే తమిళ సినిమాతో ఆమె మొదటిసారి బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. కన్నడ దర్శకుడు వై.ఆర్‌.స్వామి జయంతికి హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చారు. ఆయనే ఆమె పేరును జయంతిగా మార్చారు. ఆమె కథానాయికగా నటించిన తొలిచిత్రం ‘జెనుగూడు’. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500లకు పైగా చిత్రాల్లో నటించారు. నందమూరి తారకరామారావు, ఎంజీ రామచంద్రన్‌, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి అగ్రకథానాయకుల సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. ‘జగదేక వీరునికథ’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పెదరాయుడు’, ‘కులగౌరవం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటిగా ప్రెసిడెంట్‌ మెడల్‌, రెండు ఫిల్మ్‌ఫేర్‌  అవార్డులను అందుకున్నారు. సినీ పరిశ్రమకు జయంతి చేస్తున్న సేవలను గుర్తించిన కన్నడ చిత్రసీమ ఆమెను ‘అభినయ శారద’ అనే బిరుదుతో సత్కరించింది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో లోక్‌శక్తి పార్టీ తరఫున పోటీ చేసి జయంతి ఓటమి పాలయ్యారు. 1999లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పరాజయం పొందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని