The Ghost: తమ హగనే అంటే అర్థమిదే.. ది ఘోస్ట్‌ వీడియో రిలీజ్‌

‘తమ హగనే’ (Tama Hagane).. గత కొన్ని రోజులుగా సినీ ప్రియులు, ముఖ్యంగా అక్కినేని అభిమానుల్ని వెంటాడుతోన్న ప్రశ్న ఇది. వినడానికి కాస్త...

Published : 18 Aug 2022 11:12 IST

హైదరాబాద్‌: ‘తమ హగనే’ (Tama Hagane).. గత కొన్ని రోజులుగా సినీ ప్రియులు, ముఖ్యంగా అక్కినేని అభిమానుల్ని వెంటాడుతోన్న ప్రశ్న ఇది. వినడానికి కొత్తగా ఉన్న ఈ పదానికి అర్థం ఏమిటి? నాగార్జునకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి? అని అందరూ చర్చించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులందరి ప్రశ్నలకు ఒక్క వీడియోతో ‘ది ఘోస్ట్‌’ (The Ghost) చిత్రబృందం సమాధానమిచ్చింది. ‘తమ హగనే’ అంటే అర్థమేమిటో చెప్పింది.

అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకుడు. ఇందులో నాగార్జున ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ విక్రమ్‌గా కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రం అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ని తెలియజేస్తూ ఇటీవల చిత్రబృందం.. ‘తమ హగనే’ అనే పదానికి అర్థమేమిటో తెలుసుకోండి అంటూ టీజ్‌ చేసింది. ఆనాటి నుంచి నెటిజన్లందరూ ఆ పదానికి సరైన సమాధానం కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ‘తమ హగనే’ అంటే ‘విలువైన ఉక్కు’ అని అర్థం చెబుతూ ‘ది ఘోస్ట్‌’ టీమ్‌ తాజాగా ఓ వీడియో షేర్‌ చేసింది. ఇందులో నాగ్‌ ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టి.. ఆయన్ని పట్టుకునేందుకు అండర్‌వరల్డ్‌ మొత్తం అక్కడికి చేరుకున్నట్లు చూపించారు. అండర్‌ వరల్డ్‌ పంపిన వ్యక్తులు తనపై దాడి చేయనున్నారని తెలుసుకున్న నాగ్‌.. తన వద్ద ఉన్న విలువైన ఉక్కుతో కత్తిని సిద్ధం చేసి యుద్ధానికి సై అన్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 25న ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని