Tollywood: ఆఖర్లో ఆకర్షణలెన్నో!

సినిమాకి మంచి ఆరంభమే కాదు... ముగింపు కూడా అంతే కీలకం. ‘మా సినిమా ఆద్యంతం అలరిస్తుంది’ అనే మాటని చిత్రబృందాలు ఎక్కువగా వాడుతుంటాయంటే కారణం అదే!

Updated : 15 Oct 2023 11:44 IST

సినిమాకి మంచి ఆరంభమే కాదు... ముగింపు కూడా అంతే కీలకం. ‘మా సినిమా ఆద్యంతం అలరిస్తుంది’ అనే మాటని చిత్రబృందాలు ఎక్కువగా వాడుతుంటాయంటే కారణం అదే! సినిమా చివర్లోనూ తెరపై వినోదం వెల్లివిరిసిందంటే ప్రేక్షకుడు తృప్తిగా బయటికొస్తాడు. చివరి మూడు నెలలపై అదే తరహాలోనే చిత్రసీమకి అంచనాలు ఉంటాయి. మంచి క్లైమాక్స్‌లాగే... చివర్లో వచ్చే మన సినిమాలు సత్తా చాటాయంటే ఇక ఆ ఏడాదికి సంతృప్తిగా వీడ్కోలు పలకొచ్చని వ్యాపార వర్గాలు భావిస్తుంటాయి. ఎప్పట్లాగే  ఈసారి కూడా దసరా, దీపావళి, క్రిస్మస్‌ సందర్భంగా చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు విడుదలవుతున్నాయి. ఏ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏడాదిలో ఇప్పటివరకూ దాదాపు 175కిపైగా చిత్రాలు విడుదలయ్యాయి. ఇవన్నీ తెలుగులో నేరుగా తెరకెక్కినవే. అనువాద చిత్రాలు 55కిపైగానే వచ్చాయి. రానున్న కీలకమైన సీజన్లలోనూ పోటాపోటీగా చిత్రాలు విడుదల కానున్నాయి. ఇప్పటిదాకా గడిచిన సీజన్లలో సంక్రాంతి మినహా ఏదీ అనుకున్న స్థాయిలో సద్వినియోగం కాలేదు. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈసారి వేసవి అగ్ర తారల సందడి లేకుండానే గడిచిపోయింది. వినాయక చవితికీ సరైన సినిమాలు రాలేదు. ఏడాది ఆఖరి మూడు నెలల్లో మాత్రం తారల సినిమాల జోరు ఎక్కువగానే కనిపించనుంది. బాలకృష్ణ, రవితేజ, ప్రభాస్‌, నాని, కల్యాణ్‌రామ్‌, వరుణ్‌తేజ్‌, నితిన్‌ తదితర కథానాయకుల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీరికితోడుగా అన్నట్టు అనువాదాలతో పొరుగు భాషల నుంచీ అగ్ర తారలు దూసుకు రానున్నారు. 2023 క్లైమాక్స్‌లో మెరుపులే అన్నమాట. 

దసరా నుంచే...

అసలు సిసలైన ఆఖరి వరుస సినిమాలు దసరా సీజన్‌ నుంచే షురూ అవుతున్నాయి. అక్టోబరు 6నే ఓ స్థాయి అంచనాలున్న అరడజను సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కానీ, 19న బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన  ‘భగవంత్‌ కేసరి’ విడుదలవుతోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కాజల్‌ కథానాయిక. శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. ఈ సినిమాలో చాలా  ప్రత్యేకతలున్నాయని ఇటీవల బాలకృష్ణ స్వయంగా చెప్పారు. ‘దంచవే మేనత్త కూతురా...’ అనే పాట రీమిక్స్‌ ఉంటుందని సమాచారం. పండగంటే మన దగ్గర రెండు మూడు సినిమాలైనా విడుదల కావల్సిందే. అందుకే 20న ‘టైగర్‌ నాగేశ్వరరావు’గా రవితేజ హంగామా మొదలవుతుంది. గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. వంశీ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రమిది. వీరికితోడు తమిళ కథానాయకుడు విజయ్‌ నటించిన ‘లియో’ 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. హిందీ నుంచి  టైగర్‌ ష్రాఫ్‌ నటించిన ‘గణపథ్‌’ కూడా 20న విడుదలవుతోంది. దసరా తర్వాత సీజన్‌ అంటే దీపావళినే. అయితే మధ్యలోనూ ‘కీడాకోలా’ తరహా కొన్ని కీలక చిత్రాలు విడుదలవుతున్నాయి. దీపావళికి సందర్భంగా వైష్ణవ్‌తేజ్‌ ‘ఆదికేశవ’తోపాటు తమిళం నుంచి కార్తి ‘జపాన్‌’, లారెన్స్‌ ‘జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌’ తదితర చిత్రాలు విడుదల కానున్నాయి. నవంబరు 24న కల్యాణ్‌రామ్‌ ‘డెవిల్‌’ విడుదల కానుంది.

ప్రభాస్‌... షారుక్‌

డిసెంబరులో బాక్సాఫీస్‌ దగ్గర హంగామా మామూలుగా ఉండదు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సలార్‌’, షారుక్‌ ‘డంకీ’ చిత్రాలు ఒకే రోజున డిసెంబరు 22న విడుదల కానున్నాయి. నెల ఆరంభం నుంచే చిత్రాలు వరుస కడుతున్నాయి. రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా, తెలుగు దర్శకుడు  సందీప్‌ వంగా తెరకెక్కించిన ‘యానిమల్‌’ డిసెంబరు 1న విడుదల కానుంది. పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలున్న చిత్రమిది. డిసెంబరు 8న నితిన్‌ ‘ఎక్స్‌ట్రా’, వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాలు విడుదలవుతున్నాయి. వరుణ్‌ తెలుగు, హిందీ భాషల్లో నటించిన చిత్రమిది. అదే రోజున విష్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కూడా విడుదల ఖరారు చేసుకుంది. ఇక డిసెంబరు 15న ధనుష్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ విడుదల కానుంది. నాని కథానాయకుడిగా నటించిన ‘హాయ్‌ నాన్న’ డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సెప్టెంబరులో వస్తుందనుకున్న ‘సలార్‌’ డిసెంబరు 22కి వాయిదా పడటంతో సినిమాల విడుదలల సరళి ఒక్కసారిగా మారిపోయింది. ‘హాయ్‌ నాన్న’ విడుదల కూడా అటూ ఇటూ మారే అవకాశాలున్నట్టు సమాచారం. ప్రతి ఏటా దీపావళి తర్వాత సంక్రాంతే సినీ ప్రియుల్ని ఎక్కువగా ఆకర్షించేది. డిసెంబరులో అప్పుడప్పుడు కీలకమైన ఒకట్రెండు సినిమాలు వచ్చినా సంక్రాంతికే ఎక్కువ ఆకర్షణలు ఉండేవి. ఈసారి ‘సలార్‌’, ‘డంకీ’ సినిమాల వల్ల డిసెంబరులోనూ బాక్సాఫీస్‌ వసూళ్లతో కళకళలాడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని