Cobra Review: రివ్యూ: కోబ్రా

Cobra Review: విక్రమ్‌ ‘కోబ్రా’ సినిమా ఎలా ఉందంటే..!

Updated : 31 Aug 2022 14:45 IST

Cobra Review: చిత్రం: కోబ్రా; తారాగణం: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి, తదితరులు; సంగీతం: ఏఆర్ రెహమాన్; ఛాయాగ్రహ‌ణం: హరీష్ కన్నన్; కూర్పు: భువన్ శ్రీనివాసన్; నిర్మాత: ఎస్.ఎస్ లలిత్ కుమార్; రచన, దర్శకత్వం: ఆర్.అజయ్ జ్ఞానముత్తు; సంస్థ‌: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్; విడుదల: ఎన్వీఆర్ సినిమా; విడుద‌ల తేదీ: 31-08-2022

తెలుగులో బ‌ల‌మైన మార్కెట్‌ని, అభిమాన‌గ‌ణాన్ని సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు విక్రమ్‌. ఆయ‌న  చేసిన సినిమాలు త‌మిళంలోనే కాకుండా తెలుగులోనూ స‌మాంత‌రంగా విడుద‌ల‌వుతుంటాయి. నెల రోజుల వ్యవ‌ధిలోనే ఆయ‌న రెండు సినిమాల‌తో సంద‌డి చేస్తున్నారు. మొద‌ట ‘కోబ్రా’, ఆ త‌ర్వాత ‘పొన్నియిన్ సెల్వన్’. ఇక, ప్రచార చిత్రాలతో విడుద‌ల‌కి ముందే ప్రేక్షకుల్లో ప్రత్యేక‌మైన అంచ‌నాల్ని రేకెత్తించింది ‘కోబ్రా’. ‘అప‌రిచితుడు’ని గుర్తు చేసేలా విక్రమ్ గెట‌ప్పులు, భారీ హంగుల‌తో కూడిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. మ‌రి ఆ ఆస‌క్తికి త‌గ్గట్టే సినిమా ఉందో లేదో తెలుసుకునే ముందు క‌థేమిటోచూద్దాం..!

క‌థేంటంటే: ఒడిశా ముఖ్యమంత్రి  దారుణంగా హ‌త్యకి గుర‌వుతాడు. కొన్నాళ్ల వ్యవ‌ధిలోనే బ్రిటిష్ యువ‌రాజుని కూడా త‌న వివాహ వేడుక‌లో అంద‌రూ చూస్తుండ‌గా హ‌త్య చేస్తారు. దీని వెన‌క గ‌ణిత మేథావి మ‌ది (విక్రమ్‌) మాస్టర్ మైండ్ ఉంటుంది. ఫోన్, ఇంట‌ర్నెట్ వాడ‌ని మ‌ది ర‌క‌ర‌కాల మారు వేషాల‌తో చాలా తెలివిగా చేయాల‌నుకున్నది చేసేస్తుంటాడు. ఈ రెండు హ‌త్యల వెన‌క ఓ కార్పొరేట్ క‌నెక్షన్‌ని క‌నిపెడ‌తారు ఇన్వెస్టిగేష‌న్ అధికారులు. క్రిమినాల‌జీ విద్యార్థి జూడీ (మీనాక్షి) ఆ రెండు హ‌త్యలు ఒక్కరే చేశార‌ని తేలుతుంది. త‌దుప‌రి ర‌ష్యా మంత్రికి కూడా ప్రమాదం పొంచి ఉంద‌నే విష‌యాన్ని ప‌సిగ‌ట్టి ఆ దేశ అధికారుల్ని హెచ్చరిస్తాడు ఇంట‌ర్ పోల్ అధికారి అస్లాన్ (ఇర్ఫాన్ ప‌ఠాన్‌). ఓ హ్యాక‌ర్ కూడా మ‌ది ముసుగుని తొల‌గించే ప్రయ‌త్నంలో ఉంటాడు. ఇన్ని స‌వాళ్ల మ‌ధ్య మ‌ది త‌న ప్లాన్‌ని విజ‌య‌వంతంగా అమ‌లు చేశాడా లేదా? ఇంత‌కీ అత‌నెవ‌రు? ఇండియాలో లెక్కల టీచ‌ర్‌గా ప‌నిచేసే మ‌ది (విక్రమ్‌)కి ఈ నేరాలు చేయాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింద‌నేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: ఈ కథా నేప‌థ్యంలో కొత్తద‌నం ఉంది. నేర ప్రధానంగా సాగే ఇలాంటి థ్రిల్లర్ క‌థ‌ల్లో తర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తి, ఆత్రుత ప్రేక్షకుల్లో క‌ల‌గాలి. ఆ విష‌యంలో దర్శకుడు కొంతవరకూ మాత్రమే స‌ఫ‌ల‌మ‌య్యాడు. అయితే జీనియ‌స్ మైండ్ అంటూ విక్రమ్ పాత్రని వీర లెవెల్లో ప‌రిచ‌యం చేసిన‌ట్టుగా, దాని చుట్టూ థ్రిల్లింగ్‌గా, లాజిక‌ల్‌గా స‌న్నివేశాల్ని అల్లడంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఓ ప‌త్రిక‌లో వ‌చ్చే సుడొకు పూర్తి చేసి త‌నకు అవ‌స‌ర‌మైన ఓ కోడ్‌ని క‌నుక్కోవ‌డ‌మే జీనియ‌స్ మైండ్ అన్నట్టుగా చూపించారంతే. మేథ‌మెటీషియ‌న్ మైండ్‌కీ... తెర‌పై జ‌రిగే హ‌త్యల తీరుకీ మ‌ధ్య పెద్దగా లింక్ కుద‌ర‌లేదు. చాలా సినిమాల్లో చూసిన‌ట్టే ఉంటాయి త‌ప్ప ఆ స‌న్నివేశాల్లో కొత్తగా చూపించిందేమీ లేదు. క‌థ‌నంలో గంద‌ర‌గోళం, క‌థానాయ‌కుడు మాన‌సిక స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతూ చుట్టూ మ‌నుషులు ఉన్నట్టుగా ఊహించుకునే స‌న్నివేశాలు గ‌జిబిజిగా అనిపిస్తాయి. క‌థానాయ‌కుడి ఫ్లాష్‌బ్యాక్‌,  విరామ స‌న్నివేశాల్లో మ‌లుపులు, యాక్షన్ స‌న్నివేశాల్లో భారీ హంగులు, విక్రమ్ గెట‌ప్పులతో సినిమాకి కొత్తద‌నాన్ని జోడించే ప్రయ‌త్నం చేశారు. ఆరంభ స‌న్నివేశాలు సాదాసీదాగానే అనిపించినా, క‌థానాయ‌కుడు హ‌త్యలు చేయ‌డం నుంచి క‌థ‌లో వేగం పుంజుకుంటుంది. వ‌రుస‌గా మూడు నేరాలు, వాటి ప‌ర్యవ‌సానాలు, క్రిమిన‌ల్‌ని క‌నుక్కోవ‌డం కోసం చేసే ప్రయ‌త్నాల‌తో  ప్రథ‌మార్ధం సాగుతుంది. విరామ స‌న్నివేశాలు ద్వితీయార్ధంపై ఆస‌క్తిని పెంచుతాయి. అయితే అక్కడ మ‌ది ఫ్లాష్ బ్యాక్ స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపించ‌డం, విల‌న్‌తో సాగించే పోరాటంలో ప‌స లేక‌పోవ‌డంతో సినిమా గాడి త‌ప్పిన‌ట్టయ్యింది.  మూడు గంట‌ల‌కిపైగా నిడివి ఉన్న ఈ సినిమా చాలా చోట్ల సాగ‌దీత‌గా అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: క‌మ‌ల్‌హాస‌న్ ‘ద‌శావ‌తారం’ సినిమాని గుర్తు చేస్తుంది ఇందులో విక్రమ్ గెట‌ప్పులు. ఈ క‌థ‌లో ఆయ‌న్ని ఆక‌ట్టుకున్న ప్రధాన‌మైన అంశం కూడా అదేనేమో. అయితే ఆ అవ‌తారాల‌న్నీ కూడా తొలి స‌గ‌భాగానికే ప‌రిమితం అయ్యాయి. ద్వితీయార్ధంలో కొత్త గెట‌ప్పుల‌కి ఆస్కారం ద‌క్కలేదు. న‌ట‌న‌కి ప్రాధాన్యమున్న ఆ పాత్రలో విక్రమ్ త‌న మార్క్‌ని ప్రద‌ర్శించారు. యాక్షన్ ఘ‌ట్టాల్లోనూ ఆయ‌న ప‌నితీరు ఆక‌ట్టుకుంటుంది. శ్రీనిధి శెట్టి, మృణాళిని ర‌వి, మీనాక్షి పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్రతినాయ‌కుడు రిషి పాత్రని భ‌యంక‌రంగా చూపించినా, ప‌తాక స‌న్నివేశాల్లో మాత్రం ఆ పాత్ర తేలిపోయింది. క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఓ ప్రొఫెష‌న‌ల్ న‌టుడిలాగే క‌నిపించారు. సినిమాలో ఆయ‌న పాత్ర దాదాపు అన్ని స‌న్నివేశాల్లో క‌నిపిస్తుంది కానీ, అందులో బ‌లం క‌నిపించ‌దు. కె.ఎస్‌.ర‌వికుమార్‌, ఆనంద్‌రాజ్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం చిత్రానికి ప్రధాన బ‌లం.  పాట‌లు, వాటి చిత్రీక‌ర‌ణ బాగుంది. నేప‌థ్య సంగీతంతో క‌థ‌కి మరింత థ్రిల్‌ని అందించే ప్రయ‌త్నం చేశారు. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఎడిటింగ్ ప‌రంగా చాలా లోపాలు క‌నిపిస్తాయి. సుదీర్ఘంగా సాగే స‌న్నివేశాలు ప్రేక్షకుడి ఓపిక‌ని ప‌రీక్షిస్తాయి. ద‌ర్శకుడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు కొత్త నేప‌థ్యాన్ని ఎంచుకున్నప్పటికీ, ఆయ‌న క‌థ‌ని ప్రేక్షకుల‌కు అర్థమ‌య్యేలా చెప్పడంలో విఫ‌ల‌మ‌య్యారు. ద్వితీయార్ధంలో ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ స‌న్నివేశాలు ఇబ్బంది పెడ‌తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.

బ‌లాలు
+క‌థానేప‌థ్యం
+విక్రమ్ న‌ట‌న
+భారీ హంగులు, పోరాట ఘ‌ట్టాలు, విరామ స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు
-
గంద‌ర‌గోళంగా సాగే స‌న్నివేశాలు
- క‌థ‌నంలో థ్రిల్ కొర‌వ‌డ‌టం
- నిడివి

చివ‌రిగా: అవ‌తారాల‌తో విక్రమ్  ‘కోబ్రా’.. సినిమా సాగదీసి చేశారు గాబరా!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని