Vinaro Bhagyamu Vishnu Katha Review: రివ్యూ: వినరో భాగ్యము విష్ణు కథ

Vinaro Bhagyamu Vishnu Katha Review: కిరణ్‌ అబ్బవరం, కశ్మీర కీలక పాత్రల్లో నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ ఎలా ఉందంటే?

Updated : 18 Feb 2023 20:31 IST

Vinaro Bhagyamu Vishnu Katha Review; చిత్రం: విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌; న‌టీన‌టులు: కిర‌ణ్ అబ్బ‌వ‌రం, క‌శ్మీరా, శుభ‌లేఖ సుధాక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, కేజీఎఫ్ ల‌క్కీ, ప‌మ్మి సాయి, దేవి ప్ర‌సాద్‌, ఎల్బీ శ్రీరామ్‌, శ‌ర‌త్ లోహితస్వ‌, ఆమ‌ని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు; సంగీతం:  చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌; ఛాయాగ్ర‌హ‌ణం: డేనియ‌ల్ విశ్వాస్‌; ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళీ కిషోర్ అబ్బూరు; నిర్మాత‌: బ‌న్నీ వాస్‌; స‌మ‌ర్ప‌ణ‌: అల్లు అర‌వింద్‌; విడుద‌ల తేదీ:18-02-2023

‘రాజా వారు రాణీగారు’, ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణ మండ‌పం’ వంటి వ‌రుస విజ‌యాల‌తో ఇటు చిత్ర‌సీమ‌లో, అటు ప్రేక్ష‌కుల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. కానీ, ఆ త‌ర్వాత ఆయ‌న నుంచి వ‌చ్చిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో మెప్పించ‌లేదు. ఈ త‌రుణంలో విజ‌య‌మే ల‌క్ష్యంగా ‘విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌’తో బాక్సాఫీస్ ముందుకొచ్చారు కిర‌ణ్‌. గీతా ఆర్ట్స్‌2 వంటి పేరున్న బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డం.. పాట‌లు, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకునేలా ఉండ‌టంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఈ విష్ణు క‌థ ఏంటి? (Vinaro Bhagyamu Vishnu Katha Review) అది సినీప్రియుల్ని మెప్పించిందా?  లేదా?

క‌థేంటంటే: ‘బాగుండ‌ట‌మంటే మ‌నం బాగుండ‌టం కాదు, ప‌క్క‌వాళ్ల‌తో బాగుండ‌ట‌మే’ అని తన తాత చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డిన కుర్రాడే విష్ణు(కిర‌ణ్ అబ్బ‌వ‌రం). అత‌నిది తిరుప‌తి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో ప‌ని చేస్తుంటాడు. సాయం చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే త‌న‌కు నంబ‌ర్ నైబ‌ర్ అనే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌న (క‌శ్మీరా) ద‌గ్గ‌ర‌వుతుంది. ఆమె ఓ యూట్యూబ‌ర్‌. త‌న యూట్యూబ్ ఛానెల్‌తో పాపులారిటీ తెచ్చుకోవాల‌న్న ల‌క్ష్యంతో నంబ‌ర్ నైబ‌ర్ కాన్సెప్ట్ ద్వారా ప‌రిచ‌య‌మైన విష్ణు, శ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ‌)ల‌తో క‌లిసి వీడియోలు చేస్తుంటుంది. (VBVK Review) ఈ క్ర‌మంలోనే విష్ణు, శ‌ర్మ ఇద్ద‌రూ ద‌ర్శ‌న‌ను ప్రేమిస్తారు. అయితే ఆమె ఓరోజు శ‌ర్మ‌తో క‌లిసి లైవ్ మ‌ర్డ‌ర్ అనే ప్రాంక్ వీడియో చేస్తుంది. కానీ, ఆ ప్ర‌య‌త్నంలో శ‌ర్మ నిజంగానే ద‌ర్శ‌న పేల్చిన తూటాకు బ‌ల‌వుతాడు.  దీంతో ఆ హ‌త్య కేసులో ద‌ర్శ‌న జైలు పాల‌వుతుంది. మ‌రి ఈ కేసు నుంచి త‌న ప్రేయ‌సిని బ‌య‌ట ప‌డేయ‌టం కోసం విష్ణు ఏం చేశాడు? (Vinaro Bhagyamu Vishnu Katha Review) శ‌ర్మ‌ను ద‌ర్శ‌న నిజంగానే హ‌త్య చేసిందా? ఈ హ‌త్య‌కు రాజ‌కీయ నాయ‌కుడు (కేజీఎఫ్ ల‌క్కీ)కు ఉన్న లింకేంటి?  ముంబ‌యి గ్యాంగ్‌స్ట‌ర్‌ రాజ‌న్ (శ‌ర‌త్ లోహిత‌స్వ‌)కు విష్ణు త‌న క‌థ ఎందుకు చెప్పాడు? అత‌న్ని ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న నేష‌న‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారుల‌కు విష్ణు ఎలా సాయ‌ప‌డ్డాడు? అన్న‌ది తెర‌పై చూసి  తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే: మ‌న ప‌క్క నంబ‌ర్‌కు ఫోన్ చేసి ప‌రిచ‌యం పెంచుకోవ‌డం అనే ఓ కొత్త కాన్సెప్ట్‌తో అల్లుకున్న క‌థ ఇది. దీనికి ఓ ప్రేమ క‌థ‌ను,  ఒక‌ క్రైమ్‌ ఎలిమెంట్‌ను, సాయం, దేశ‌భ‌క్తి అనే సందేశాల్ని జోడించి ఆస‌క్తిక‌రంగా క‌థ సిద్ధం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు ముర‌ళి కిషోర్‌. నిజానికి ఓ క‌థ‌లో ఇన్ని అంశాల్ని మిళితం చేయాల‌ని ప్ర‌య‌త్నించినప్పుడు ఆ మేళ‌వింపు స‌రిగ్గా కుద‌ర‌కుంటే క‌థ‌న‌మంతా కల‌గాపుల‌గమ‌య్యే ప్ర‌మాద‌ముంటుంది. అయితే, ఈ ప‌రీక్ష‌లో ముర‌ళీ చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. త‌ను చెప్పాల‌నుకున్న అంశాల‌న్నింటినీ ఎలాంటి గంద‌ర‌గోళం లేకుండా తెర‌పై ఆస‌క్తిక‌రంగా ఆవిష్క‌రించ‌గ‌లిగాడు. ఈ చిత్రం ప్ర‌థ‌మార్ధమంతా  ఓ స‌ర‌దా  ప్రేమ‌క‌థ‌లా.. ద్వితీయార్ధమంతా ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లా సాగిపోతుంది. అయితే ఇందులో విరామానికి ముందొచ్చే ట్విస్ట్ మెప్పించినా.. క్లైమాక్స్‌కు ముందొచ్చే ట్విస్ట్ మ‌రీ సిల్లీగా అనిపిస్తుంది. (Vinaro Bhagyamu Vishnu Katha Review) దీన్ని ప్రేక్ష‌కులు ఎలా స్వీక‌రిస్తార‌న్న దానిపైనే చిత్ర ఫ‌లితం ఆధార‌పడి ఉంది.

ముంబ‌యి గ్యాంగ్‌స్ట‌ర్‌ రాజ‌న్ కోణం నుంచి క‌థ‌ను ప్రారంభించిన తీరు ఆస‌క్తిరేకెత్తిస్తుంది. అత‌నికి విష్ణు త‌న క‌థ చెప్ప‌డంతోనే ఈ చిత్రం ప్రారంభ‌మ‌వుతుంది. నంబ‌ర్ నైబ‌ర్ కాన్సెప్ట్‌తో విష్ణు జీవితంలోకి ద‌ర్శ‌న రావ‌డం.. ఆమె ద్వారా శ‌ర్మ ప‌రిచ‌య‌మ‌వ‌డం.. వాళ్లు ముగ్గురు క‌లిసి వీడియోలు చేయ‌డం.. ఈ క్ర‌మంలో సాగే ప్ర‌యాణ‌మంతా స‌ర‌దాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ద‌ర్శ‌న - శ‌ర్మ‌ల  మ‌ధ్య వ‌చ్చే రీల్ వీడియోస్ ట్రాక్ అంద‌రినీ న‌వ్విస్తుంది. అలాగే ఈ మ‌ధ్య‌లో వ‌చ్చే రెండు యాక్ష‌న్ బ్లాక్‌లు ఆక‌ట్టుకుంటాయి.  అయితే సినిమా స‌ర‌దాగా సాగుతున్నా విరామానికి ముందు కానీ అస‌లు క‌థ మొద‌లు కాదు. (VBVK Review) ఓ చ‌క్క‌టి ట్విస్ట్‌తో ఇంట‌ర్వెల్ కార్డ్ వేసిన తీరు బాగుంది. ప్ర‌థ‌మార్ధమంతా ప్రేమ‌క‌థ‌తో సాగితే.. ద్వితీయార్ధం పూర్తిగా థ్రిల్ల‌ర్ మూడ్‌లో న‌డుస్తుంది. అయితే ఇందులో కొన్ని మ‌లుపులు ఆస‌క్తిరేకెత్తిస్తే.. మ‌రికొన్ని పూర్తిగా తేలిపోయాయి. శ‌ర్మ హ‌త్య వెన‌కున్న చిక్కుముడుల‌ను విప్పే తీరు బాగుంది. (Vinaro Bhagyamu Vishnu Katha Review) అయితే ఈ కేసును నంబ‌ర్ నైబ‌ర్ కాన్సెప్ట్‌తో విష్ణు ఛేదించిన తీరు మ‌రీ సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ప‌తాక స‌న్నివేశాల‌కు ముందొచ్చే మ‌రో ట్విస్ట్‌.. క‌థ‌ను దేశ‌భ‌క్తి కోణంలోకి మ‌ల‌చిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఇందులో కొన్ని స‌న్నివేశాలు లాజిక్‌కు దూరంగా అనిపించినా.. ప్రేక్ష‌కుల చేత చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి. దీనికి సీక్వెల్ ఉందంటూ సినిమాని ముగించిన తీరు ఆస‌క్తిరేకెత్తించేలాగే ఉంది.

ఎవ‌రెలా చేశారంటే:  విష్ణు పాత్ర‌లో కిర‌ణ్ ఓ ప‌క్కింటి కుర్రాడిలా చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఆయ‌న న‌ట‌న ఆద్యంతం ఆక‌ట్టుకున్నా.. ఎమోష‌న‌ల్‌ స‌న్నివేశాల్లో తేలిపోయిన‌ట్లు అనిపించారు. ఫైట్ల‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. కానీ, అవి కిర‌ణ్ ఇమేజ్‌కు మించిన స్థాయిలో ఉన్న‌ట్లు అనిపిస్తాయి. సినిమాలో చాలా సంభాష‌ణ‌లు ప్రేక్షకుల చేత చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి. మ‌రికొన్ని ప్ర‌వ‌చ‌నాల్లా అనిపిస్తాయి. (VBVK Review) ద‌ర్శ‌న‌గా క‌శ్మీరా అందంగా క‌నిపించింది. క‌థ‌కు ఆమె పాత్ర కీల‌క‌మైనా.. త‌న‌కు పెద్ద‌గా న‌టించే ఆస్కారం దొర‌క‌లేదు. ప్ర‌థ‌మార్ధంలో న‌వ్వించిన ముర‌ళి శ‌ర్మ పాత్ర‌.. ద్వితీయార్ధంలో మ‌రో కోణంలో స‌ర్‌ప్రైజ్ చేస్తుంది. ఆయ‌న కెరీర్‌లో ఈ శ‌ర్మ పాత్ర ఎంతో ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. (Vinaro Bhagyamu Vishnu Katha Review) విష్ణు తాత‌గా శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాజ‌న్‌గా శ‌ర‌త్ పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. ఎల్‌.బి.శ్రీరామ్‌, దేవి ప్ర‌సాద్, ఆమ‌ని వంటి సీనియ‌ర్ ఆర్టిస్ట్‌లు క‌నిపించినా.. వారి పాత్ర‌ల‌కు అంత ప్రాధాన్య‌త క‌నిపించ‌దు. ముర‌ళి కిషోర్ త‌ను అనుకున్న క‌థ‌ను అనుకున్న‌ట్లుగా చెప్ప‌డంలో దాదాపుగా స‌క్సెస్ అయ్యాడు. క‌థ‌లోని కొన్ని ప్ర‌ధాన లోపాల్ని స‌రిదిద్దుకొని ఉంటే సినిమా మ‌రో స్థాయిలో ఉండేది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ త‌న సంగీతంతో ఈ సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లారు. పాట‌లు గుర్తుంచుకునే స్థాయిలో లేకున్నా.. విన‌సొంపుగా ఉన్నాయి. నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. డేనియ‌ల్ కెమెరా వ‌ర్క్ బాగుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

బ‌లాలు: + క‌థా నేప‌థ్యం; + కిర‌ణ్ న‌ట‌న‌, ముర‌ళీ శ‌ర్మ పాత్ర‌; + పాట‌లు, నేప‌థ్య సంగీతం

బ‌ల‌హీన‌త‌లు:  - నిదానంగా సాగే ప్ర‌థ‌మార్ధం; - సిల్లీగా అనిపించే కొన్ని ట్విస్ట్‌లు

చివ‌రిగా: కాల‌క్షేపాన్నిచ్చే విష్ణు క‌థ‌..(Vinaro Bhagyamu Vishnu Katha Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని