Published : 30 May 2022 09:50 IST

Writer review: రివ్యూ: రైటర్‌

Writer review; చిత్రం: రైటర్‌; నటీనటులు: సముద్రఖని, హరి కృష్ణన్‌, కెవిన్‌ జయబాబు, ఇనియా, దిలీపన్‌, జీఎం సుందర్‌ తదితరులు; సంగీతం: గోవింద్‌ వసంత; సినిమాటోగ్రఫీ: ప్రదీప్‌ కాళీ రాజా; ఎడిటింగ్‌: మణికందన్‌ శివకుమార్‌; నిర్మాత: పా.రంజిత్‌, అభ్యానంద్‌ సింగ్‌, పీయూష్‌ సింగ్‌, అదితి ఆనంద్‌; రచన, దర్శకత్వం: ఫ్లాంక్లిన్‌ జాకబ్‌; విడుదల: ఆహా

తెలుగుతో పోలిస్తే ఇతర చిత్ర పరిశ్రమల్లో ప్రయోగాత్మక చిత్రాలు తరచూ పలకరిస్తుంటాయి. కమర్షియల్ హంగులకు దూరంగా కథే పరమావధిగా అవి తెరకెక్కుతాయి. అలా గతేడాది తమిళంలో విడుదలైన చిత్రం ‘రైటర్‌’. దర్శకుడు పా.రంజిత్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫ్రాంక్లిన్‌ జాకబ్‌ తెరకెక్కించారు. విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటి? (Writer review)ఎలా ఉంది?

కథేంటంటే: అమలాపురంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తుంటాడు రంగరాజు(సముద్రఖని). ఉన్నతాధికారులకే కాదు, కింది స్థాయి పోలీసులకు కూడా ఓ సంఘం ఉండాలని, దాని ద్వారా వారి హక్కులను కాపాడుకోవచ్చని న్యాయస్థానంలో పోరాటం చేస్తుంటాడు. ఇది పై అధికారులకు నచ్చదు. దీంతో అతడిని విశాఖపట్నంలోని మరో పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు. పదవీ విరమణకు ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండటంతో ఎలాగో నెట్టుకొచ్చేద్దామని అక్కడకు వెళతాడు. అదే సమయంలో దేవకుమార్‌(హరి కృష్ణన్‌) అనే పీహెచ్‌డీ విద్యార్థిని ఆ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అదుపులోకి తీసుకుని ఓ లాడ్జిలో పెట్టి విచారిస్తుంటాడు. ఆ యువకుడు తప్పించుపోకుండా చూసే బాధ్యతను రంగరాజుకు అప్పగిస్తారు. ఇంతకీ దేవకుమార్‌ను ఎందుకు దాచి ఉంచి విచారిస్తున్నారు? ఈ క్రమంలో రంగరాజు చేసిన పని కారణంగా దేవకుమార్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు రంగరాజు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇప్పటివరకూ వెండితెరపై అనేక రకాల క్రైమ్‌ థ్రిల్లర్‌లు సందడి చేశాయి. ఒక్కో కథది ఒక్కో నేపథ్యం. ఇలాంటి సినిమాలకు కీ పాయింట్‌ ఎంత బలంగా ఉంటే సినిమా అంత రక్తి కడుతుంది. ఆరంభం నుంచి చివరి వరకూ ఉత్కంఠతో సాగే సన్నివేశాలు ఉంటేనే ఈ సినిమాలు ప్రేక్షకుడిని రంజింపచేస్తాయి. ఈ విషయంలో ‘రైటర్‌’ ఆ స్థాయి మార్కును అందుకోలేకపోయినా, చివరి వరకూ కథ, పాత్రలను ప్రేక్షకుడికి కనెక్ట్‌ చేయడంలో యువ దర్శకుడు ఫ్రాంక్లిన్‌ జాకబ్‌ విజయం సాధించారు. రంగరాజుగా సముద్రఖని పాత్ర, అతడి కుటుంబాన్ని చూపిస్తూనే, మరోవైపు పోలీస్‌ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. తమ కంటే ర్యాంకు తక్కువ ఉన్న ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించే తీరు, ఉద్యోగంలో కులాల ప్రస్తావన ఇలా ఒక్కో అంశాన్ని ప్రస్తావించడం బాగున్నా, సన్నివేశాలు, సంభాషణలు సుదీర్ఘంగా సాగడంతో ఆరంభ సన్నివేశాలన్నీ చాలా నెమ్మదిగా సాగుతాయి. దేవ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అతడిని కస్టడిలోకి తీసుకోవడం, లాడ్జిలో ఉంచి విచారించటం, కేసు ఏంటో చెప్పకుండా సంతకాలు పెట్టమనడం ఆయా సన్నివేశాలు ‘నాంది’, ‘విచారణై’ సినిమాలను గుర్తు చేస్తాయి.

దేవకుమార్‌ అరెస్టు, విచారణతోనే కథ, అందులోని ట్విస్ట్‌లను ద్వితీయార్ధంలో ఒక్కోదాన్ని రివీల్‌ చేసుకుంటూ వచ్చాడు దర్శకుడు. దేవ కుమార్‌ను ప్రేమ వ్యవహారం కారణంగా అరెస్టు చేసి ఉంటారని భావించిన ప్రేక్షకుడికి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు. అసలు విషయం తెలిసిన తర్వాత రంగరాజు కూడా తీవ్ర మానసిన వేదనకు గురవుతాడు. దేవ కుమార్‌ అరెస్టు వెనుక నేపథ్యంలోనూ పోలీస్‌ వ్యవస్థలో ఉన్నతాధికారులు వ్యవహరించే తీరు, కులాల ప్రస్తావన ప్రధానంగా చర్చించాడు. పోలీసుల నుంచి దేవకుమార్‌ను తప్పించేందుకు రంగరాజు చేసే ప్రయత్నాలతో పతాక సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి.  చివరి 30 నిమిషాలు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కట్టి పడేయటంతో పాటు, భావోద్వేగాన్ని కలిగిస్తాయి.

ఎవరెలా చేశారంటే: రంగరాజు రాజు పాత్రలో సముద్రఖని ఒదిగిపోయి నటించారు. ఇద్దరు భార్యలకు భర్తగా, పదవీ విరమణకు దగ్గరపడిన పోలీసు ఉద్యోగిగా ఆయన నటన బాగుంది. తప్పు చేశామన్న భావనతో తీవ్రంగా మదనపడే సన్నివేశాల్లో ఆయన నటన హైలైట్‌. దేవకుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శర్మ,  పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే రాజా ఇలా ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. గోవింద్‌ వసంత సంగీతం పర్వాలేదు. ఒకట్రెండు పాటలు ఉన్నా పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కథలో ప్రేక్షకుడిని లీనం చేసింది. ప్రదీప్‌ కాళిరాజా సినిమాటోగ్రఫీ బాగుంది. మణికందన్‌ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. సన్నివేశాలన్నీ సుదీర్ఘంగా సాగాయి. తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండటంతో కోసం అలా వదిలేసి ఉండవచ్చు. ఒక పాయింట్‌ను దాచి పెట్టి రెండున్నర గంటల పాటు ఓటీటీలో అదీ మొబైల్‌/టీవీ ముందు ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం కుదరని పని. తొలి చిత్రమే అయినా, ఫ్రాంక్లిన్‌ జాకబ్‌ఎంచుకున్న పాయింట్‌ బలమైంది. దాన్ని తెరపై చూపించటంతో పాస్‌ అయ్యారు. కథకు భావోద్వేగాలను జోడించి, హృదయానికి హత్తుకునేలా తెరపై చూపే ప్రయత్నం చేశారు. సినిమా నిడివి తగ్గి, అసలు పాయింట్‌పైనే దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో విధంగా ఉండేది. డిఫరెంట్‌గా ఏదైనా క్రైమ్‌ థ్రిల్లర్‌ చూడాలనుకుంటే ‘రైటర్‌’ ప్రయత్నించవచ్చు. కానీ, కాస్త ఓపిక ఉండాలంతే!

బలాలు

+ సముద్రఖని

+ దర్శకుడు ఎంచుకున్న పాయింట్

+ సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

- నెమ్మదిగా సాగే కథనం

- సినిమా నిడివి

చివరిగా:  స్లో ‘రైటర్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని