ముప్పు దేశాల ప్రయాణికులపై అప్రమత్తం
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రీజనల్ డైరెక్టర్, ఎయిర్‌పోర్టు హెల్త్ ఆర్గనైజేషన్ ముఖ్య
వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
అన్ని నిబంధనలు పూర్తయ్యాకే బయటికి పంపుతున్నాం
శంషాబాద్‌లో ఒకేసారి 4 వేల నమూనాలు పరీక్షించే వీలుంది
‘ఈనాడు’తో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రీజనల్ డైరెక్టర్ అనూరాధ
ఈనాడు - హైదరాబాద్
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రీజనల్ డైరెక్టర్, ఎయిర్‌పోర్టు హెల్త్ ఆర్గనైజేషన్ ముఖ్య అధికారి మేడోజు అనూరాధ తెలిపారు. ముప్పు ఉన్న(రిస్క్) దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వస్తేనే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నామన్నారు. హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న అనూరాధ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు, నిర్ధారణ పరీక్షల తీరు, పాజిటివ్‌గా నిర్ధారణయితే తీసుకుంటున్న చర్యలను ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు.
ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల విషయంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు ?
విదేశాల నుంచి వచ్చే వారు, ప్రయాణానికి ముందు ఎయిర్‌సువిధ పోర్టల్ వివరాలు నమోదు చేసుకోవాలి. గత 14 రోజులలో ఏయే దేశాలు సందర్శించారో తెలపాలి. విమానం దిగిన తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. శరీర ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటే..స్వీయ ధ్రువీకరణ పత్రం, ఆర్టీపీసీఆర్ నివేదిక, టీకాలు వేసుకున్నారనే ఆధారాలను పరిశీలించి పంపుతున్నాం. 12 రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను మాత్రం ఆర్టీపీసీఆర్ చేసి, ఫలితాలు వచ్చాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తున్నాం. పాజిటివ్‌గా తేలితే నేరుగా ఐసోలేషన్‌కు పంపుతున్నాం. వారి నుంచి రక్త నమూనాలు తీసుకుని జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నాం.
పాజిటివ్‌గా నిర్ధారణయిన పక్షంలో..వారితో వచ్చిన వారి విషయంలో ఎలాంటి వైఖరి అనుసరిస్తున్నారు ?
పాజిటివ్ వచ్చిన ప్రయాణికుడి పక్కన, వెనుక, ముందు మొత్తంగా మూడు వరుసలలో కూర్చున్నవారిని ప్రైమరీ కాంటాక్టులుగా పరిగణిస్తున్నాం. వారంతా వారం రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తున్నాం. వారి వివరాలను జిల్లా సర్వేలెన్స్ అధికారులకు అందజేస్తున్నాం. ఎనిమిదో రోజు వైద్యారోగ్య శాఖాధికారులు మరోసారి ఆర్టీపీసీఆర్ చేస్తారు. అందులో పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌కు పంపిస్తారు. లేకపోతే మరో ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తున్నాం.
హైదరాబాద్ విమానాశ్రయంలో రోజుకు సగటున ఎంతమందిని పరీక్షిస్తున్నారు.. ?
ఈ నెల 3వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం వరకు రిస్క్ లేని దేశాల నుంచి 19 విమానాలలో 3,077 మంది వచ్చారు. రిస్క్ దేశాల నుంచి రెండు విమానాలలో 400 మంది వచ్చారు. వీరికి ఆర్టీపీసీఆర్ చేస్తే 8 మందికి పాజిటివ్ వచ్చింది. ఎయిర్‌పోర్టులో 4 వేల నమూనాలను ఒకేసారి విశ్లేషించే సామర్థ్యంతో ప్రయోగశాల ఉంది. ప్రతి ప్రయాణికుడికి పరీక్ష చేసేందుకు 15 నిమిషాలు తీసుకుంటున్నాం. 400 మంది కూర్చొనేలా లాంజ్ సౌకర్యం ఉంది.
ప్రయాణానికి ముందు నెగెటివ్‌గా ఉన్నప్పటికీ, ఎయిర్‌పోర్టులో దిగాక ఎక్కువ మందికి పాజిటివ్‌గా నిర్ధారణవుతోంది. దీనికి కారణాలేమిటి ?
ప్రయాణానికి 72 గంటల ముందు ఇస్తున్న నివేదిక అది. దానికితోడు ప్రయాణం సమయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. కొందరు వేరొక దేశం మీదుగా కనెక్టింగ్ విమానాలలో వస్తుంటారు. ఇలా కొందరి ప్రయాణ సమయం నాలుగు నుంచి ఆరు రోజులకుపైగా పడుతోంది. అందుకే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేశాం.
ఆర్టీపీసీఆర్ ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోందని, అధిక ఛార్జీలు తీసుకుంటున్నారనే విమర్శలపై ఏమంటారు ?
ఇక్కడ రెండు రకాల నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ర్యాపిడ్ పీసీఆర్ పరీక్ష చేయించుకుంటే గంట లేదా రెండు గంటల్లోనే ఫలితాలు వస్తాయి. ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే నాలుగు గంటలు పడుతుంది. ఏది కావాలో ప్రయాణికులే ఎంచుకోవచ్చు. ధరలను ప్రైవేటు ల్యాబ్ నిర్ణయిస్తోంది. నాకు తెలిసినంత వరకు పరీక్షకు రూ.999 తీసుకుంటున్నారు. లాంజ్ సౌకర్యం, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించినందుకు అదనపు ఛార్జీలు తీసుకుని ఉండవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
NTR 100th Birth Anniversary: రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారు: మోదీ
-
World News
USA: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం
-
Sports News
Shubman Gill: కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Movies News
keerthy suresh: కీర్తి సురేశ్ పెళ్లిపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తండ్రి
-
India News
Shah Rukh Khan: కొత్త పార్లమెంట్‌పై షారుక్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోదీ..!